ఢిల్లీ మీకు.. తెలంగాణ మాకు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తెలంగాణ ఉభయసభల్లో ఆమోదం పొందగానే కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటానని, తెలంగాణ రాష్ట్రంపై తమకే సంపూర్ణ అధికారమివ్వాలని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటయ్యే ప్రభుత్వంపై, తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీపై తమకే అధికారాలు ఉండాలని చెబుతున్నారు.
ఎంపీ సీట్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని, అన్ని విషయూల్లోనూ మీరనుకున్నట్టుగానే ముందుకు వెళ్లవచ్చని సూచిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం బేషరతుగానే విలీనం చేయాలని కోరుతోంది. దశాబ్దాల తరబడి పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు, పార్టీ శ్రేణులను కాదని పూర్తి అధికారాలు సాధ్యం కాదని కాంగ్రెస్ అధిష్టానం తెగేసి చెబుతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బేషరతుగా విలీనం చేస్తామని చెప్పిన మాటను అమలు చేయాలని కోరుతోంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత రాజకీయ అవకాశాలు తప్పకుండా వస్తాయని, విలీనానికి ముందుగానే షరతులను విధించడం సరైంది కాదని ఆ పార్టీ అధిష్టాన పెద్దలు చెబుతున్నారు. దీంతో విలీనంపై దాగుడు మూతలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు విలీనానంతరం తెలంగాణపై, రాష్ట్ర పార్టీపై పూర్తి అధికారాలు ఇవ్వడం వీలుకాకుంటే ఎన్నికల పొత్తుకు పరిమితం అవుదామని కూడా కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పొత్తులు మాత్రమే ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నట్టు సమాచారం. పార్టీలుగా కొనసాగుతూనే పొత్తులు పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు బలోపేతం కాకుండా ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిపాదనలను విన్న కాంగ్రెస్ పెద్దలు మూడు నాలుగురోజుల్లో చెబుతామన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించారుు.
దిగ్విజయ్‌తో భేటీలో కేకే లేరు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో కేసీఆర్, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆదివారం సాయంత్రం భేటీ అయినట్టు పార్టీవర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. అయితే ఆ భేటీలో కేసీఆర్ ఒక్కరే ఉన్నారని, కేకే హాజరుకాలేదని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
సోనియాగాంధీని కేవలం కేసీఆర్ కుటుంబసభ్యులే కలిసిన నేపథ్యంలో పార్టీలో మరెవరూ లేరా? అనే విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌తో భేటీలో కేకే ఉన్నట్టు పార్టీ కార్యాలయం నుండి ప్రకటన (ఎస్‌ఎంఎస్) విడుదల చేశారు. దీనిపైనా సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28న లేదా మార్చి 1న పొలిట్‌బ్యూరో భేటీ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.