కాంగ్రెస్ సంప్రదిస్తే ఏకగ్రీవానికి వైఎస్సార్‌సీపీ సహకారం
♦ వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
♦ పోటీ అనివార్యమైతే పాలేరులో పార్టీ సత్తా చాటుతాం
♦ అధినేత జగన్ సూచన మేరకు తుది నిర్ణయం
సాక్షిప్రతినిధి,ఖమ్మం: ‘వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా, సీఎంగా ఉండగా.. ఎవరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే వారి కుటుంబసభ్యులు సఖ్యతగా ఉంటే ఆ స్థానంలో కుటుంబసభ్యుల్లో ఒకరికి పదవి ఇచ్చే సంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంప్రదాయం, సానుభూతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పాలేరులో అన్ని పార్టీలతోపాటు తమను ఏకగ్రీవానికి సంప్రదిస్తే వైఎస్సార్‌సీపీ ముందు వరుసలో ఉంటుంది. పోటీ అనివార్యమైతే వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతాం.’ అని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
బుధవారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణుల అభిప్రాయం, అధినేత వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాను, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నామని బురదజల్లుతూ చేస్తున్న ప్రచారం.. కట్టు కథలను కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయని.. పదవుల కోసం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు.
పదవులే కావాలనుకుంటే ఎప్పుడో తామిద్దరికి బుగ్గ కార్లు వచ్చేవని, కానీ ప్రజలు తనపై అభిమానంతో గెలిపించారని, దీన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. ఎమ్మెల్యే పాయంను రూ.కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని, ఓ ముగ్గురు మంత్రులు కూడా ఆయన్ను టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఒత్తిడికి గురిచేశారని, కానీ వీటికి తలొగ్గకుండా.. ఆయన నిస్వార్థ ప్రజానాయకుడిగా ఉన్నాడన్నారు. వైఎస్సార్‌సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేసే పదవులు శాశ్వతం కాదని, ప్రజల అభిమానం,ఆత్మీయతే చివరి వరకు ఉంటాయన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న దుష్ర్పచారాన్ని పార్టీ శ్రేణులు నమ్మవద్దని, దీన్ని తిప్పికొట్టాలన్నారు.