రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు: నరేంద్ర మోడీ
సుమేర్‌పూర్ (రాజస్థాన్): నదీజలాల పంపకం విషయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలమధ్య విభేదాలు సృష్టిస్తోందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విభజించి.. పాలించు .. విధానాన్ని అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. వివిధ రాష్ట్రాలమధ్య జలవనరుల పంపకం విషయంలో వివాదాలు నెలకొన్నాయని, దీనికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కారణమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయని, ఇక్కడ కూడా జల వివాదాలు ఉన్నాయని మోడీ అన్నారు.
శుక్రవారం సుమేర్‌పూర్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ, రాజస్థాన్‌కు నర్మదానది జలాల్లో తగిన వాటా రాకపోవడానికి కూడా కేంద్రమే కారణమని అన్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు గేట్ల ఏర్పాటులో కేంద్రప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పనులు పూర్తయితే రాజస్థాన్‌కు మరిన్ని జలాలు వచ్చే అవకాశం ఉంటుందని, అయితే కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. గుజరాత్ పురోగతి కేవలం తనవల్లే సాధ్యపడలేదని, అక్కడి ప్రజలు అభివృద్ధికి బాటలు వేసే బీజేపీని ఎన్నుకోవడం వల్లే అది జరిగిందని, ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రజలు కూడా అదే విధంగా చేయాలని ఆయన కోరారు.
మోడీపై కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ విషపూరితమైందంటూ నరేంద్ర మోడీ చేసిన విమర్శలపై ఆ పార్టీ మరోసారి ఎన్నికల కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్‌కు ఫిర్యాదును అందజేసింది. అలాగే ఢిల్లీలో మోడీ సభల్లో ఎర్రకోట నమూనాను ప్రదర్శించకుండా కూడా అడ్డుకోవాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. ఎర్రకోట జాతి సంపద అయినందున ఎన్నికల ప్రచార సభలో ఈ విధంగా వాడుకోవడం సరికాదని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, రాజస్థాన్‌లో ఉచిత ఔషధ సేవల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పంచుతున్న మందులు విషపూరితమంటూ బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే చేసిన విమర్శలపై కూడా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాగా, మోడీ సభలకు భారీగా జనం తరలిరావడాన్ని చూసి ఢిల్లీలో శనివారం జరగాల్సిన ప్రధాని సభను రద్దు చేసుకున్నారన్న బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. మోడీ సభలను చూసి భయపడాల్సిన అవసరం తమకు లేదని, ప్రధానితో జపాన్ రాజు అఖిహిటో భేటీ ఉండడంవల్లే సభ రద్దయిందని తెలిపింది.