'మీడియా సిబ్బందిని గదిలో బంధించారు'
యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా భక్తులను, మీడియాను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కొండపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక రకంగా అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. భక్తులు, సీఎం రాక సందర్భంగా భువనగిరి డీఎస్పీ సంతకంతో మీడియా ప్రతినిధులకు పాస్‌లను ఇచ్చారు. దీంతో వారు ఆ పాస్‌లతో కొండపైకి చేరుకున్నారు. కానీ, సీఎం హెలిపాడ్ వద్ద దిగిన విషయం తెలియగానే మీడియాను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతారని చెప్పిన పోలీసులు.. మీడియా ప్రతినిధులను ఆద్దాల మేడలోకి ఆహ్వానించి తలుపులు మూసి బయట నుంచి గొళ్లం పెట్టారు. అంతటితో ఆగకుండా ఎవరూ బయటకి పోకుండా కాపలా ఉన్నారు.
మీడియా ప్రతినిధులు ఎంత కోరినా తలుపు తెరవలేదు. కొండపైన పరిసరాలను పరిశీలించి ఆండాల్ నిలయం గెస్ట్‌హౌస్‌కు సీఎం చేరుకునే వరకూ గంటకుపైగా అందులోనే మీడియా సిబ్బంది బందీగా ఉండాల్సి వచ్చింది. మరికొందరిని రిసెప్షన్, సమాచార కేంద్రం భవనాల్లో నుంచి బయటకురాకుండా అడ్డుకున్నారు. అధికారులతో కలసి పర్యటిస్తున్న సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు వెంట వెళ్తుండగా వారిని రానివ్వద్దని పోలీసులను సీఎం ఆదేశించారు. సమీక్ష తర్వాత కూడా కేసీఆర్‌ను కలవనీయకుండా మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఉదయం నుంచే కొండపై దుకాణాలు మూసి వేయించారు. దేవస్థానం బస్సు, మెట్ల మార్గం ద్వారా భక్తులను కొండపైకి రానిచ్చారు. వచ్చిన భక్తులను ఎక్కడికీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. బ్రహ్మోత్సవాలు కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.