సాక్షి, కొత్తగూడెం: సాధారణ ఎన్నికల వేడి ఇప్పటికే ప్రారంభం కావడంతో జిల్లాలో శాసనసభ టికెట్ల కోసం ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా దాదాపు అన్నిచోట్లా అధికార టీఆర్‌ఎస్‌తో పాటు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ బీజేపీలో ఎవరికి వారు త మ స్థాయిల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌లో కొంతమంది సిట్టింగ్‌లకు టికెట్లు వచ్చే అవకాశం లేదనే ప్రచారంతో మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పాట్లు పడుతున్నారు.
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఇల్లెందులో రాజకీయం రసకందాయంలో ఉంది. ఇక్కడి నుంచి అధికార టీఆర్‌ఎస్ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్య రేసులో అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కనకయ్య తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. ఇక తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఊకె అబ్బయ్య రేసులో ఉండగా, గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఇక్కడ పోటీ చేసిన డాక్టర్ రవిబాబు నాయక్ కూడా పోటీలో ఉన్నారు. రవిబాబు నాయక్ ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డోర్నకల్‌కు చెందిన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రునాయక్‌ల ఆశీస్సులతో తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇల్లెందు నియోజకవర్గంలో సుమారు 28 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉన్న చీమల వెం కటేశ్వర్లు, రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన బాణోత్ హరిప్రియ, డాక్టర్ జి.రవి, డాక్టర్ రామ చంద్రునాయక్, దళ్‌సింగ్ నాయక్, కేంద్ర మాజీ మంత్రి కుమారుడు సాయిశంకర్, బాణోత్ కాశీరాం ప్రధానంగా రేసులో ఉ న్నారు. కాశీరాం ప్రస్తుతం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన గత వా రం రోజులుగా ఇల్లెందు నియోజకవర్గం లో తిరగుతున్నారు. ఎన్‌ఎస్‌యూఐలో క్రి యాశీలకంగా పనిచేసిన కాశీరాం, కేసీఆర్ ఆమరణ దీక్ష విరమణ చేసిన సమయం లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్‌ఎస్‌యూఐలో పనిచేయడంతో ఢిల్లీ స్థాయిలో విస్తృత పరిచయాలు ఉండడం తో నేరుగా రాహుల్‌గాంధీని కలిశారు. భా రతీయ జనతా పార్టీ నుంచి గుగులోత్ రా మచంద్రునాయక్, ముక్తి పుల్లయ్య, ఈస ం నర్సింహారావు రేసులో ఉన్నారు. ఇక ఇల్లెందుకు చెందిన ప్రముఖ సినీనటి రేష్మ రాథోడ్ బీజేపీ తరుపున మహబూబాబా ద్ లోక్‌సభ టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఇప్పటికే ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించారు.
∙
పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉండగా, పాయం లేదా ఆయన సతీమణి ప్రమీలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బూర్గంపాడు మండలానికి చెందిన ఓ యువ నాయకుడు, అశ్వాపురం మండలానికి చెందిన ఓ ఉద్యోగి సైతం టీఆర్‌ఎస్ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రధానంగా రేసులో ఉన్నారు. మణుగూరుకు చెందిన అటవీశాఖ బీట్ అధికారిగా పనిచేస్తున్న అజ్మీర శాంతి సైతం కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ అగ్రనేతలే శాంతికి మద్దతుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇక్కడ బీజేపీ తరుపున మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, బూర్గంపాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సీతారాంనాయక్, మణుగూరుకు చెందిన తారా ప్రసాద్ రేసులో ఉన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ తరుపున జలగం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ టిక్కెట్టు హామీతో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకవేళ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు కుదిరితే ఈ టిక్కెట్టు తీసుకునే అవకాశం ఉంటుందని కోనేరు భావిస్తున్నారు. ఇక సీపీఐ సైతం కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును గెలిపించుకోవాలనే ఊపుతో ఉంది. కాంగ్రెస్‌తో సీపీఐ కూడా పొత్తు పెట్టుకుంటే ఈ టిక్కెట్టు అడిగేందుకు సీపీఐ సిద్ధంగా ఉంది.
భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు రేసులో ఉన్నారు. అదేవిధంగా చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య, గతంలో టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేసిన మానె రామకృష్ణ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క సైతం ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ తరుపున చర్లకు చెందిన కారం కృష్ణమోహన్ అనే కాంట్రాక్ట్ లెక్చరర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు కుదిరితే టీడీపీ తరుపున పోటీకి కొప్పుల ఫణీశ్వరమ్మ సిద్ధంగా ఉన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున సున్నం నాగమణి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మచ్చా నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్‌లోకి వచ్చి టికెట్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment