వాహనాల రిజిస్ట్రేషన్ ఇక ప్రైవేట్‌కు ?
- కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్
- హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌లు కూడా అక్కడే
- ఆటో మొబైల్ షోరూమ్‌లకు అప్పగింత
హైదరాబాద్ : బండి కొన్న చోటే శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేస్తోంది. వాహనదారులు పదే పదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త వాహనాలకు సంబంధించిన పౌరసేవలన్నీ ఒకే చోట లభించేలా వాహనాల రిజిస్ట్రేషన్‌లను ఆటోమొబైల్ డీలర్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఈ దిశగా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల నగరంలోని ద్విచక్ర వాహన డీలర్లు, కార్ల డీలర్లతో రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలోనూ ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశమైంది.
వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌లను వచ్చే జనవరి నుంచి ఆటోమొబైల్ డీలర్లకు అప్పగించాలని ఏపీ రవాణాశాఖ నిర్ణయించిన దృష్ట్యా అదే పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కమిషనర్ ఈ అంశంపై డీలర్లతో చర్చలు జరిపిన ట్లు తెలిసింది. ప్రస్తుతం పంజాబ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో షోరూమ్‌ల వద్దే వాహనదారులకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో తెలంగాణలోనూ అదే పద్ధతిని ప్రవేశ పెట్టడం వల్ల వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని డీలర్లు ఈ సందర్భంగా కమిషనర్‌కు చెప్పారు.
పైగా కొత్త వాహనాల విషయంలో మోటారు వాహన తనిఖీ అధికారులు ప్రత్యేకంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఇంజిన్, చాసిస్ నెంబర్‌ల నమోదు కోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయడంలో అర్థం లేని పని అనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)లు మాత్రమే షోరూమ్‌లలో జరుగుతుండగా శాశ్వత రిజిస్ట్రేషన్‌లు కూడా త్వరలోనే షోరూమ్‌లకు బదిలీకానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 1000 నుంచి 1500 ద్విచక్ర వాహనాలు, 200 నుంచి 300 వరకు కార్లు రిజిస్ట్రేషన్ అవుతాయి.
నగరంలోని ఖైరతాబాద్‌తో పాటు, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, మెహిదీపట్నం, బహదూర్‌పురా, అత్తాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం తదితర కార్యాలయాల్లో వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ సేవలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని ప్రైవేటీకరించడం ద్వారా నగరంలోని 50 ఆటో మొబైల్ కార్ల షోరూమ్‌లు, మరో 200 ద్విచక్ర వాహనాల షోరూమ్‌ల వద్ద వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయం లభిస్తుంది.
నెంబర్‌ప్లేట్‌లు కూడా ...
రిజిస్ట్రేషన్లతో పాటు వాహనదారులు తమకు నచ్చిన నెంబర్‌లను కూడా షోరూమ్‌లలోనే ఎంపిక చేసుకోవచ్చు. అదృష్ట సంఖ్యలు, ఫ్యాన్సీ నెంబర్లకు నగరంలో అనూహ్యమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. వీటి కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి రవాణాశాఖ అధికారులు వేలం పాట నిర్వహించి విక్రయిస్తున్నారు. షోరూమ్‌లలోనే నెంబర్లు ఎంపిక చేసుకొనే అవకాశంతో పాటు, హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌లు కూడా అక్కడే అమర్చేలా పౌరసేవలను వికేంద్రీకరించాలని రవాణాశాఖ భావిస్తోంది.
మరింత దోచుకుంటారు...
శాశ్వత రిజిస్ట్రేషన్లను షోరూమ్‌లకు అప్పగించే ప్రతిపాదనకు ఆర్టీఏ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రూ.100 రుసుముతో అందజేయాల్సిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ సేవలను రూ.500 చొప్పున , హ్యాండ్లింగ్ చార్జీల పేరిట వాహనదారుల నుంచి రూ.3000 నుంచి రూ.5000 వరకు డీలర్లు అదనంగా వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్న పరిస్థితుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్‌లను కూడా వారికే కట్టబెట్టడం వల్ల ఈ దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆర్టీఏ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.