ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డంకి
విజయవాడ: విజయవాడ-న్యూఢిల్లీ ఏసీ (ఏపీ) ఎక్స్‌ప్రెస్ శుక్రవారం పట్టాలు ఎక్కాల్సి ఉండగా ప్రారంభానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. రాష్ట్ర నూతన రాజధాని నుంచి ప్రారంభమవుతున్న తొలి రైలు కావడంతో ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఆడంబరంగా ఏసీ రైలును ప్రారంభించాలని రైల్వే అధికారులు భావించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమలులోకి రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈలోగానే రైలును ప్రారంభించాలని రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు వస్తే రైల్వే జీఎం చేతుల మీదుగా పూర్తి చేయాలని టీడీపీ నేతలు సూచించినట్లు సమాచారం.
ఈ రైలుకు 21 బోగీలు ఉంటాయి. ఇందులో రెండు పవర్‌కార్లు, ఒకటి ప్యాంట్రీ కారు, ఒకటి ఫస్ట్‌క్లాస్ కోచ్, నాలుగు సెకండ్ క్లాస్ కోచ్‌లు, 13 థర్డ్‌క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. వీటికి తోడు డీప్ ఫ్రిజ్ బాక్సులు, హాట్ బాక్స్‌లు ఉన్నాయి. బుధవారం విజయవాడ నుంచి ఒంగోలు వరకు నడిపిన ట్రయిల్ రన్ విజయవంతమైంది.