Polavaram caved villages
-
ఉమ్మడి సర్వే జరపాల్సిందే!.. పోలవరం అథారిటీ భేటీలో వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తే రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ పునరుద్ఘాటించింది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరువైపులా తెలంగాణ పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టుగా తమ ఇంజనీర్లు తేల్చారని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో చేపట్టాలని డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) భేటీలో పోలవరం ముంపు ప్రభావంపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్‌కుమార్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. వాగుల ప్రవాహానికి బ్యాక్‌వాటర్ అడ్డంకి పోలవరంతో తెలంగాణలో 300ఎకరాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, దీనిపై అధ్యయనం జరిపి నివా రణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని మురళీధర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే కోసం ఇటీవల క్షేత్రస్థాయి పర్య టనకు వచ్చిన ఏపీ అధికారులు.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఉండనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామ న్నారని తెలిపారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తాము కోరగా, ఏపీ ప్రభుత్వ అనుమతి తీసు కుని మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారని వివరించారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డంకిగా మారడంతో పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత జూలైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40,446 ఎకరాలు ముంపునకు గుర య్యాయని చెప్పారు. పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9,389 ఎకరాలు ముంపునకు గురి అవుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం అధ్యయనం చేయించాలని కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదని, దీనికి ఎవరూ అంగీకరించలేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర, తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అన్ని రాష్ట్రాల తో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని మాత్రమే సూ చించిందని చెప్పారు. అయితే రెండు సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని, ఇందుకోసం త్వరలోనే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సీఎంలతో సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం పేర్కొందని తెలిపారు. తెలంగాణకు నచ్చినట్టుగా నివేదికలు వచ్చేవరకు అధ్యయనం చేయాలా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం.. తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం -
ఆ ఐదూళ్లు తిరిగివ్వండి..!
‘మా నుంచి తీసుకున్నఐదూళ్లు తిరిగి ఇవ్వండి’అంటూ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను కోరుతోంది. ఈ ప్రతిపాదనతో కూడిన ఓ విన్నపాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. పోలవరం ముంపు మండలాలుగా పేర్కొంటూ గతంలో ఏపీ డిమాండ్‌తో తెలంగాణ నుంచి విడిపోయిన భూభాగంలోనే ఈ ఐదూళ్లు ఉన్నాయి. ఈ తాజా ప్రతిపాదనకు, ఆ ఏడు మండలాలు తరలిపోయిన వివాదానికి సంబంధం లేదు. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. దేవాలయంతోపాటు భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ గ్రామాల అవసరం వచ్చింది. దీంతో వాటిని తెలంగాణకు తిరిగి కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను కోరింది. సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకోనుంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మాడవీధులు, గాలి గోపురాలు.. పూర్తి కొత్త రూపు ఇవ్వనున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 27న శంకుస్థాపన..? ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ నెల 27న శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా అష్టమి.. నవమి తిథుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇష్టపడరు. ఇలాంటి సెంటిమెంట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా శ్రీరామనవమి మరుసటి రోజు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 26న జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ భద్రాచలం వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం పట్టాభిషేక మహోత్సవాలను తిలకించి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత కోసం ఉగాది రోజున సీఎంను కలసి చర్చించాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు నిర్ణయించారు. భద్రాచల శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రిక, పోస్టర్‌ను ఇద్దరు మంత్రులు ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ ఈఎన్సీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. 