‘అపాయింటెడ్ డే’పై జోక్యం చేసుకోలేం
అభ్యంతరాలేవో కేంద్రానికి విన్నవించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ విషయంలో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సార్వత్రి క ఎన్నికల ఫలితాలు 16న వెలువడుతున్నందున, ఆ తేదీనే ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థన ను తోసిపుచ్చింది. అధికరణ 226 కింద తాము అటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే జూన్ 2వ తేదీని ‘అపాయింటె డ్ డే’గా ప్రకటించినందున, దాన్ని ఎందుకు ముందుకు మార్చాలో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఓ వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న మే 16వ తేదీనే ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని, లేనిపక్షంలో జూన్ 2 వరకు రాష్ట్రంలో రాజకీయ శూన్యత, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడతాయని పేర్కొంటూ టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జి.జగదీష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 8న విచారణ జరగాల్సి ఉండగా, వేరే కేసులను విచారించేందుకు జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సిద్ధమైన సమయంలో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి ఈ కేసునూ విచారించాలని అభ్యర్థించా రు. దీంతో ధర్మాసనం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర శాసనసభ ఐదేళ్ల కాల పరిమితి జూన్ 2తో ముగుస్తున్నందున, దానిని దృష్టిలో పెట్టుకుని ఆ తేదీని అపాయింటెడ్ డేగా నిర్ణయించారని రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం శాసనసభ రద్దయి, రాష్ట్రపతి పాలన కొనసాగుతోందన్నారు.
అపాయింటెడ్ డే ప్రకటించి న తరువాత ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించి, ఆ మేర మొదటి దశ ఎన్నికలను పూర్తి చేసిందని, 7న రెండో దశ ఎన్నికలు జరుగుతాయని, ఈ రెండు దశల ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న ప్రకటిస్తారని వివరించారు. ఆ వెంటనే రాజ్యాంగం ప్రకారం రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే జూన్ 2ను ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించినందున ఆ లోగా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినందున, ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రపతి పాలన కొనసాగించడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల అపాయింటెడ్ డేని మే 16గా నిర్ణయించాలని విన్నవించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ విష్ణువర్ధన్‌రెడ్డి తన అభిప్రాయం తెలిపారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే జూన్ 2ను ‘అపాయింటెడ్ డే’గా కేంద్రం నిర్ణయించిందని, ఇందులో ఎటువంటి తప్పూ లేదన్నారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం... మే 16ను అపాయింటెడ్ డేగా నిర్ణయించేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలతో కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించారు.