
'విలీన చర్చలే జరగలేదు, మీడియా దుష్ప్రచారం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనంపై ఇంతవరకు చర్చలే జరగలేదని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. "కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనంపై ఆంధ్రా మీడియా సాగిస్తున్న ప్రసారాలు కేవలం దుష్ర్సచారమే. కాంగ్రెస్ నాయకులను కలిసిన ప్రతి సందర్భంలోనూ నేను రాజకీయాలు మాట్లాడలేదు. నేను చెప్పని మాటలను మీడియా సంస్థలే ప్రసారం చేశాయి. ఇంత దుర్మార్గంగా ఎందుకు ఈ దుష్ర్పచారం చేస్తున్నాయి? కార్యకర్తలెవరూ దీనిని నమ్మొద్దు'' అని అందులో పేర్కొన్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి హైదరాబాద్‌లో కాలు పెడతానని ప్రకటించి జనవరి 31న ఢిల్లీకి వచ్చిన కేసీఆర్.. 25 రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్కు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలిక్టాపర్ ద్వారా బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనతో తిరిగి వస్తున్న కేసీఆర్కు కనీవినీ ఎరుగనిస్థాయిలో ఘనస్వాగతం పలకాలని పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
కేసీఆర్ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం నుంచి అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కులో గల అమరవీరుల స్తూపం వరకు వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేసీఆర్‌తో సాగే ఈ ర్యాలీ దారిపొడవునా, అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించే సమయంలో ఆ ప్రాంతంలోనూ పూలవర్షం కురిపించటానికి ప్రత్యేక హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేశారు. ర్యాలీ కోసం పార్టీ నేతలు ఇప్పటికే పోలీసు విభాగం అనుమతి కూడా తీసుకున్నారు.