27న సీఎంతో లేదా ముఖ్యమంత్రి ఆదేశిస్తే చినజీయర్‌స్వామితో శంకుస్థాపన కార్యక్రమం కొనసాగుతుందని మంత్రులు పేర్కొన్నారు. ఐదు గ్రామాలను కలుపుకుని అభివృద్ధి.. భద్రాచలం పట్టణానికి టెంపుల్ టౌన్ హోదా ఇవ్వాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. దీనికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయముంది. ఇప్పుడు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందున పనిలోపనిగా టెంపుల్ టౌన్‌గా మార్చాలన్న ప్రతిపాదన సీఎం పరిశీలనకు వచ్చింది. అయితే భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్తగా స్థలం అవసరమైతే సేకరించటం కష్టంగా మారింది. భద్రాచలానికి ఓవైపు గోదావరి ఉండగా, మిగతా రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ భూభాగమే ఉంది. దీంతో ఆ రాష్ట్రం పరిధిలో ఉన్న కొన్ని ఊళ్లను తమకు ఇవ్వాలంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరింది. ఎటపాక, లక్ష్మీపురం, పురుషోత్తమపట్నం, పిచుకలపాడు, కన్నాయి గూడెం గ్రామ పంచాయతీలను తెలంగాణ కోరింది. వీటితోపాటు గుండాల అనే ఆవాస ప్రాంతాన్ని కూడా కోరింది. యాదాద్రి తరహాలో చేపడతాం.. భద్రాచలం ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. వీటితో పనులు మొదలవుతాయి. భవిష్యత్తులో ఇతర పనులు జోడిస్తే బడ్జెట్ పెరుగుతుంది. యాదాద్రి తరహాలో ఎంత ఖర్చయినా సరే పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే ఈ నెల 27నే పనులు మొదలవుతాయి’ – మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
గిరిజనులను ఆదుకుంటాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంత గిరిజనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నారు. నీటిరంగ నిపుణుడు, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఎల్.రావు 112వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమీర్‌పేట కమ్మసంఘం హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలవరానికి జాతీయ హోదా రావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి సీఎం రెండు రోజుల పర్యటన: చంద్రబాబు బుధవారం నుంచి రెండు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
ఆర్డినెన్స్ పాపం కాంగ్రెస్‌దే..
ఖమ్మం సిటీ : జిల్లాలో పోలవరం ముంపు మం డలాలను ఆంధ్రలో కలపుతూ తీసుకున్న నిర్ణ యం గత యూపీఏ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. గిరిజనులను ముం చుతున్న పాపం కాంగ్రెస్‌దే అని వ్యాఖ్యానించా రు. ఖమ్మంలోని టీడీపీ జిల్లా కార్యాయలంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారుమాట్లాడారు.తెలంగాణ ఇచ్చే ముం దు అప్పటి యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపాలనే నిర్ణయం తీసుకుందన్నారు. గిరిజనులకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌కు ఆర్డినెన్స్ ఆమోదం తర్వాత ఆందోళనలు చేపట్టే హక్కులేదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 2004 నుంచి భూసేకరణ చేపట్టిందని, నిర్వాసితులకు ఆంధ్రలో ఎకరాకు రూ. 3లక్షలు చెల్లించగా తెలంగాణలో రూ.లక్ష 20 వేలు మాత్రమే చెల్లించి 45 వేల ఎకరాలను స్వాధీనం చేసుకుందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి జిల్లాలోని గిరిజన సంస్కృతీ సంప్రదాయలను కాపాడలన్నారు. ఇప్పటికైనా కమిషన్‌ను నియమించి గిరిజనుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, ఇందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కేతినేని హరిష్‌చంద్రా, రాయిపూడి జయకర్, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ ఆర్డినెన్స్‌పై న్యాయపోరాటం చేస్తాం
కొణిజర్ల : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల గిరిజనులను పోలవరం ముంపు పేరుతో సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ వైఎస్ఆర్సీపీ తరఫున సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయున్ని మెప్పించటం కోసమే కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీయవద్దని, జిల్లాలోని ఏడు మండలాల ప్రజలు తెలంగాణలోనే ఉండాలని పార్లమెంట్లో తెలంగాణ ప్రాంత నేతలమంతా గగ్గోలు పెట్టినా కేంద్రం వినకుండా ఏకపక్షంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. పల్లిపాడులో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తమ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో కమ్యూనిష్టులను మరిపిస్తామన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని