‘ముంపు’ ఆర్డినెన్స్‌పై న్యాయపోరాటం చేస్తాం
కొణిజర్ల : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల గిరిజనులను పోలవరం ముంపు పేరుతో సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ తరఫున సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయున్ని మెప్పించటం కోసమే కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీయవద్దని, జిల్లాలోని ఏడు మండలాల ప్రజలు తెలంగాణలోనే ఉండాలని పార్లమెంట్‌లో తెలంగాణ ప్రాంత నేతలమంతా గగ్గోలు పెట్టినా కేంద్రం వినకుండా ఏకపక్షంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. పల్లిపాడులో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తమ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో కమ్యూనిష్టులను మరిపిస్తామన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని పునరుద్ఘాటించారు.
కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దళిత, గిరిజనులకు మూడెకరాల పొలం ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ పక్ష నాయకుడు తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత రాజకీయాలు అల్లక ల్లోలం అయ్యాయని, అభివృద్ధి ఆమదూరం వెళ్లిందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. రుణమాఫీ ఆలస్యమైతే పోరాటాలు చేయడానికి వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ ఓ నిర్ణయాత్మక శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ రాయల పుల్లయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాముల వెంకటేశ్వర్లు, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కీసర పద్మజారెడ్డి, యువజన విభాగం మండల కన్వీనర్ పాసంగులపాటి శివకుమార్, పెద్దగోపతి ఎంపీటీసీ తాళ్లూరి చిన్నపుల్లయ్య, నాయకులు బాణోత్ నరసింహారావు, అప్పం సురేష్, తెల్లబోయిన వెంకయ్య, పుల్లయ్య, పోట్ల వెంకటేశ్వరరావు, ఎనగంటి కృష్ణ, మోష, బండి శ్రీను, గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.