సస్పెన్స్..!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాల భవితవ్యం పూర్తిస్థాయిలో తేలనుంది. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో పేర్కొన్న విధంగా అపాయింటెడ్ డే తర్వాత 136 రెవెన్యూ గ్రామాలు సాంకేతికంగా జిల్లా నుంచి విడిపోయి సీమాంధ్రలో కలుస్తాయి. అయితే.. ఈ గ్రామాల పరిపాలన, ఇక్కడి ప్రజలకు పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన ఏ ప్రభుత్వం చూడాలనే దానిపై మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియపరిస్తే ఆ మేరకు ఆర్టినెన్స్‌లో పేర్కొని ఆమోదిస్తారు. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో కేంద్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్పాయి. అయితే, ఈలోపు ముంపు ప్రాంతాలను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ, ఏ గ్రామం ఏ ఎంపీటీసీ స్థానం పరిధిలోనికి వెళుతుంది... ఏ జడ్పీటీసీ స్థానం కిందకు వెళుతుంది అనే అంశాలపై నోటిఫికేషన్ వెలువడనుంది.
కేంద్ర అధికారితో కలెక్టర్ భేటీ...
పోలవరం ముంపు గ్రామాల పరిస్థితిపై చర్చించేందుకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ మంగళవారం రాజ్‌భవన్‌లో కేంద్ర ఉన్నతాధికారి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్న రాజీవ్‌శర్మ కలెక్టర్‌ను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే ప్రాంతాలు కనుక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అక్కడి ప్రజల పాలన ఎలా? పన్నుల వసూళ్లు ఎలా చేయాలి? వారికి పునరావాసం ఏ ప్రభుత్వం కల్పించాలి? అందుకు సంబంధించిన నిధులెక్కడి నుంచి వస్తాయి? అసలు పునరావాసం కింద గోదావరి జిల్లాలకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు అంగీకరిస్తారా? అంగీకరించని పక్షంలో ఖమ్మం జిల్లాలోనే పునరావాసం కల్పించే అవకాశం ఉందా? అనే అంశాలపై సమగ్ర వివరాలను తెలుసుకున్నారు. అయితే, పునరావాస కల్పన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెపుతారని, ఇందుకు సంబంధించిన నిధులను మాత్రం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికార వర్గాలంటున్నాయి.
ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతే పరిపూర్ణం...
కాగా, పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న కొన్ని మార్పుల మేరకు కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా బూర్గంపాడు మండలంలోని ఐదు గ్రామాలను మళ్లీ తెలంగాణలోకి తేవాల్సి ఉంది. దీంతోపాటు కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాల అభిప్రాయం మేరకు కూడా ఆర్డినెన్స్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, మొదటి నుంచీ భద్రాచలం పట్టణంతో సహా ఆ డివిజన్ మొత్తాన్ని పూర్తిగా సీమాంధ్రలోనే విలీనం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో కూడా సాధారణ మెజారిటీతో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్‌లో భద్రాచలాన్ని పూర్తిగా సీమాంధ్రలో కలుపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశం లేనందున ముంపు ప్రజలను ఇప్పుడే సీమాంధ్ర పాలనలోనికి తీసుకెళ్లడం ఇబ్బందేననే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాల కన్నా ఖమ్మంతోనే అనుబంధం ఎక్కువ ని, వారిని ఇక్కడ ఉంచడమే మేలని, పునరావాసం కూడా ఇక్కడే కల్పిస్తే, ముంపు ప్రాంతంలోని భూభాగాన్ని మాత్రమే సీమాంధ్రలో కలపవచ్చనే వాదన కూడా అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే ముంపు ప్రాంతాల భవిష్యత్తును తేల్చడంలో కీలకం కానున్నాయి.