పునరుద్ఘాటించారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దళిత, గిరిజనులకు మూడెకరాల పొలం ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టం చేయాలని వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడు తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాలు అల్లక ల్లోలం అయ్యాయని, అభివృద్ధి ఆమదూరం వెళ్లిందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. రుణమాఫీ ఆలస్యమైతే పోరాటాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ఓ నిర్ణయాత్మక శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రాయల పుల్లయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాముల వెంకటేశ్వర్లు, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కీసర పద్మజారెడ్డి, యువజన విభాగం మండల కన్వీనర్ పాసంగులపాటి శివకుమార్, పెద్దగోపతి ఎంపీటీసీ తాళ్లూరి చిన్నపుల్లయ్య, నాయకులు బాణోత్ నరసింహారావు, అప్పం సురేష్, తెల్లబోయిన వెంకయ్య, పుల్లయ్య, పోట్ల వెంకటేశ్వరరావు, ఎనగంటి కృష్ణ, మోష, బండి శ్రీను, గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సస్పెన్స్..!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాల భవితవ్యం పూర్తిస్థాయిలో తేలనుంది. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో పేర్కొన్న విధంగా అపాయింటెడ్ డే తర్వాత 136 రెవెన్యూ గ్రామాలు సాంకేతికంగా జిల్లా నుంచి విడిపోయి సీమాంధ్రలో కలుస్తాయి. అయితే.. ఈ గ్రామాల పరిపాలన, ఇక్కడి ప్రజలకు పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన ఏ ప్రభుత్వం చూడాలనే దానిపై మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియపరిస్తే ఆ మేరకు ఆర్టినెన్స్లో పేర్కొని ఆమోదిస్తారు. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో కేంద్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్పాయి. అయితే, ఈలోపు ముంపు ప్రాంతాలను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ, ఏ గ్రామం ఏ ఎంపీటీసీ స్థానం పరిధిలోనికి వెళుతుంది... ఏ జడ్పీటీసీ స్థానం కిందకు వెళుతుంది అనే అంశాలపై నోటిఫికేషన్ వెలువడనుంది. కేంద్ర అధికారితో కలెక్టర్ భేటీ... పోలవరం ముంపు గ్రామాల పరిస్థితిపై చర్చించేందుకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ మంగళవారం రాజ్‌భవన్‌లో కేంద్ర ఉన్నతాధికారి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్న రాజీవ్‌శర్మ కలెక్టర్‌ను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే ప్రాంతాలు కనుక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అక్కడి ప్రజల పాలన ఎలా? పన్నుల వసూళ్లు ఎలా చేయాలి? వారికి పునరావాసం ఏ ప్రభుత్వం కల్పించాలి? అందుకు సంబంధించిన నిధులెక్కడి నుంచి వస్తాయి? అసలు పునరావాసం కింద గోదావరి జిల్లాలకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు అంగీకరిస్తారా? అంగీకరించని పక్షంలో ఖమ్మం జిల్లాలోనే పునరావాసం కల్పించే అవకాశం ఉందా? అనే అంశాలపై సమగ్ర వివరాలను తెలుసుకున్నారు. అయితే, పునరావాస కల్పన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెపుతారని, ఇందుకు సంబంధించిన నిధులను మాత్రం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికార వర్గాలంటున్నాయి. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతే పరిపూర్ణం... కాగా, పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న కొన్ని మార్పుల మేరకు కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా బూర్గంపాడు మండలంలోని ఐదు గ్రామాలను మళ్లీ తెలంగాణలోకి తేవాల్సి ఉంది. దీంతోపాటు కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాల అభిప్రాయం మేరకు కూడా ఆర్డినెన్స్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, మొదటి నుంచీ భద్రాచలం పట్టణంతో సహా ఆ డివిజన్ మొత్తాన్ని పూర్తిగా సీమాంధ్రలోనే విలీనం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో కూడా సాధారణ మెజారిటీతో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్‌లో భద్రాచలాన్ని పూర్తిగా సీమాంధ్రలో కలుపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశం లేనందున ముంపు ప్రజలను ఇప్పుడే సీమాంధ్ర పాలనలోనికి తీసుకెళ్లడం ఇబ్బందేననే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాల కన్నా ఖమ్మంతోనే అనుబంధం ఎక్కువ ని, వారిని ఇక్కడ ఉంచడమే మేలని, పునరావాసం కూడా ఇక్కడే కల్పిస్తే, ముంపు ప్రాంతంలోని భూభాగాన్ని మాత్రమే సీమాంధ్రలో కలపవచ్చనే వాదన కూడా అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే ముంపు ప్రాంతాల భవిష్యత్తును తేల్చడంలో కీలకం కానున్నాయి.