సీమాంధ్రను అనాథ చేశారు
కాంగ్రెస్‌పై మోడీ నిప్పులు
ఆ పార్టీఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుంది
సాక్షి, బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసుకుని సీమాంధ్రను అనాథను చేసిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. సీమాంధ్రలో తనకు ఒరిగేదేమీ ఉండదని తెలిసే ఆ ప్రాంతవాసులను వారి మానాన వారిని వదిలేసిందని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక తుపాను చెలరేగుతోందని, అది ఎన్నికల తేదీ రాగానే సునామీగా మారుతుందని హెచ్చరించారు. పాపాలకు పాల్పడిన కాంగ్రె స్ ఆ సునామీ ధాటికి తట్టుకోలేక లోక్‌సభ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం పలికారు. మోడీ శుక్రవారం కర్ణాటకలోని హుబ్లీ, గుల్బర్గాల్లో ‘భారత్‌ను గెలిపించండి’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
కాంగ్రెస్ ‘విభజించి, పాలించు’ రాజకీయాలకు పాల్పడుతోంది. వారు ప్రజలకు కొట్లాట పెట్టి ఢిల్లీలో కూర్చుని ఆనందిస్తారు. దేశాన్ని, రాష్ట్రాలను, హృదయాలను ముక్కలు చేస్తారు.
సీమాంధ్రలో వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్లమెంటులో తెలంగాణ బిల్లును గ ట్టెక్కించుకుంది. సీమాంధ్ర భారతదేశంలో భాగమైనా ఆ ప్రాంతాన్ని అనాథను చేసి తప్పు చేసింది. బిడ్డను ప్రసవించే సమయంలో తల్లిని చంపిన డాక్టర్‌లా వ్యవహరించింది.
తెలంగాణ వంద ల మంది బలిదానాల వల్ల ఏర్పడిందే కానీ కాంగ్రెస్ వల్ల కాదు. మేం తెలంగాణ, సీమాంధ్ర రెండూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.
కాంగ్రెస్ హామీలను తుంగలో తొక్కింది. లోక్‌పాల్ ఎంపిక కమిటీలో చేరేందుకు ప్రముఖ న్యాయ నిపుణుడు ఫాలీ నారీమన్ తిరస్కరించడం ఆ పార్టీ అవి నీతి రాజకీయాలకు నిదర్శనం. తమ సమస్యలన్నిం టికి కాంగ్రెస్సే కారణమని ప్రజలు తెలుసుకున్నం దున ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది.
కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్‌లు ‘దస్ నంబరీ గాంధీలు’లు. (కాంగ్రెస్ పదేళ్ల పాలన, ఢిల్లీలోని సోనియా నివాసం 10, జనపథ్‌ను ఉద్దేశించి)