'తెలంగాణ ఇస్తే సోనియా ఇంట్లో పనిచేస్తానన్నారు'
కరీంనగర్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ఎజెండా తెలంగాణ అని, రాష్ట్రం వచ్చాక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో కేసీఆర్ పనిచేస్తే.. కేసీఆర్ నాయకత్వంలో తామంతా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ ఇంట్లో పనిచేస్తానని, కాళ్లకడిగి నీళ్లు నెత్తిన పోసుకుంటానన్న కేసీఆర్ ఆ మాటలు మర్చిపోవద్దన్నారు. టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం చూసుకుంటుందన్నారు.
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితర ఎంపీలు కాంగ్రెస్ దయతోనే ప్రజాప్రతినిధులు అయిన విషయాన్ని మరిచిపోయి సోనియాగాంధీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఉందని, కిరణ్, పవన్‌కల్యాణ్ పార్టీలు పెట్టుకునే విషయం వారి సొంతమని అన్నారు.
ఆయారాం... గయారాంలు వస్తుంటారు.. పోతుంటారని, అలాంటి వారితో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి రేసులో తాను లేనని, అవకాశం వస్తే వదులుకునేది లేదని స్పష్టం చేశారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా ఉందని, దళిత ముఖ్యమంత్రి విషయం కాంగ్రెస్ ఎజెండాలో లేదని, సోనియా ఆలోచిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని పేర్కొన్నారు.