పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా...
వరంగల్ : తెలంగాణ ఉనికిని అగౌరపరిస్తే పాతరేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కాళోజీ శతయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం మీడియా ఆందోళనపై స్పందించారు. 'మా గడ్డ మీద ఉండాలంటే మా ప్రాంతానికి సలాం కొట్టాలి.... తెలంగాణప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానల్స్ మాకు అక్కరలేదని' అన్నారు. 'పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా... పాతర ....పాతర వేస్తాం ..పదికిలోమీటర్ల లోతున' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ను తిడితే బాధలేదని, తెలంగాణ శాసనసభ్యుల్ని తిట్టడం అవమానకరమన్నారు. తెలంగాణ శాసనసభ్యులంతా ఆ ఛానల్స్పై సమిష్టిగా తీర్మానం చేశాయని .... ఆ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. దానికి స్పందించిన ఎంఎస్వో ఆ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేశారన్నారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ వరకూ తీసుకుపోయి రాద్ధాంతం చేశారని కేసీఆర్ విమర్శించారు. రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఛానళ్లలో పనిచేస్తున్న స్థానిక ఉద్యోగులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు.