
తెలంగాణ- సీమాంధ్ర మ్యాప్
విభజన బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన నేపధ్యంలో రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉనికిలోకి వచ్చే రోజు( నిర్ణీతరోజు- అపాయింటెడ్ డే) ఏ రోజా అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపధ్యంలో ఆ రోజు ఖరారుపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జనలు పడుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సమావేశమైతే తేలిపోతుందని భావించారు.అయితే వారి సమావేశం పూర్తి అయినా ఒక స్పష్టత రాలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందా? లేక విలీనం చేసుకుంటుందా? అన్న విషయం ఇంకా తేలలేదు. ఈ విషయంలో సోనియా గాంధీ ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేరు.
పార్లమెంటు ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు ఇప్పుడు మరో జంక్షన్‌లో ఆగింది. మరో మూడునాలుగు రోజుల్లో గెజిట్ విడుదల అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే అందులోని ఆ నిర్ణీతరోజు ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, సిబ్బంది పంపిణీ పూర్తి అవ్వాలంటే కనీసం మూడు నెలలు పడుతుందని కేంద్రం హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నికల తర్వాత ఏర్పడుతుందా? లేక మార్చి మొదటి వారంలోనే ఏర్పడుతుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ చిక్కుముడి వీడాలంటే ముందు కాంగ్రెస్ తాను ఆశిస్తున్న రాజకీయలబ్ధిని పూర్తిస్థాయిలో పొందే ప్రక్రియను పూర్తిచేయవలసి ఉంటుంది. టీఆర్‌ఎస్ ఎప్పటికీ రాజకీయ పార్టీగా కొనసాగాలని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గట్టిగా కోరుకుంటున్నారు. కాని కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అని వారంతా ఎదురుచూస్తున్నారు. విలీనం లేదా పొత్తు విషయంలో తుదినిర్ణయాన్ని సోనియాకు విడిచిపెట్టారని అంటున్నారు.
ఇటు టీఆర్‌ఎస్ విలీనం విషయంలో కాంగ్రెస్ కూడా లోతుగా చర్చిస్తోంది. విలీనం, పొత్తు అంశాల్లో లాభనష్టాలను బేరీజు వేస్తోంది. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటే తెలంగాణలో నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలన్నదానిపై సోనియా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ కేసీఆర్‌కు పార్టీని అప్పగించే పక్షంలో పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జానారెడ్డి లాంటి సీనియర్లను ఎలా మేనేజ్ చేయాలన్నదే సోనియా ముందున్న ప్రధాన ప్రశ్న. అంతర్గత కుమ్ములాటల ప్రమాదం పొంచి ఉంటుందని అధిష్టానం నేతల అభిప్రాయం. సామాజికంగా, ఆర్థికంగా భిన్నత్వం అపారంగా ఉన్న తెలంగాణలో నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడం అంత ఆషామాషీకాదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పొత్తు కుదుర్చుకుంటే రెండు పార్టీలు చెందిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చినట్లు ఉన్నా, సీట్లు పంపకాల్లోనూ పితలాటకం తప్పదు. సమన్వయం కొరవడితే బోల్తాపడక తప్పదు. ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్‌కున్న బలహీన ట్రాక్‌రికార్డు - కాంగ్రెస్‌ను భయపెడుతోంది. తమ పార్టీ నాయకులు పొత్తును మాత్రమే కోరుతున్నారని, అది ఇరుపార్టీలకు మంచిదని టీఆర్‌ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు సమాచారం అందించింది. రాష్ట్రాన్ని చీల్చే పనిని తన భుజస్కందాలపై వేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్తో తొలుత ప్రాథమిక చర్చలు జరపాలని కేసీఆర్‌కు సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్‌ఎస్ పంచాయతీ ముగిశాకే రెండు రాష్ట్రాల ఏర్పాటులో స్పష్టత వస్తుందన్న భావన కూడా ఉంది.
s.nagarjuna@sakshi.com