టీఆర్ఎస్లో విలీనం కావద్దన్న టీఆర్‌ఎస్ వ్యూహం లక్ష్యమిదే
విలీనం కాకపోతే టీడీపీ నుంచి భారీ వలసలు ఉంటాయనే అంచనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన వెంటనే విలీనం చేస్తామంటూ ఇప్పటిదాకా చెప్తూ వచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవటం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల్లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూలు విడుదలవుతున్న తరుణంలో రాజకీయ వ్యూహంతోనే కేసీఆర్ విలీనం చేయబోమన్న ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం కూడా కేసీఆర్ తాజా వ్యూహంలో భాగంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయబోమన్న నిర్ణయానికి.. కేసీఆర్ బయటకు చెప్తున్న కారణాల్లో చాలావరకు అసమంజసంగానే ఉన్నాయని.. బయటకు చెప్పకుండా దాచిన కారణాలెన్నో అంతర్గతంగా ఉన్నయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాజకీయ పరిశీలకులు ఏం చెప్తున్నారంటే...
- కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైతే బీజేపీ బలం పెరిగే అవకాశం ఉంది. టీడీపీ తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని యత్నిస్తోంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.
- తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్ మాత్రమే పోటీలో ఉంటాయి.. మరో రాజకీయ పార్టీకి క్షేత్రస్థాయిలో అవకాశం లేకుండా చేయటం కూడా విలీనం ఉండదన్న ప్రకటనలో వ్యూహం కావచ్చు.
- కాంగ్రెస్‌లో విలీనం కాబోయే టీఆర్‌ఎస్‌లో చేరడానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెనుకంజ వేస్తున్నారు. విలీనం కాదని స్పష్టమైన ప్రకటన వస్తే టీఆర్‌ఎస్‌లోకి వలసలు ఉంటాయనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
- విలీనం వల్ల.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు వెళ్తారు. స్థానికంగా బలమున్న నేతలకు ఇతర వనరులు కలిసి వస్తే కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
- సోనియాకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పారు?: ఎన్నో షరతులతో తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చేస్తున్న వాదనలో పస లేదని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు. ‘షరతులు ఉన్న తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ విజయోత్సవాలు ఎందుకు చేసుకున్నారు? ఇలాంటి తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు ఎందుకు చెప్పారు? ఒక్క సోనియాగాంధీతోనే కాకుండా రాహుల్‌గాంధీతోనూ రహస్య సమావేశాలను కేసీఆర్ ఎందుకు జరిపారు? ఈ తెలంగాణ ఏర్పాటులో అభ్యంతరాలు ఉన్న విషయం బిల్లు ఆమోదం పొందిన 10 రోజులకు కేసీఆర్ వివరించటంలోని ఆంతర్యమేమిటి ? కాంగ్రెస్‌లో విలీనం, రాజకీయ ప్రయోజనాలు వంటి అంశం తెరపైకి వచ్చేదాకా తెలంగాణ బిల్లులోని అభ్యంతరాలపై ఎందుకు నోరు విప్పలేదు? ఇలాంటి వాటిని చూస్తే కేసీఆర్ చేస్తున్న వాదనలోని అసలు వ్యూహం వేరే ఉందని అర్థమవుతోంది’ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక కాంగ్రెస్‌తో పొత్తా? అవగాహనా?
పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయని పక్షంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌తో పొత్తులు ఉంటాయా? లేక కాంగ్రెస్‌తో అవగాహన మేరకు స్నేహపూర్వక పోటీలు ఉంటాయా? అనే అంశాలపై చర్చ మొదలైంది.
మరోవైపు ఎంఐఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం ద్వారా పలు చోట్ల బలం పెంచుకోవచ్చని కూడా కేసీఆర్ అంచనా వేసినట్లు చెప్తున్నారు. అలాగే.. ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కూడా విలీనం చేయొద్దన్న ఆలోచనకు వచ్చారన్న వాదనా వినిపిస్తోంది. విలీనం వల్ల అస్తిత్వం కోల్పోవలసిన పరిస్థితులను అంచనా వేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చారని విశ్లేషిస్తున్నారు.