హైదరాబాద్: మీడియా నియంత్రణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. మీడియా నియంత్రణ, తదితర అంశాలపై శుక్రవారం మాట్లాడిన కేసీఆర్.. మీడియా నియంత్రణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ నియంత్రణ మాత్రం అవసరమన్నారు. రేపు జర్నలిస్టు సంఘాలతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చి 10 లోగా శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తామని.. శనివారం సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్నారు. ఇప్పటికే 50లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు.
ఏప్రిల్ 24 న ఎల్బీ స్టేడియంలో విస్తృతస్థాయి సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. ఏప్రిల్ 27 న పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 2018 నాటికి 24 గంటల కరెంట్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వంలో చేరే విషయంలో ఇప్పటివరకూ చర్చ జరుగలేదని.. సమయం వచ్చినపుడు ఆ అంశంపై మాట్లాడతానని కేసీఆర్ పేర్కొన్నారు.