నేటి నుంచి షోరూంలలోనే రిజిస్ట్రేషన్‌ | Online registration at vehicle showrooms | Sakshi
Sakshi News home page

నేటి నుంచి షోరూంలలోనే రిజిస్ట్రేషన్‌

Published Sat, Oct 15 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

నేటి నుంచి షోరూంలలోనే రిజిస్ట్రేషన్‌

నేటి నుంచి షోరూంలలోనే రిజిస్ట్రేషన్‌

 
  • రవాణాశాఖలో సంస్కరణలు
  • కొన్నచోటే శాశ్వత రిజిస్ట్రేషన్‌
  • వెంటనే నంబరు కేటాయింపు
నెల్లూరు (టౌన్‌):
రవాణాశాఖ పలు సంస్కరణల అమలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎల్‌ఎల్‌ఆర్, లైసెన్స్‌లకు సంబంధించి శ్లాట్‌ను ఆన్‌లైన్లో ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావడంతో శనివారం నుంచి వాహనాలు కొన్న షోరూంల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పటి దాకా షోరూంలలో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) మాత్రమే చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం రవాణాశాఖ కార్యాలయానికి పరుగు తీయాల్సి వచ్చేది. ఈ ప్రయాసలను తగ్గించేందుకు రవాణాశాఖ వాహనం కొన్నచోటే శాశ్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. షోరూంల డీలర్లకు గురు, శుక్రవారాల్లో ఆన్‌లైన్‌ విధానంలో శాశ్వత రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఫ్యాన్సీ నంబర్లు సైతం ఆన్‌లైన్లో.. 
 వాహనాలకు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లను సైతం వారం తర్వాత ఆన్‌లైన్లో ఉంచేందుకు రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో నెల్లూరుతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో వాహనాలు రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఎల్‌ఆర్‌లు, లైసెన్స్‌లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, రెన్యూవల్స్, ట్రాన్స్‌ఫర్లు తదితర 83 రకాలు సేవలు జరుగుతున్నాయి.  ఈ సేవల కోసం ప్రతి వాహనదారుడు, వినియోగదారుడు రవాణా కార్యాలయానికి వెళ్లాల్సిని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రవాణా అధికారులు, ఏజెంట్లు కుమ్మక్కై వాహనదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే విమర్శలు రావడంతో వాహనదారుడు నేరుగా ఆన్‌లైన్లో సేవలు పొందే విధంగా రవాణాశాఖ చర్యలు చేపట్టింది.
24గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్‌
షోరూంల్లో ఆన్‌లైన్‌ విధానం ద్వారా వాహనానికి 24గంటల లోపు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఇప్పటి దాక వాహనదారుడు కేవలం టీఆర్‌ మాత్రమే చేయించుకుని కొన్ని నెలల పాటు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా తిరుగుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక నుంచి షోరూంలో వాహనదారుడి సంతకం, వేలిముద్రలు తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్లో రవాణాశాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌కార్డులోని వేలిముద్రను సరిపోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతర వాహనదారుడు ఈమెయిల్‌ ఐడీకి వాహనానికి సంబంధించిన శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరును పంపిస్తారు.
 
కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు – శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, రవాణాశాఖ
వాహన శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం రవాణాశాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. శనివారం నుంచి షోరూంలోనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి వేలిముద్రలు, వాహనం ఫోటోలను షోరూం నిర్వాహకులు రవాణా కార్యాలయానికి అన్‌లైన్లో అనుసంధానం చేస్తారు. కార్యాలయంలో అధికారులు వాటిని నిర్ధారించిన తరువాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ను చేయనున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement