సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమానికి ఆజ్యం పోసిన కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు
జనగామ, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమానికి ఆజ్యం పోసిన కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జనగామలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విషయంలో ప్రజలను మభ్యపెట్టి వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అవసరమైన నోట్ తయారు చేయడంతో ఎందుకు జ్యాపం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.
వర్కింగ్ కమిటీలో తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు సీమాంధ్ర నేతలతో చర్చించామని చెబుతున్న కాంగ్రెస్ నేతలకు సీమాంధ్రలో ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఉద్యమం కనిపిం చడం లేదా అని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. కాగా, జాతీయ పార్టీ అయిన బీజేపీతోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని విమర్శించే స్థాయి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు లేదన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు జనగామ సొమిరెడ్డి, మహంకాళి హరిచంద్ర గుప్త, ఉడుగుల రమేష్, పిట్టల సత్యం, సౌడ రమేష్, పెద్దోజు జగదీష్, సుధీరంజన్ పాల్గొన్నారు.