గులాబీ దళానికి మీడియా టీమ్!
► ప్రభుత్వ, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచార బాధ్యతలు
► టీవీ చర్చల్లోనూ వారికే అవకాశం.. కేసీఆర్ వద్ద ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు... విపక్షాల విమర్శలు, ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు పార్టీ సీనియర్లతో ఒక మీడియా టీమ్‌ను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ జిల్లా, రాష్ట్ర, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పా టు చేయనున్న నేపథ్యంలో.. మీడియా టీమ్‌ను కూడా ప్రకటించవచ్చని సమాచారం. వాస్తవానికి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ప్పటినుంచి ప్రభుత్వ కార్యకలాపాలు, పాలనా వ్యవహారాలకే ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ పార్టీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ కారణంగానే 14వ ప్లీనరీ ముందు పార్టీ కమిటీలు రద్దయినా ఇప్పటిదాకా నియామకాలు కూడా జరగలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 16వ ప్లీనరీ కూడా జరగనుంది. ఈ క్రమంలోనే సంస్థాగత కమిటీలను నియమించడంతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలైంది.
ప్రభుత్వ విప్‌లు ఉన్నా...
వాస్తవానికి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వ విప్‌లు ఉన్నారు. అసెంబ్లీ నుంచి ఒక చీఫ్ విప్, ముగ్గురు విప్‌లతోపాటు ఇటీవలే శాసన మండలికి ఒక చీఫ్ విప్, ఇద్దరు విప్‌లు నియమితులయ్యారు. అయితే శాసనసభకు నియమితులైన విప్‌లు సమర్థవంతంగా వ్యవహరించిన దాఖలాల్లేవని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రతిపక్షాలు ప్రభుత్వంపై, టీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి ప్రతిగా అధికార పార్టీ నుంచి స్పందిస్తున్న నేతలు, స్పందిస్తున్న తీరుపై అధినేత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మంత్రులు సైతం తమ శాఖలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టలేక పోతున్నారని... చేసిన పనిని, ఉన్న పరిస్థితిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని ఇటీవలి కేబినెట్ భేటీలో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు, నాలుగు రోజుల్లో పార్టీ కమిటీలను ప్రకటించనున్న నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధులనూ ఖరారు చేసే అవకాశముంది. వారికి అదనంగా వివిధ సబ్జెక్టులపై అవగాహన, సమకాలీన అంశాలపై పట్టు, టీవీ చర్చల్లో పాల్గొన్న అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి రానున్న రెండున్నరేళ్లూ కీలకమైనవి కావడంతో పార్టీ విధానాలను, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లో సమర్థంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరాన్ని అధినాయకత్వం గుర్తించి నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ కమిటీల ప్రకటన అనంతరం కొందరు సీనియర్లతో మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసే అవకాశముంది.
వ్యూహానికి పదునుపెడుతున్న కేసీఆర్..
ప్రధానంగా ప్రభుత్వం, పార్టీ జోడెద్దుల్లా పరుగులు పెట్టాలని టీఆర్‌ఎస్ అంతర్గత సమావేశాల్లో పదే పదే చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ వ్యూహానికి పదును పెడుతున్నారు. ఎందుకంటే దాదాపు ఏడాదిన్నరకు పైగా టీఆర్‌ఎస్ పార్టీ గొంతుకను బలంగా వినిపించే వారు కరువయ్యారు. మంత్రులు సైతం కేవలం తమ శాఖలకే పరిమితమవుతున్నారు. చివరకు టీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో తెలంగాణ గొంతుకను ఎంత బలంగా వినిపించారో... అదే స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలను సమర్థించేలా, ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం. రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాల ప్రకటన తర్వాత ప్రత్యేకంగా మీడియా టీమ్‌ను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.