
విలీనంపై ఇప్పుడే చర్చలొద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు నెగ్గి, రాష్ట్రపతి ఆమోదం పొందేదాకా కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ప్రసక్తి, ఆ అంశంపై చర్చలు వద్దని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. పూర్తి స్పష్టత లేకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడుకోవడం అని అన్నారు. 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటై అన్నింటిలో సంతృప్తి చెందిన తర్వాతే ఆ సంగతి చూద్దామని తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రపల్లి-వెంకటాపూర్ శివార్లలోని తన ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో కేసీఆర్ సుమారు 8 గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీలు మందా జగన్నాధం, జి.వివేక్, టీడీపీ నుండి వచ్చిన కె.హరీశ్వర్‌రెడ్డి హాజరుకాలేదు. మందా, వివేక్‌లు హాజరుకాక పోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇటీవల గెలిచిన సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నందున హాజరుకాలేకపోతున్నానంటూ హరీశ్వర్‌రెడ్డి సమాచారం పంపినట్టు తెలిసింది. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు కె.స్వామిగౌడ్, పి.సుధాకర్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి.హరీష్‌రావు, కె.తారక రామారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, జి.అరవింద్‌రెడ్డి, మాజీ ఎంపీలు ఎ.పి.జితేందర్ రెడ్డి, జి.వినోద్, మాజీ ఎమ్మెల్యేలు నాయిని నర్సింహారెడ్డి, ఎస్.మధుసూదనాచారి తదితరులు హాజరయ్యారు. పార్టీ ముఖ్యులు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ ప్రకటన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, వివిధ పార్టీల ఎత్తుగడలు, సీమాంధ్రలోని ఉద్యమాలు, టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌కు వలసలు, కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ దౌత్యం వంటివాటిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పెద్దలతో జరుగుతున్న చర్చలను కేసీఆర్ పొడిపొడిగా వెల్లడించారు.
కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నా: ‘కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు ముఖ్యులు మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నరు. అయినా తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే కాంగ్రెస్‌తో ఏమైనా చర్చలుంటయి. అలాగని ఆ పార్టీని పూర్తిగా నమ్మలేం. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు కావాలి. నదీజలాల్లో వాటా, హైదరాబాద్ ఆదాయం, అధికారాలపై స్పష్టత, ఉద్యోగుల విభజన వంటివన్నీ తేలాలి. హైదరాబాద్‌పై కిరికిరి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎక్కడ అన్యాయం జరిగినా మళ్లీ మనది కొట్లాటే. ఇచ్చిన మాట ప్రకారం విలీనానికైనా సిద్ధంగా ఉందాం’ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లోకి చాలామంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని, నేరుగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యులే వారితో చర్చలు జరుపుతాన్నరంటూ వస్తున్న వార్తలపై భేటీలో తీవ్రంగా జర్చ జరిగింది. టీఆర్‌ఎస్ నుండి 8 మంది టచ్‌లో ఉన్నారని, వారు త్వరలోనే కాంగ్రెస్‌తో కలుస్తున్నారని దిలీప్‌కుమార్ ఎలా చెప్తాడని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. టీఆర్‌ఎస్ నుండి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన కాంగ్రెస్ తరఫున బ్రోకర్‌గా ఎలా పనిచేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మాటమార్చి చంద్రబాబు మోసం: ఈటెల
తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడే వరకు చెప్పిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి మాటమార్చి మోసం చేస్తున్నాడని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్ విమర్శించారు. ఫాంహౌస్‌లో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన కపటత్వాన్ని, మోసపూరిత నైజాన్ని బయట పెట్టుకున్నాడని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీమాంధ్రకే సీఎంలా మాట్లాడుతున్నాడన్నారు. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నారని, ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అంతా ఒక్కటేనని ఈటెల వ్యాఖ్యానించారు. మతకల్లోలాలను సృష్టించి హైదరాబాద్‌ను వివాదాస్పదం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్‌కు బ్రోకర్‌గా పనిచేస్తున్నాడంటూ ‘ఖబడ్దార్’ అని హెచ్చరించారు. విజయమ్మ దీక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా తేలిపోయిందన్నారు.