న్యూఢిల్లీ: ‘‘సోనియా గాంధీ దేవతా.. దయ్యమా? అన్నది కాదు. అది వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె దయ్యమా? దేవతా? అన్న అభిప్రాయం మా పార్టీకి ఎందుకుంటుంది?..’’ అని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
గతంలో టీఆర్‌ఎస్ సోనియాను దేవత అని స్తుతించిందని, మరిప్పుడు దేవతా? దయ్యమా? అని విలేకరి ప్రశ్నించగా... మందా జగన్నాథం పైవిధంగా బదులిచ్చారు. అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం కాదని కేసీఆర్ ప్రకటించారని, అసలు విషయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
‘‘స్నేహహస్తం చాపాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు ఎంత త్వరగా పొత్తుల బంధం చెడిపోతే బాగుండని చూస్తున్నారు. కేసీఆర్ గతంలో సెప్టెంబరు 30లోపు తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామన్న మాట నిజమే. కానీ కాంగ్రెస్ మాటపై నిలబడలేదు. స్నేహపూర్వక హస్తం అంటూనే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సోనియా ఎప్పుడూ విలీనం, పొత్తులపై మాట్లాడలేదు. కానీ, దిగ్విజయ్‌సింగ్ మాత్రం విలీనం ఖరారైందని, కేవలం విధివిధానాలే మాట్లాడుకోవాల్సి ఉందని ఎలా అంటారు. ఇద్దరు సభ్యులతో బిల్లు ఎలా పాస్ చేయిస్తారంటూ టీఆర్‌ఎస్‌పై ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో ఉన్నాయి.
దొరల పాలన అంటూ జైరాం రమేశ్ ఎలా మాట్లాడతారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఏర్పాటు అనేది అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం జరిగేలా ఉంటుంది. మేం తెలంగాణకు న్యాయం చేయాలని, ప్యాకేజీలు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ వాళ్లు కేవలం సోనియాను స్తుతించేందుకే ప్రయత్నించారు. కాంగ్రెస్ స్నేహహస్తం అంటూనే వెనుక నుంచి కత్తితో పొడిచే ప్రయత్నం చేసింది..’’ అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా.. పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.
దయ్యమా, దేవతా.. ప్రజలే నిర్ణయిస్తారు: మందా
Published Tue, Mar 4 2014 9:52 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement