ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో మద్యం సరఫరా నిలిచిపోయింది. విభజన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు, ఇతర లెక్కలను చూసేందుకు మే 27వ తేదీ నుంచి 2వ తేదీ వరకు బేవరేజెస్ అధికారికంగా సెలవులు ప్రకటించారు. కానీ ఈ సెలవులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల నేపథ్యంలో జిల్లాలో మద్యం కొరత తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ అధికారులు వైన్‌షాపులు, బార్‌లకు వారి నెలవారీ లెసైన్స్‌ల స్థాయిని బట్టి ముందే కేటాయించారు. ఈ కారణంగా జిల్లాలో మే నెల చివరిలో మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
మూడు నెలలుగా అంతంతమాత్రంగా విక్రయాలు...
జిల్లాలో 156 వైన్స్ షాపులు , 44 బార్లు, మూడు క్లబ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.45 నుంచి రూ. 55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. కానీ గడచిన మూడు నెలలుగా మాత్రం వ్యాపారం మాత్రం ఆశించిన రీతిలో జరుగలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు, దాడులు నిర్వహించారు. దీంతో వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకోకపోవడంతో ఆశించిన మే వ్యాపారం జరుగలేదు. కానీ మే నెలలో మాత్రం రూ.84.73 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి.
సెలవులతో ఇబ్బంది...
వేసవి సెలవులు కావడంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జాన్ 2న అపాయింటెడ్ డే కావటంతో రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రం విభజనకు ముందే బేవరేజెస్‌ను రెండు రాష్ట్రాలకు సమపద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మే 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగానే బేవరేజెస్‌కు కొద్ది రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించి నిల్వ ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పది రోజుల పాటు జిల్లాలో మద్యం సరఫరా లేకపోవడంతో వైన్స్, బారుల్లో అనివార్యంగా కొరత ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో రోజుకు సగటున పదివేల కేసుల మద్యాన్ని విక్రయిస్తుంటారు. నెలాఖరు కావడం, లెసైన్స్ కాలపరిమితి ముగియనుండడంతో వైన్ షాపుల్లో 30 శాతానికి తక్కువగానే మద్యం నిల్వలు ఉన్నాయి. అలాగే ఈ పదిరోజుల్లో విక్రయాలకు గాను జిల్లాలో లక్ష కేసులు మద్యం అవసరం ఉంది.
మద్యం డిపోల బంద్ ఇంకొన్ని రోజులు పెరిగే అవకాశం..?
డిపోలకు ఈ నెల 2 తేదీన మద్యం వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా పది రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లపై వేసే సీల్, లేబుళ్లు, తెలంగాణ ప్రభుత్వ నూతన సీఎం సంతకం చేసిన తర్వాత బాటిల్‌కు వేయాల్సిన సీల్ మద్యం డిపోలకు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని వైన్ షాపుల యజమానులు పేర్కొంటున్నారు. ఇదంతా జరిగితే జూన్ 15 వరకు మద్యం సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మద్యం సరఫరాకు బ్రేక్
Published Sun, Jun 1 2014 2:32 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement
Advertisement