టీఆర్‌ఎస్ విలీనమెలా ? | KCR Meets Party Leaders Over TRS Merge With Congress | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ విలీనమెలా ?

Published Tue, Feb 18 2014 5:42 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

టీఆర్‌ఎస్ విలీనమెలా ? - Sakshi

టీఆర్‌ఎస్ విలీనమెలా ?

పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చలుస
హైదరాబాద్‌లో భారీ సభలో ప్రకటించడమా?
బిల్లు ఆమోదం పొందగానే ఢిల్లీలోనే ముగించడమా?
విలీనంపై నేతల్లో భిన్నాభిప్రాయాలు
నేడో, రేపో పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయం

 
 న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై ఆ పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇచ్చాక విలీనం తప్పదని టీఆర్‌ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనే మోహరించిన టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ దిశగా ఆయన చర్చలు జరుపుతున్నారు. విలీనం చేయవద్దని కేసీఆర్‌కు నిత్యం సన్నిహితంగా ఉండే కొందరు నేతలు సూచిస్తున్నారు.
 
  తెలంగాణ ఇస్తున్నది కాంగ్రెసే అయినా అందుకోసం 13 ఏళ్లుగా పోరాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నేతగా కేసీఆర్‌కుఎనలేని ఆదరణ ఉంటుందని వారంటున్నారు. ‘అలాగాక కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైతే బీజేపీ మరో శక్తిగా ఎదిగే ఆస్కారముంటుంది. కాబట్టి అంతగా అయితే కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుందాం’ అని సూచిస్తున్నారు. ఇతర నేతలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. అంతర్గత బలహీనతలను, తెలంగాణ ప్రజల మనోగతాన్ని గుర్తెరగకుండా పార్టీ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకోవద్దని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిపై 10 రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
 
 అనివార్యమంటున్న కేసీఆర్
 టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నేతల ఆలోచన, డిమాండ్లు ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం విలీనాన్నే కోరుతోందని కేసీఆర్ వెల్లడించారు. అది అనివార్యమయ్యే పరిస్థితులే ఉన్నాయంటున్నారు. ఈ దృష్ట్యా విలీనం ఎప్పుడు, ఎలా అనేదానిపై యోచిస్తే మేలని ఆయనంటున్నారు. లోక్‌సభలో 18న, రాజ్యసభలో 19 తెలంగాణ బిల్లు ఆమోదం ఖాయమని పార్టీ నేతలతో చెబుతున్నారు. బిల్లును ఉభయ సభలు ఆమోదించిన మర్నాడే విలీన ప్రకటన చేసే అవకాశాలూ లేకపోలేదని టీఆర్‌ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. అయితే సాదాసీదాగా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్,లేదా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ పెట్టి విలీన ప్రకటన చేయాలన్నది కేసీఆర్ యోచనగా తెలుస్తోంది. దానికి సోనియాగాంధీనీ ఆహౠ్వనించే యోచన కూడా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 3న రావచ్చని, దానికి, నోటిఫికేషన్‌కు మధ్య సభ పెట్టే ప్రతిపాదన ఉందని తెలిపాయి.
 
  తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణాధికారాలు మనకే అప్పగిస్తేనే విలీనం చేద్దామని సీనియర్ ఎమ్మెల్యేలంటున్నారు. అన్నింటా సముచిత భాగస్వామ్యం, ప్రాధాన్యత ఉంటుంది గానీ పూర్తి పగ్గాలివ్వరేమోనని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. విలీనంపై చర్చకు మంగళవారం సాయంత్రం, లేదా బుధవారం టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి పొలిట్‌బ్యూరో సమావేశ జరిగే అవకాశముంది. ఈ సందర్భంగా లాంఛనంగా విలీన నిర్ణయం తీసుకోవచ్చని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు.
 
 మరోవైపు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సోమవారం సాయంత్రం కేసీఆర్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రాయల తెలంగాణ, పోలవరం ముంపు గ్రామాలు తదితరాలపై జైరాం కొన్ని ప్రతిపాదనలు చేయగా కేసీఆర్ అంగీకరించలేదు. హైదరాబాద్‌పై ఎలాంటి షరతులూ లేకుండా 10 జిల్లాల తెలంగాణ కావాల్సిందేనన్నారు.
 
 పలువురి జన్మదిన శుభాకాంక్షలు
 కేసీఆర్ 60వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, వివిధ పార్టీల నేతలు సోమవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు పార్లమెంటులో ఆయనను అభినందించారు. టీఆర్‌ఎస్ నేతలు, జేఏసీ నేతలు, వివిధ జిల్లాల నుండి వచ్చిన నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
 
 కేసీఆర్  ఇంటికి సమైక్యాంధ్ర విద్యార్థి నేతలు
 కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏపీ నేతలు సోమవారం ఉదయం  ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో తోపులాట జరిగింది.
 
 కేసీఆర్ స్వప్నం సాకారమవుతోంది: కవిత
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న 60 ఏళ్ల కల నెరవేరుతున్న సందర్భం ఒకవైపు ఉన్నా తమ హృదయం మాత్రం అమరవీరుల చుట్టు తిరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా పార్టీ యువజన, విద్యార్థి, మహిళా కార్యకర్తలు తెలంగాణభవన్‌లో వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ కల, అమరవీరుల ఆకాంక్ష నెరవేరబోతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement