► జిల్లాకు మొండిచెయ్యి
► ఒక్క కీలక ప్రాజెక్టూ దక్కలేదు
► నిట్ వచ్చినా సీట్లు రాలేదు
► రైతులకు కష్టాలు మిగిల్చిన ‘పట్టిసీమ’
► పచ్చ చొక్కాలకే పాలనా ఫలాలు
ఏలూరు: మే 16వ తేదీ 2014. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడిన రోజు. చట్టసభలకు ప్రజాప్రతినిధులు ఎన్నికై రెండేళ్లు పూర్తయ్యింది. జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ, దాని మిత్రపక్షానికి కట్టబెట్టినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ జిల్లాపై శీతకన్ను వేసింది. ‘రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారణమైన ఈ జిల్లాను మర్చిపోలేను. ఇక్కడి ప్రజలకు ఎంత చేసినా తక్కువే’ అనే రెండు మాటలను పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రెండేళ్లలో జిల్లాకు ఒరగబెట్టింది శూన్యమే. రెండేళ్ల పాలనలో జిల్లాకు ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఉన్నారు.
రైతు రుణమాపీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇలా ఇచ్చిన హామీ ఏదీ అమలుకు నోచుకోలేదు. ఈ రెండేళ్ల కాలంలో పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తానని సభల్లో ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఇప్పటివరకూ ఇచ్చిన హామీలకు సంబంధించిన ప్రకటనలు ఏవీ కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు పచ్చచొక్కాలకు మాత్రమే లబ్ధిచేకూర్చే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు పంచాయితీలు నిర్వహిస్తూ ప్రజల్ని దోచుకుంటున్నారు. వారుచేసే దోపిడీకి అడ్డువస్తే సొంతపార్టీ వారిని కూడా కడతేర్చే పరిస్థితికి జిల్లా రాజకీయాలు చేశాయి. రెండేళ్లలో జిల్లాకు ఏం చేయకపోగా తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తాజాగా ఆకర్ష్ కార్యక్రమంతో వైఎస్సార్ సీపీ నేతలను టీడీపీలో చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
‘పట్టిసీమ’తో పుట్టి ముంచారు
నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా ముఖ్యమంత్రి లెక్క చేయలేదు. వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను మాత్రమే కృష్ణా డెల్టాకు, అక్కడి నుంచి రాయలసీమకు తీసుకువెళ్తామని సర్కారు చెబుతున్నా, ఇక్కడ రైతుల్లో సందేహా లు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొనడం, ఇక్కడ రైతుల కు నీరు ఇవ్వకుండా కృష్ణాకు తరలించడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా రూ.12 వేల కోట్ల విలువైన పనులు ఎప్పటికి పూర్తవుతాయో అన్నది అందరిని వేధిస్తున్న ప్రశ్న.
నిట్ వచ్చినా..
ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వచ్చినా సీట్లు తగ్గిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ నిట్‌లో సీమాంధ్ర జిల్లాల విద్యార్ధులకు 200 సీట్లు దక్కేవి. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేసినా మొత్తం 120 సీట్లనే కేటాయించారు. ఇందులో జాతీయ కోటాకు 60 సీట్లు పక్కనపెడితే మొత్తం 13 జిల్లాల విద్యార్థులకు దక్కేది కేవలం 60 సీట్లు మాత్రమే. ఈలెక్కన 140 సీట్లు నష్టపోయే పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు, నరసాపురంలో పోర్టు, భీమవరంలో మెరైన్ వర్శిటీ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చెబుతూ వస్తున్నారు. తాజాగా జిల్లాకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు రన్‌వే చుట్టూ ఇళ్లు ఉన్నందున దాన్ని పొడిగించడం సాధ్యం కాదని తాడేపల్లి విమానాశ్రయంపై తేల్చి చెప్పేశారు.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఎక్కడ వనరులు ఉంటే అక్కడ వాలిపోతున్నారు. ఇసుక, మట్టి, పుష్కర పనులు, ఉద్యోగుల బదిలీలు ఇలా దేన్నీ వదలలేదు. తమను వ్యతిరేకించిన అధికారులపై భౌతిక దాడులకు పాల్పడటం లేదా వారిని బదిలీ చేయించడం ద్వారా తమ అక్రమ సంపాదనకు అడ్డు లేకుండా చూసుకుంటున్నారు. పట్టిసీమ పనుల పేరిట భారీగా దోచుకున్న అధికార పార్టీ ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, మరోపక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండేళ్లలో ప్రజా వ్యతిరేకతను మాత్రమే ఈ ప్రభుత్వం సంపాదించుకుందనడంలో అతిశయోక్తి లేదు.
రెండేళ్లు.. ఆ రెండు మాటలు
Published Tue, May 17 2016 11:12 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement
Advertisement