తె లంగాణ రాష్ట్రం మే 16 నుంచే ఉనికిలోకి వచ్చేలా అపాయింటెడ్ తేదీని మార్చాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి టీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది.
కేంద్ర హోం శాఖ కార్యదర్శికి టీఆర్‌ఎస్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తె లంగాణ రాష్ట్రం మే 16 నుంచే ఉనికిలోకి వచ్చేలా అపాయింటెడ్ తేదీని మార్చాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి టీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. టీఆర్‌ఎస్ నేతలు వినోద్, జగదీశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బుధవారం మధ్యాహ్నం హోం శాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం నార్త్ బ్లాక్‌వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను పార్టీలు ప్రలోభాలకు గురి చేసే ప్రమాదముందన్నారు. ‘‘ఈ విషయమై టీఆర్‌ఎస్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హైకోర్టును ఆశ్రయించాం. ఎన్నికలు జరిగి, ఫలితాలు మే 16నే వస్తున్నా అపాయింటెడ్ తేదీ జూన్ 2న ఉండటం రాజకీయ శూన్యతకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యాక కూడా రాష్ట్రపతి పాలన ఉండటం అయోమయానికి గురి చేస్తుంది. అందుకే అపాయింటెడ్ తేదీపై పునఃపరిశీలించాలని కోరాం. విభజన ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగేలా ఉన్నందున దానితో అపాయింటెడ్ తేదీకి ముడి పెట్టొద్దని విజ్ఞప్తి చేశాం ’’ అని వివరించారు. హైకోర్టు సూచన మేరకే హోం శాఖ కార్యదర్శిని కలిశామని, కేంద్ర హోం మంత్రిని కలవాలనుకున్నా ఆయన అందుబాటులో లేరని చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్ పోరాడుతోంది. ఇది టీఆర్‌ఎస్ అంశం మాత్రమే కాదు. ఇతర పార్టీలీ మాతో కలిసి వస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ అభ్యర్థనపై హోం శాఖ కార్యదర్శి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. అపాయింటెడ్ తేదీ విషయమై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సూచనపై న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి.