సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై సీపీఐలో సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు సమాయత్తం కావాలన్న పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా యాప్రాల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర సమితి సమావేశం బుధవారం పొత్తులు, సర్దుబాట్లు, రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చలు జరిపింది. ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన పూర్తయినా కాకపోయినా ప్రస్తుత రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీకి బలం ఉన్న స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడంపై దృష్టి సారించాలన్న అభిప్రాయానికి వచ్చింది. ఈమేరకు సుమారు 50 నియోజకవర్గాలను గుర్తించినట్టు తెలిసింది.
రాష్ట్ర అనిశ్చితి నేపథ్యంలో ప్రధాన పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటించి ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయని సమావేశం అభిప్రాయపడింది. చంద్రబాబు నాయుడు తనతో పాటు పార్టీనీ గందరగోళంలోకి నెట్టాడని, అందువల్ల ఆ పార్టీకి విశ్వసనీయత ఉండకపోవచ్చని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీవైపు అడుగులు వేస్తున్నందున ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉండడమే మేలని వారు వాదించారు. విభజన తర్వాత తెలంగాణలోనూ రాజకీయ పరిస్థితులు వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయని ఆ ప్రాంత నేతలు అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అంశం తేలితే పొత్తుల వ్యవహారాన్నీ కొలిక్కి తేవచ్చన్నారు. వైఎస్సార్‌సీపీతో సీపీఎం పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవాలా? లేదా? అనే దానిపైనా తర్జనభర్జన పడ్డారు. పార్టీ జాతీయ సమితి నిర్ణయం మేరకు వామపక్షాల ఐక్యతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, లేకుంటే ఒంటరి పోరుకే మొగ్గు చూపాలని మెజారిటీ సభ్యులు తేల్చిచెప్పారు. కేంద్ర కార్మిక సంఘాలు వచ్చేనెల 12న తలపెట్టిన చలో పార్లమెంటుకు మద్దతు పలుకుతూ, విశాఖ, కాకినాడల మధ్య తీర ప్రాంతంలో రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానాలను ఆమోదించారు.
ఒంటరి పోరుకే సీపీఐ మొగ్గు?
Published Thu, Nov 7 2013 1:43 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement