ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమే: దిగ్విజయ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రాంతాలకు లబ్ది చేకూర్చేందుకు తమ పార్టీ కృషి చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభజన నిర్ణయం సులువైంది కాదన్నారు. ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమన్నారు. అయితే ఎవరికీ బాధ కలగకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చేశామని చెప్పారు. మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అన్ని పార్టీలు చెప్పాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలిచ్చామని తెలిపారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించామన్నారు. దీంతో సీమాంధ్ర పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్మిర్మాణం, సీమాంధ్ర అభివృద్ధి జరగాలన్నారు.
విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ను వదిలి కిరణ్ కొత్త పార్టీ పెట్టడం బాధ కలిగించిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని దిగ్విజయ్ వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు వస్తే పొత్తులపై ఆలోచిస్తామన్నారు.