కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ఉండదని కేసీఆర్ ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు.
కాంగ్రెస్ అధిష్టానం యోచన
కేసీఆర్ డిమాండ్లకు లొంగకూడదనే
అభిప్రాయం.. సోనియాతో దిగ్విజయ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ఉండదని కేసీఆర్ ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు. పొత్తులపై ఆశ ఉన్నప్పటికీ కేసీఆర్ డిమాండ్లకు మాత్రం తలొగ్గేది లేదన్న రీతిలో వ్యవహరిస్తోంది. చివరకు ఒంటరిపోరుకైనా సిద్ధపడే వ్యూహంలో ఉంది. మున్సిపల్ ఎన్నికల లోపే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో హైదరాబాద్, వరంగల్‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. టీఆర్‌ఎస్ విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మంగళవారం సాయంత్రం సోనియాతో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ దూకుడును ఎలా చూడాలి? పొత్తుకు చేయి చాచాలా? తెలంగాణ సానుభూతి ఓటు చీలకుండా ఎలా వ్యూహరచన చే యూలి? తదితర అంశాలపై చర్చించారు.
చివరకు.. విలీన ం చేయబోమని, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములమవుతామని కేసీఆర్ స్పష్టంగా ప్రకటించినప్పటికీ రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించరాదని, జాతీయ పార్టీగా హుందాతనంతో వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. వీలైతే పొత్తులు కుదుర్చుకోవాలని, కాని పక్షంలో తెలంగాణ ఓటు చీలకుండా సీట్లపై అవగాహనకు రావాలని అనుకున్నారు. అదీ కుదరని పక్షంలో ఒంటరిపోరుకైనా సిద్ధంగా ఉండాలని నిర్ణరుుంచారు. సోనియాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన దిగ్విజయ్.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత టీఆర్‌ఎస్‌తో పొత్తు అంశంపై మాట్లాడతానని చెప్పారు.
‘కేసీఆర్‌కు ఇది మొదటినుంచీ అలవాటే. కాస్త బెదిరించినట్టు మాట్లాడితే ఎదుటిపక్షం లొంగుతుందనేది ఆయన భావన. కానీ కాంగ్రెస్ ఆయన ప్రకటనను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు..’ అని ఏఐసీసీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ‘విలీన ప్రక్రియ ఉండకపోవచ్చు గానీ.. పొత్తులు ఉండవని ఇప్పుడే నిర్ధారణకు రాలేం. పొత్తు లేనిపక్షంలో తెలంగాణ సానుభూతి ఓటు చీలిపోతుంది. అది రెండు పార్టీలకు నష్టం కలిగించే అంశమే’ అని అన్నారు.
రెండు పీసీసీల ప్రకటన..: ఒక పీసీసీ, రెండు ప్రాంతీయ కమిటీలు ఉంటాయని ప్రచారం సాగిన నేపథ్యంలో మంగళవారం ఈ విషయంలో స్పష్టత వచ్చింది. ఇరు ప్రాంతాలకు రెండు పీసీసీలు నియమిస్తేనే మెరుగైన రీతిలో పోరాడవచ్చని ఇరు ప్రాంతాల నేతలు ప్రకటించడం, విభజన తేదీ కూడా రావడంతో ఇక రెండురోజుల్లోపే రెండు పీసీసీల నియామకం పూర్తవుతుందని ఏఐసీసీకి చెందిన ఒక నేత ‘సాక్షి’కి తెలిపారు.