సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసి యేషన్ (ఆంధ్రా క్లబ్) పాలకవర్గ ఎన్నికలపై చెన్నై సివిల్ కోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రా క్లబ్ శనివారం ప్రకటించింది. ఆంధ్రాక్లబ్ సభ్యుల పిల్లలకు సైతం నామమాత్ర రుసుంతో గతంలో సభ్యత్వం కల్పించారు. సభ్యుల్లో కొందరు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగంతో వివాదంగా మారి అనంతరం సమసిపోయింది.
వారసత్వ సభ్యత్వం విధానాన్ని ప్రవేశపెట్టిన, సమర్థించిన వారంతా కలిసి ఒక ప్యానల్‌గా ఎన్నికల్లో నిలిచారు. వ్యతిరేకించిన వారిలో కొందరు కలిసి మరో ప్యానల్‌గా బరిలోకి దిగారు. షెడ్యూలు ప్రకారం ఆదివారం పోలింగ్ నిర్వహించి 30 వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న దశలో క్లబ్ సభ్యుడు చెన్నైకి చెందిన శేషాద్రి ఈ నెల 25వ తేదీన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు.
వారసత్వ సభ్యత్వం పొందిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికలపై స్టే విధించాలని కోరారు. ఎన్నికలపై కోర్టు స్టే మంజూరు చేయడంతోపాటు వచ్చే నెల 8 వరకు ఎన్నికలు నిర్వహించరాదని గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇంతవకు కోర్టు నుంచి ఆస్కాకు ఎలాంటి సమాచారం లేదు.
కాగా, పిటిషన్ వేసిన సభ్యుడు శని వారం క్లబ్‌కు వచ్చి కోర్టు ఆదేశాల పత్రాల నకలును అందజేసి వెళ్లిపోయారు. న్యాయస్థానం ఆదేశాలకు కట్టు బడి ఆదివారం జరగాల్సిన ఎన్నికలను వాయిదావేశారు.
క్లబ్‌ను అప్రతిష్ట పాల్జేశారు
ఇదిలా ఉండగా వారసత్వ సభ్యత్వాలపై ఏజీఎంలో చర్చకు హాజరై ఆమోదం తెలిపిన శేషాద్రి ఇప్పుడు ఎన్నికల వేళ కోర్టుకెక్కడం దురదృష్టకరమని ఆంధ్రాక్లబ్ అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో పథకం ప్రకారం పావులు కదిపి క్లబ్‌ను అప్రతిష్టపాల్జేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment