పేరుకుపోయిన హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు...,హైసెక్యూరిటీ నంబరు ప్లేట్‌పై గల లేజర్ కోడ్
హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లంటే వాహనదారులు ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో రవాణా శాఖ కార్యాలయంలో ఈ డిజిటల్ నంబరు ప్లేట్లు కుప్పలుగా పేరుకుపోయాయి. వివిధ కారణాలతో వాహనదారులు వీటిని నివినియోగించుకోవడం లేదు. కనీసం వీటిని వాహనానికి పెట్టుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ల కోసం డబ్బులు చెల్లిస్తున్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ద్విచక్ర వాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున వాహనాదారులు రవాణా శాఖ కార్యాలయంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బులను సంబంధిత హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ల తయారీ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. ఈ నంబరు వాహనం రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులలోపే రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంది. వాహనాదారు మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలల్లో డబ్బు చెల్లిస్తూ వాటిని సొంతం చేసుకుంటున్నారు వాహనాదారులు. ఈ హైసెక్యూరిటీ నంబరు పలకలను వాడటానికి మాత్రం ముందుకు రావడం లేదు.
ఊదాహరణకు టీఎస్ 36 జెడ్ 0001 నంబరు గల వాహనాన్ని వినియోగదారు ఫాన్సీ నంబరు కావడంతో వేలల్లో డబ్బు ఖర్చు చేసి ఈ నంబరును సొంతం చేసుకుంటున్నాడు. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను మాత్రం వినియోగించుకోవడం లేదు. కారణం ఏమిటంటే అతను తన వాహనంపై టీఎస్ 36 జెడ్ 1 అని ఉంటే... 1ని హైలైట్ చేస్తు రాసుకుంటారు. ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లలో ఈలాంటి అవకాశం వాహనదారుకు లభించదు. అందుకే వాహనదారులు ఈ హైసుక్యూరిటీ ప్లేట్లను విస్మరిస్తున్నారు. వాహనం నంబరుపై తన ఇష్టమైన వేరే అంకేలు గల డూప్లికేట్ నంబరు ప్లేట్లను వాడుతున్నారు. దీంతో వీరు ప్రమాదంలో భాగస్వామ్యులైతే వారిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రతి వాహనదారు ఖచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాలి. వీటితో అనేక లాభాలు వాహనదారులకు ఉన్నప్పటికీ వాటిపై వాహనదారుల్లో అవగాహన కరువైంది. దీంతో భారత ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు గదుల్లోనే మూలుగుతున్నాయి.
2013 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనానికి ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్లేట్లలోని లేజర్ కోడింగ్‌తో వాహనదారు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ ప్లేట్లతో భారత దేశంలో గల వాహనాలన్నింటినీ ఆన్‌లైన్‌లో గుర్తించడం సాధ్యం అవుతుంది. ఒకవేళ వాహనం దొంగతనానికి గురైతే ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లతో వాహనాన్ని తొందరగా పట్టుకోవచ్చు. వాహనదారు వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే దాన్ని గుర్తించడం తెలికవుతుంది. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, తదితర వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.
వాడకపోతే ఏమవుతుంది
ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాహనదారులు వాడకపోతే... వాహనానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా... నిలిపివేయబడతాయి. దీంతో వాహనదారులు వాహనాన్ని ఇతరులకు అమ్మాలన్నా... ఇతరుల నుంచి ఖరీదు చేయాలన్నా కష్టం అవుతుంది. రవాణా శాఖ అధికారులు వాహన ఇన్సూన్స్, ఫిట్‌నెస్, ట్యాక్స్ తదితర ముఖ్య సేవలు నిలిపివేస్తారు.
- జిల్లాలో 2013 నుంచి 46,535 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి
- వాహనాదారులు తీసుకుపోయిన నంబరు ప్లేట్లు 39,515
- ఇంకా వాహనాదారులు వాడని ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు 7,020.
హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే వాడాలి
ప్రతి వాహనాదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే తన వాహనానికి ఉపయోగించాలి. ఒకవేళ ఉపయోగించని వాహనాలు తనిఖీల్లో అధికారులకు పట్టుబడితే సీజ్ చేస్తారు. వాహన సేవలు నిలిపి వేస్తారు. వాహనాదారులు ఖచ్చితంగా ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాల్సిందే. ఈహైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు వాడటంతో వాహనాదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
– రామేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment