High security number plates
-
వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్నిరకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి సంబంధిత డీలర్లు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అందించేలా చూడాలన్నారు. పాత వాహనదారులు కూడా నిర్దిష్ట వ్యవధిలోగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉంటున్నాయని, ఆ విధంగా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలన్నారు. రేడియం టేప్ అతికించాలి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేప్ అతికించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని రవాణా, పోలీస్ శాఖలను ఆదేశించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది. కొన్ని జిల్లాల్లో ఈ ట్రాక్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్గుప్త, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, అదనపు డీజీపీ (రోడ్డు సేఫ్టీ) కృపానంద త్రిపాఠి ఉజేల, రవాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి షోరూంల్లోనే నంబర్ ప్లేట్
సాక్షి, హైదరాబాద్: హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవడం తప్పనిసరయినా.. కొందరు వీటిపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇలాంటి వారు సైతం విధిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలన్న ఆలోచనతో షోరూంల్లోనే వీటిని బిగించేలా రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతీ వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, వాహన యజమాని వ్యక్తిగత వివరాలు పొందుపరిచేలా.. బయోమెట్రిక్ యంత్రాలు సమకూర్చుకోవాలని షోరూంలకు ఆదేశాలు జారీ చేసింది. హైసెక్యూరిటీ ప్లేట్ల విషయంలోనూ ఇదే విధానం పాటించనుంది. ఇకపై షోరూంల్లో రిజిస్ట్రేషనయ్యే బైకులు, కార్లు, తదితర నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి బయటకు పంపుతారు. హైసెక్యూరిటీ తప్పనిసరి ఎందుకు? వాహనాల విషయంలో పలువురు అవకతవకలకు పాల్పడటం, ఒకే నంబర్‌పై అనేక వాహనాలు నడపటం, పేలుళ్లకు చోరీ చేసిన వాహనాలు వినియోగించడం తదితర ఘటనలు పెరుగుతున్న దరిమిలా.. 2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్ల బిగింపును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2015, డిసెంబర్ నాటికి పాత, కొత్త వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. అయితే, అప్పటి నుంచి కొత్త వాహనాలకు మాత్రమే వీటిని బిగిస్తున్నారు. బైక్‌కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి. నంబర్‌ప్లేట్ సిద్ధం కాగానే వాహనదారుడికి ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అపుడు వెళ్లి దాన్ని బిగించుకోవాలి. అసలు ఇలాంటి వాహనాలకు ఆర్సీలు పంపడం వల్లే వాహనదారులు కొందరు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై ఆసక్తి చూపడం లేదని తెలంగాణ ఆటోమోటార్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ ఆరోపించారు. వాస్తవానికి ఇలాంటి వాహనాలకు చలానాలకు బదులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అమలులో అనేక లోపాలు.. వాస్తవానికి ఈ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు చాలా పలుచగా ఉన్నాయని విమర్శలున్నాయి. వీటిని పిల్లలు సైతం వంచడం లేదా పీకేయడం సులువుగా చేస్తున్నారు. దీంతో ఈ ప్లేట్లు అమర్చాక పట్టుమని 10 నెలలు కూడా ఉండటం లేదని వాహనదారులు వాపోతున్నారు. మరోవైపు ఇవి ఆకర్షణీయంగా లేవన్న కారణంతో యువకులు చాలామంది బిగించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో చాలా వరకు హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లు ఆర్టీఏ కార్యాలయాల్లో మూలకు పడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్ప్లేట్లను వంచడం, విరగ్గొట్టడం చేస్తున్నారు. ఈ నంబర్ ప్లేట్ రెండోసారి బిగించుకోవాలంటే ఎఫ్ఐఆర్ తప్పనిసరి. ఈ తతంగమంతా ఎందుకులే అని వాహనదారులు వారే కొత్త ప్లేట్ వేయించుకుంటున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ లేకుండా తిరిగినప్పుడు ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు చలానా రాస్తారు. అయినా.. వాహనదారులు చలానాలు కడుతున్నారు తప్ప.. వీటిని బిగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. -
వాహనదారులందరికి గమనిక!
న్యూఢిల్లీ : 2019 ఏప్రిల్1 నుంచి అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే వాటిపై తప్పనిసరిగా అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ సైతం ఉండాలని, వాహన తయారీదారులందరూ ఈ విషయాన్ని తమ డీలర్లకు తెలియజేయాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ట్యాంపర్ ప్రూఫ్ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లతో దొంగతనాలను అరికట్టడమే కాకుండా, నకిలీ నెంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఏప్రిల్ 1 నుంచి వాహనాన్ని తయారు చేసే కంపెనీలే వాహనంతోపాటు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్, థర్డ్ రిజిస్ట్రేషన్ మార్క్‌లను డీలర్లకు సరఫరా చేయాలని ఆదేశించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్ 1989లో చేయాల్సిన మార్పులను ప్రజాభిప్రాయం కోసం ఉంచామని, దీనిపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న దీనికి సంబంధించి సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. -
ఆ నెంబర్ ప్లేట్.. ఎందుకంత లేట్..
సాక్షి, సిటీబ్యూరో: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్. వాహనాల భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ప్రారంభించిన 5 ఏళ్లు గడిచినా లక్షలాది వాహనాలు ఇంకా ఈ పథకానికి దూరంగానే ఉన్నాయి. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) అమలులో రవాణ శాఖ చేపట్టే చర్యలు పూర్తిస్థాయి ఫలితాలను అందజేయలేకపోతున్నాయి. ఇటీవల కాగ్ నివేదికలోనూ ఇదే అంశం వెల్లడైంది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా ఇంకా 2,92,843 వాహనాలు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు బదులు సాధారణ నెంబర్ ప్లేట్లనే వినియోగిస్తున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన 2013 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన మరో 30 లక్షల వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తంగా ఈ పథకం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. భద్రతకు భరోసా ఏదీ...? హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో ఏ రోజుకు ఆ రోజు నమోదయ్యే కొత్త వాహనాలకు మొదట బిగించి, ఆ తరువాత క్రమంగా పాత వాహనాలకు కూడా ఈ నెంబర్ ప్లేట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కొత్త వాహనాల లక్ష్యమే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ 2.98 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు ఉదాహరణ. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2015 డిసెంబర్ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కానీ ఐదేళ్లు గడిచిన తరువాత కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమల్లోని జాప్యంపై కాగ్ అక్షింతలు వేయడం దీని అమల్లోని నిర్లక్ష్యాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు సుమారు 1,500 వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. ఆర్టీఏ కార్యాలయంలో నమోదయ్యే ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్‌తో పాటు నెంబర్ ప్లేట్ కూడా అప్పటికప్పుడే బిగించే సదుపాయం ఉంటే చాలా వరకు జాప్యం లేకుండా ఉండేది. కానీ వాహనం నమోదుకు, నెంబర్ ప్లేట్ ఏర్పాటుకు మధ్య 15 రోజుల నుంచి నెల వరకు గడవు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఖైరతాబాద్‌లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. హెచ్ఎస్ఆర్పీ ఉన్న వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డు అందజేస్తున్నారు. అలాగే ఆదివారం సెలవు దినమైనా హెచ్ఎస్ఆర్పీ కేంద్రాన్ని తెరిచి ఉంచుతున్నారు. ఈ చర్యల వల్ల ఖైరతాబాద్‌లో వీటి అమలు బాగానే ఉంది. కానీ మిగతా ఆర్టీఏల్లో ఇలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాణ్యత డొల్ల... మరోవైపు వాహనాల భద్రతకు ప్రతీకగా భావించే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లలో నాణ్యత కొరవడింది. విరిగిపోవడం, పూర్తిగా రంగు పోవడం, వాహనదారులు ఆశించిన విధంగా నెంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడంతో చాలా మంది విముఖత చూపుతున్నారు. హెఎండ్ వాహనదారులు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు కలిగిన వారు, రకరకాల ఫ్యాన్సీ నంబర్లు, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లు పొందిన వాహనదారులు వాటిని తమకు నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ నాణ్యత లేని, రంగు వెలిసిపోయే హెచ్‌ఎస్‌ఆర్‌పీని మాత్రం కోరుకోవడం లేదు. ఈ పథకం విజయవంతంగా అమలు కాకపోవడానికి ఇదీ ఒక కారణం. కాగ్ నివేదికపై సమీక్ష... కాగ్ నివేదికలో వెల్లడించిన అంశాలపై ఈ నెల 4వ తేదీన రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్షించనున్నారు. లోపాలను సరిద్దిద్దుకొని హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర అంశాలపైన కూడా చర్చించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. -
ప్లేట్ ఫిరాయింపు..
హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లంటే వాహనదారులు ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో రవాణా శాఖ కార్యాలయంలో ఈ డిజిటల్ నంబరు ప్లేట్లు కుప్పలుగా పేరుకుపోయాయి. వివిధ కారణాలతో వాహనదారులు వీటిని నివినియోగించుకోవడం లేదు. కనీసం వీటిని వాహనానికి పెట్టుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ల కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ద్విచక్ర వాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున వాహనాదారులు రవాణా శాఖ కార్యాలయంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బులను సంబంధిత హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ల తయారీ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. ఈ నంబరు వాహనం రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులలోపే రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంది. వాహనాదారు మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలల్లో డబ్బు చెల్లిస్తూ వాటిని సొంతం చేసుకుంటున్నారు వాహనాదారులు. ఈ హైసెక్యూరిటీ నంబరు పలకలను వాడటానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఊదాహరణకు టీఎస్ 36 జెడ్ 0001 నంబరు గల వాహనాన్ని వినియోగదారు ఫాన్సీ నంబరు కావడంతో వేలల్లో డబ్బు ఖర్చు చేసి ఈ నంబరును సొంతం చేసుకుంటున్నాడు. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను మాత్రం వినియోగించుకోవడం లేదు. కారణం ఏమిటంటే అతను తన వాహనంపై టీఎస్ 36 జెడ్ 1 అని ఉంటే... 1ని హైలైట్ చేస్తు రాసుకుంటారు. ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లలో ఈలాంటి అవకాశం వాహనదారుకు లభించదు. అందుకే వాహనదారులు ఈ హైసుక్యూరిటీ ప్లేట్లను విస్మరిస్తున్నారు. వాహనం నంబరుపై తన ఇష్టమైన వేరే అంకేలు గల డూప్లికేట్ నంబరు ప్లేట్లను వాడుతున్నారు. దీంతో వీరు ప్రమాదంలో భాగస్వామ్యులైతే వారిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రతి వాహనదారు ఖచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాలి. వీటితో అనేక లాభాలు వాహనదారులకు ఉన్నప్పటికీ వాటిపై వాహనదారుల్లో అవగాహన కరువైంది. దీంతో భారత ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు గదుల్లోనే మూలుగుతున్నాయి. 2013 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనానికి ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్లేట్లలోని లేజర్ కోడింగ్‌తో వాహనదారు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ ప్లేట్లతో భారత దేశంలో గల వాహనాలన్నింటినీ ఆన్లైన్లో గుర్తించడం సాధ్యం అవుతుంది. ఒకవేళ వాహనం దొంగతనానికి గురైతే ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లతో వాహనాన్ని తొందరగా పట్టుకోవచ్చు. వాహనదారు వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే దాన్ని గుర్తించడం తెలికవుతుంది. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, తదితర వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. వాడకపోతే ఏమవుతుంది ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాహనదారులు వాడకపోతే... వాహనానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా... నిలిపివేయబడతాయి. దీంతో వాహనదారులు వాహనాన్ని ఇతరులకు అమ్మాలన్నా... ఇతరుల నుంచి ఖరీదు చేయాలన్నా కష్టం అవుతుంది. రవాణా శాఖ అధికారులు వాహన ఇన్సూన్స్, ఫిట్నెస్, ట్యాక్స్ తదితర ముఖ్య సేవలు నిలిపివేస్తారు. జిల్లాలో 2013 నుంచి 46,535 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి వాహనాదారులు తీసుకుపోయిన నంబరు ప్లేట్లు 39,515 ఇంకా వాహనాదారులు వాడని ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు 7,020. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే వాడాలి ప్రతి వాహనాదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే తన వాహనానికి ఉపయోగించాలి. ఒకవేళ ఉపయోగించని వాహనాలు తనిఖీల్లో అధికారులకు పట్టుబడితే సీజ్ చేస్తారు. వాహన సేవలు నిలిపి వేస్తారు. వాహనాదారులు ఖచ్చితంగా ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాల్సిందే. ఈహైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు వాడటంతో వాహనాదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. – రామేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి -
‘హైసెక్యూరిటీ’ తప్పనిసరి
ఆదిలాబాద్: హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేకుండా తిరిగే వాహనాలపై రవాణా శాఖ కొరఢా ఝులిపించనుంది. కొత్తగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పటికీ చాలా మంది హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ పెట్టుకోవడం లేదు. వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. జిల్లాలో టీఎస్ సిరీస్ వచ్చినప్పటి నుంచి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను బిగిస్తున్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వీటిని బిగించుకోకుండా సాధారణ నంబర్‌ప్లేట్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి వాహనదారులపై కఠినంగా వ్యవహరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2013 డిసెంబర్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు తప్పకుండా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని.. లేని వాహనదారులకు పెద్ద ఎత్తున జరిమానాతో పాటు పలు సేవలను నిలిపివేసేందుకు ఆ శాఖ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 4వేల వాహనాలు.. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు సుమారు 4వేలకు పైగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వినియోగించలేదని అధికారులు గుర్తించారు. ఈ వాహనదారులంతా త్వరలోనే ౖహైసెక్యూరిటీ నంబర్ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ నంబర్ ప్లేట్‌కు డబ్బులు చెల్లించి ఉంటారు కాబట్టి వెంటనే దీన్ని బిగించుకోవాలని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం పక్కనే ఈ నంబర్ ప్లేట్లను అమరుస్తున్నారు. అదనంగా ఎవరైనా నంబర్ ప్లేట్‌కు డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనదారులకు మెసేజ్ ద్వారా నంబర్ ప్లేట్ పెట్టుకునేలా సమాచారం అందించేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎస్ఆర్పీ సంస్థ నుంచి ఎస్సెమ్మెస్ అందుకున్న వాహనదారులు వారం, పది రోజుల్లో ఈ నంబర్ ప్లేట్ అమర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా వాహనాల చోరీలను సైతం అరికట్టవచ్చు. గతంలో ద్విచక్రవాహనాలతో పాటు, పెద్ద వాహనాలు సైతం చోరీకి గురయ్యేవి. వాటిని వేరే నంబర్ ప్లేట్‌తో నడుపుకునేవారు. వాహనాల దొంగలని పట్టుకోవాలంటే చాలా కాలం పట్టేది. ఈ నేపథ్యంలో వాహనాలకు రక్షణగా కొత్త ఆర్టీఏ చట్టం తీసుకొచ్చారు. వాహనాలు దొంగిలించిన వెంటనే దొరికేలా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమలులోకి తీసుకొచ్చింది. త్వరలో తనిఖీలు.. వాహనాలను ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని, హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోని వాహనాలపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించారు. యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్‌నంబర్‌కు మొదటి ఎస్సెమ్మెస్ పెడుతారు. పది రోజుల తర్వాత కూడా నంబర్‌ప్లేట్ బిగించుకోకపోతే వాహనాలు తనిఖీలు చేసి పెద్ద ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. రవాణా శాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాలు ఇంకా అందలేవని, అక్కడి నుంచి ఆదేశాలు అందిన వెంటనే తనిఖీలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు. హైసెక్యూరిటీ ప్లేట్ వినియోగించాల్సిందే.. జిల్లాలో టీఎస్ సిరీస్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ వినియోగించాల్సిందే. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఇందుకోసం ఫీజు సైతం చెల్లిస్తారు. మళ్లీ చెల్లించే అవసరం లేదు.కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – పాపారావు, జిల్లా రవాణా శాఖ అధికారి -
‘ప్లేటు’ ఫిరాయింపు
‘హై సెక్యూరిటీ నంబర్ప్లేట్ల’పై అయిష్టత! నాణ్యతాలోపంతో ముందుకురాని ప్రజలు కొత్త నిబంధనలతో మరింత బేజారు రవాణాశాఖ కార్యాలయంలోనే పేరుకుపోయి తుప్పుపడుతున్న వైనం చిత్తూరు (అర్బన్): హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు.. వినడానికి బాగానే ఉన్నా ఇవి ప్రజలకు పెద్దగా నచ్చడం లేదు. దీంతో వాహనాలకు వేయిచాల్సిన నంబరు ప్లేట్లు వందల సంఖ్యలో ఓ మూలనపడేశారు. జిలా రవాణాశాఖ కార్యాలయంలోనే అవి తుప్పుపడుతున్నాయి. ఇదీ లక్ష్యం.. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, దోపిడీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులు పారిపోయే సమయంలో వాహనాలకున్న నంబర్ల ఆధారంగానే వాటిని పట్టుకోవడం సాధ్యమవుతుంది. అయితే వాహనచోదకులు నంబర్ ప్లేట్‌పై అక్షరాలను పద్ధతి లేకుండా రాయించుకుంటున్నారు. 2013 నవంబర్ నుంచి రాష్ట్రంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వీటిని తప్పనిసరిగా మోటారు వాహనాలకు వేసుకోవాలి. దీంతో జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు మోటారు వాహన తనిఖీ అధికారి యూనిట్ కార్యాలయ వద్ద సైతం హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ అమర్చే కార్యాలయాలను అందుబాటులో ఉంచారు. జిల్లాలో ఇలా.. చిత్తూరు, పలమనేరు, పీలేరు, మదనపల్లె ప్రాంతాల్లో రోజుకు సగటున 80 వా హనాలు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. తిరుపతి ఆర్టీఏ పరిధిలోని తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తిల్లో ఈ సంఖ్య వంద దాటుతోంది. హెచ్ఎస్ఆర్పీ బిగించడానికి ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లకు రూ.245, ఆటోలు, మూడు చక్రాల వాహనాలకు రూ.282, లైట్ మో టారు వాహనాలకు రూ.691, భారీ వాహనాలకు రూ.649 చొప్పున రవాణాశాఖ కార్యాలయాల్లోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తయిన రెండు రోజుల్లో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్టను ఎక్కడయితే వాహన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అక్కడకు వెళ్లి బిగించుకోవాలి. కొన్ని చోట్ల 20 రోజులవుతున్నా హెచ్ఎస్ఆర్పీ రావడంలేదు. దీనికితోడు మామూలు నంబరు ప్లేటు వేయించుకోవాలంటే రూ.వంద చెల్లిస్తే సరిపోతుంది. ఇది విరిగిపోతే మార్చుకోవడం కూడా సులభమే. కానీ హెచ్ఎస్ఆర్పీ నాణ్యత డొల్లగా మారింది. చిన్న పిల్లలు దీన్ని వంచితే వంగిపోతున్నాయి. ఇక ప్రమాదాల్లో దె బ్బతిన్న హెచ్ఎస్ఆర్పీలను మార్చడం కోసం ఒక్కోసారి వాహనానికే రంద్రం వేయాల్సి రావడం ఇబ్బందికరంగా మా రుతోంది. తాజాగా వాహన రిజిస్ట్రేషన్లు ఆర్టీఏ కార్యాలయాల్లో చేయడంలేదు. ఆయా డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. వీటికి హెచ్ఎస్ఆర్పీ వేసుకోవడం మరింత భారంగా మారనుంది. డీలర్ల వద్ద వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నా.. నంబర్ప్లేట్ల కోసం మళ్లీ ఆర్టీఏ కార్యాలయాలకు పరుగులు తీయాల్సిన రావడంతో వాహన చోదకులు అనాసక్తి చూపుతున్నారు. రీప్లేస్ చేస్తున్నాం మా వద్ద చాలావరకు ఆటోలు, ట్రాక్టర్లు, లారీల నంబర్ ప్లేట్లు నిలిచిపోతున్నాయి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్లిపోతే మళ్లీ వాహనాన్ని తీసుకురావడానికి ఓనర్లు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. కస్టమర్ కేర్ నుంచి చెప్పించి హెచ్స్ఆర్పీ వేసుకోమని చెబుతున్నాం. ఆర్టీఏ వాళ్లు కూడా కాస్త పట్టించుకుని అవగాహన కల్పించాలి. ఇక గతంలో వచ్చిన ప్లేట్లలో కొన్ని నాణ్యత లేనట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని తీసుకొచ్చి మాకిస్తే ఇప్పుడు దృఢంగా ఉన్న వాటిని ఉచితంగా వేసి పంపుతున్నాం. –ప్రసాద్, హెచ్ఎస్ఆర్పీ జిల్లా పర్యవేక్షకులు -
వాహనాల రిజిస్ట్రేషన్ ఇక ప్రైవేట్‌కు ?
కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లు కూడా అక్కడే ఆటో మొబైల్ షోరూమ్‌లకు అప్పగింత హైదరాబాద్ : బండి కొన్న చోటే శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేస్తోంది. వాహనదారులు పదే పదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త వాహనాలకు సంబంధించిన పౌరసేవలన్నీ ఒకే చోట లభించేలా వాహనాల రిజిస్ట్రేషన్లను ఆటోమొబైల్ డీలర్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఈ దిశగా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల నగరంలోని ద్విచక్ర వాహన డీలర్లు, కార్ల డీలర్లతో రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలోనూ ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్లను వచ్చే జనవరి నుంచి ఆటోమొబైల్ డీలర్లకు అప్పగించాలని ఏపీ రవాణాశాఖ నిర్ణయించిన దృష్ట్యా అదే పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కమిషనర్ ఈ అంశంపై డీలర్లతో చర్చలు జరిపిన ట్లు తెలిసింది. ప్రస్తుతం పంజాబ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో షోరూమ్‌ల వద్దే వాహనదారులకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో తెలంగాణలోనూ అదే పద్ధతిని ప్రవేశ పెట్టడం వల్ల వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని డీలర్లు ఈ సందర్భంగా కమిషనర్‌కు చెప్పారు. పైగా కొత్త వాహనాల విషయంలో మోటారు వాహన తనిఖీ అధికారులు ప్రత్యేకంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఇంజిన్, చాసిస్ నెంబర్ల నమోదు కోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయడంలో అర్థం లేని పని అనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)లు మాత్రమే షోరూమ్‌లలో జరుగుతుండగా శాశ్వత రిజిస్ట్రేషన్లు కూడా త్వరలోనే షోరూమ్‌లకు బదిలీకానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 1000 నుంచి 1500 ద్విచక్ర వాహనాలు, 200 నుంచి 300 వరకు కార్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. నగరంలోని ఖైరతాబాద్‌తో పాటు, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, మెహిదీపట్నం, బహదూర్‌పురా, అత్తాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం తదితర కార్యాలయాల్లో వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ సేవలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని ప్రైవేటీకరించడం ద్వారా నగరంలోని 50 ఆటో మొబైల్ కార్ల షోరూమ్‌లు, మరో 200 ద్విచక్ర వాహనాల షోరూమ్‌ల వద్ద వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయం లభిస్తుంది. నెంబర్ప్లేట్లు కూడా ... రిజిస్ట్రేషన్లతో పాటు వాహనదారులు తమకు నచ్చిన నెంబర్లను కూడా షోరూమ్‌లలోనే ఎంపిక చేసుకోవచ్చు. అదృష్ట సంఖ్యలు, ఫ్యాన్సీ నెంబర్లకు నగరంలో అనూహ్యమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. వీటి కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి రవాణాశాఖ అధికారులు వేలం పాట నిర్వహించి విక్రయిస్తున్నారు. షోరూమ్‌లలోనే నెంబర్లు ఎంపిక చేసుకొనే అవకాశంతో పాటు, హై సెక్యూరిటీ నెంబర్ప్లేట్లు కూడా అక్కడే అమర్చేలా పౌరసేవలను వికేంద్రీకరించాలని రవాణాశాఖ భావిస్తోంది. మరింత దోచుకుంటారు... శాశ్వత రిజిస్ట్రేషన్లను షోరూమ్‌లకు అప్పగించే ప్రతిపాదనకు ఆర్టీఏ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రూ.100 రుసుముతో అందజేయాల్సిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ సేవలను రూ.500 చొప్పున , హ్యాండ్లింగ్ చార్జీల పేరిట వాహనదారుల నుంచి రూ.3000 నుంచి రూ.5000 వరకు డీలర్లు అదనంగా వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్న పరిస్థితుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్లను కూడా వారికే కట్టబెట్టడం వల్ల ఈ దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆర్టీఏ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
హై సెక్యూరిటీ!
డిసెంబర్ మొదటివారం నుంచి జిల్లాలో అమలు కొత్త వాహనాలకు తప్పనిసరి యూనిట్ కార్యాలయాల్లో ఏర్పాట్లు విజయవాడ : రాష్ట్ర నూతన రాజధాని విజయవాడలో ఇకపై నూతన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి కానున్నాయి. మరి కొద్దినెలల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో దీనిని అమలులోకి తెచ్చారు. డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లాలోనూ దీనిని అమలులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయించారు. ఆర్టీసీ దీనిని మరో ఏజెన్సీకి అప్పగించింది. ఈ క్రమంలో జిల్లాలోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయాల్లో వీటి కోసం ప్రత్యేకంగా గదులు కేటాయించారు. ప్రధానంగా వాహనాలను వినియోగించి చేసే నేరాల నియంత్రణకు, కొన్ని ప్రత్యేక కేసుల్లో పోలీసుల దర్యాప్తుకు దోహదపడేలా ఈ నంబర్ ప్లేట్ల కార్యక్రమాన్ని రూపొందించారు. కసరత్తు వేగవంతం... జిల్లాలోని రవాణాశాఖ యూనిట్ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ఏజెన్సీలకు ప్రత్యేకంగా గదులు కేటాయించారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయంలోనే దీనిని మొదలుపెట్టారు. ఇది కొన్ని జిల్లాలకే పరిమితమైంది. విజయవాడ రాష్ట్ర నూతన రాజధాని కావటంతో ఇక్కడ తప్పనిసరిగా దీనిని అమలులోకి తేవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విజయవాడలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం, ఉయ్యూరు, నందిగామ తదితర యూనిట్ కార్యాలయాల్లో నంబర్ ప్లేట్ల ఏర్పాటుకు అవసరమైన పనులు మొదలుపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి, నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసే మిషనరీకి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్‌ను పూర్తిచేసి కార్యాలయాలను రవాణా శాఖ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు కొద్దిరోజుల్లో ప్లేట్ల తయారీ మిషన్లను ఏర్పాటుచేసే సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవడం తదితర పనులు పూర్తిచేసి దీనిని మొదలుపెట్టనున్నారు. వాహనాల భద్రత కోసమే... ప్రధానంగా వాహనాల భద్రత కోసమే వీటిని అమలులోకి తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేకంగా తయారయ్యే ఈ నంబర్ ప్లేట్లను వాహనాలకు అమర్చడం ద్వారా వాహనాలకు భద్రతతో పాటు దొంగ వాహనాల నుంచి కొంత రక్షణ ఉంటుంది. ప్రత్యేకమైన మెటాలిక్, క్రోమియంతో పాటు ఇతర లోహాలతో దీనిని తయారు చేస్తారు. సాధారణ నంబర్ ప్లేట్లలా కాకుండా వాహనంలో అంతర్భాగంగా ఉండేలా దీనిని అమరుస్తారు. ఒకవేళ దీనిని తొలగించాలంటే వాహన అడుగు భాగం కొంత దెబ్బతినే రీతిలో పకడ్బందీగా దీనిని అమరుస్తారు. ముఖ్యంగా భద్రత కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వివిధ నేరాలకు పాల్పడేవారు తాము వినియోగించే వాహనాల నంబర్ ప్లేట్లు మార్చివేసి యథేచ్ఛగా కార్యకలాపాలు చేస్తున్నారు. దీనివల్ల పోలీసుల దర్యాప్తు ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ క్రమంలో నిందితులు తేలిగ్గా తప్పించుకునే అవకాశముంటోంది. ప్రస్తుతం ఏర్పాటుచేయనున్న హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను మార్చటం అంత సులువు కాదు. ఒకవేళ వాటిని మార్చినా వెంటనే తెలిసిపోతుంది. ఇది పోలీసుల దర్యాప్తులో కీలకంగా దోహదపడుతుంది. ముందు కొత్త వాహనాలకు.. ప్రస్తుతం జిల్లాలో నెలకు సగటున 200 నుంచి 300 వరకు కార్ల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. తొలిదశలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలోనే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ నిబంధనను తప్పనిసరి చేసి అమలు చేయనున్నారు. ఆ తర్వాత మరో ఆరు నెలల కాలవ్యవధిలో జిల్లాలో ఉన్న పాత వాహనాలకు కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. -
ఇక హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ రాజారత్నం పేర్కొన్నారు. మంగళవారం ఆర్టీవో కార్యాలయంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చే విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండాలని తెలిపారు. టీఎస్ సిరీస్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితోపాటు పాత వాహనదారులూ వీటిని అమర్చుకోవాలని సూచించారు. నాలుగు నెలల్లో వీటిని అమర్చుకోకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్లు ఆర్టీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నంబర్ ప్లేట్లను క్రోమియోనిక్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసినట్లు వివరించారు. వీటి తయారీని లింక్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నంబర్ ప్లేట్ల కోసం ద్విచక్రవాహనాలకు రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ. 282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున రుసుం తీసుకుంటామన్నారు. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలు చోరీకి గురైనప్పుడు దొంగలు వాటిని మార్చే వీలుండదని, దీని ద్వారా త్వరగా పట్టుకునే వీలుంటుందన్నారు. అదేవిధంగా ఆర్టీవో కార్యాలయంలో రూ.42 వేలతో ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రిజిస్ట్రేషన్ల కోసం దళారులను ఆశ్రయించొద్దని, నేరుగా కార్యాలయంలోనే సంప్రదించాలన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులపై చర్యలు చేపడుతామని, ఫిట్నెస్ లేని బస్సులు నడుపకూడదని సూచించారు. -
ఇక ప్లేట్ మార్చాల్సిందే..
సాక్షి, కాకినాడ : వాహనాలకు పాత నంబర్ ప్లేట్లకు బదులు ఇకపై హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) అమర్చాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ నెల 22 నుంచి ఈ విధానం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల వాహనాల చోరీకి అడ్డుకట్టపడనుండగా, భద్రత మాటున వాహనదారులకు భారీగానే చేతిచమురు వదలనుంది. దశాబ్దాలుగా నంబర్ ప్లేట్ల తయారీ, స్టిక్కరింగ్‌పై ఆధారపడిన వందలాది మంది ఉపాధికి గండి పడనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్తగా రిజిస్టరయ్యే వాహనాలతో పాటు ప్రస్తుతం ఉన్న వాహనాలన్నింటికీ 2015 డిసెంబర్ 15లోగా ఈ హెచ్ఎస్ఆర్పీలను అమర్చాలి. అయితే అందుబాటులో ఉన్న ప్లేట్ల తయారీ, నంబర్ల ఏర్పాటు యూనిట్లకనుగుణంగా.. ప్రస్తుతానికి కొత్తగా రిజిస్టరయ్యే వాహనాలకు మాత్రమే వీటి ఏర్పాటును పరిమితం చేశారు. తయారీ యూనిట్లు పెరిగాక దశల వారీగా పాతవాహనాలకు కూడా వర్తింప చేయనున్నారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలో ఈ ప్లేట్ల తయారీ, విక్రయాలను కేంద్రం న్యూఢిల్లీకి చెందిన లింక్ ఆటోటెక్ సంస్థకు అప్పగించింది. జిల్లాలో ఈ నెల 16 నుంచి కొత్తగా రిజిస్టరైన వాహనాలకు ఈ నెల 22 నుంచి హెచ్ఎస్ఆర్పీలను అమరుస్తారు. జిల్లాలో అన్నిరకాల వాహనాలూ కలిపి రోజూ 300కు పైగా కొత్తగా రిజిస్టరవుతుంటాయి. ‘హెచ్ఎస్ఆర్పీ’ ప్రత్యేకతలివీ.. ఒక మిల్లీమీటర్ మందంతో రెట్రో రెఫ్లెక్టివ్ షీటింగ్(అల్యూమినియం)పై క్రోమియమ్ బేస్డ్ హాలోగ్రామ్, ఇండియా ఇన్స్క్రిప్టెడ్ హాట్ స్టాంపింగ్ ఫాయిల్‌తో పాటు కనీసం ఏడు నంబర్ల యూనిక్ లేజర్ కోడ్ కలిగిన ఈ ప్లేట్‌పై చీకట్లో సైతం కనీసం 200 మీటర్ల వరకు స్పష్టంగా కనిపించేలా నంబర్లు అమరుస్తారు. ఒకసారి అమర్చిన ప్లేట్‌ను పగలగొట్టడానికి, ధ్వంసం చేయడానికి, కనీసం నంబర్లు మార్చేందుకు వీలు కాదు. అన్ని వాహనాలకు ఒకే సైజులో అమర్చే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజింగ్ షీట్ వల్ల.. వాహనాన్ని అపహరిస్తే ఏదైనా టోల్గేట్ వద్ద సీసీ కెమెరాలు ఇట్టే పసిగడతాయి. ప్లేట్‌కు అమర్చే లేజర్ కోడ్‌ను ఆన్‌లైన్‌తో అనుసంధానించడం వలన వాహనం చోరీకి గురైనప్పుడు కోడ్‌ను బట్టి ఆ వాహనం ఎక్కడుందో గుర్తించవచ్చు. అమర్చుకోవాలంటే ఏం చేయాలి.. ఇక నుంచి కొత్తగా వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్‌కు చెల్లించే చలానాతో పాటు హెచ్ఎస్ఆర్పీకి కూడా చలానా తీయాల్సి ఉంటుంది. ఆ చలానా నంబర్‌ను బట్టి సీరియల్లో నంబర్ ప్లేట్ ఎప్పుడు అమర్చేదీ చెబుతారు. రోజూ రిజిస్టరయ్యే వాహనాల సంఖ్యను బట్టి ప్లేట్ల తయారీకి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. న్యూఢిల్లీలో ఏఆర్ఆర్ఐలో ఆమోదం పొందిన ప్లేట్లపై రాజమండ్రిలో ఏర్పాటు చేసే యూనిట్లో నంబర్లు వేస్తారు. రాజమండ్రి రోజూ రెండువేలప్లేట్లపై నంబర్లు వేసే యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ర్టంలో మరో యూనిట్‌ను కడపలో ఏర్పాటు చేస్తున్నారు. నంబర్లు వేసిన ప్లేట్‌ను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సమక్షంలో వాహనానికి అమరుస్తారు. చలానా తీయడంలో, ప్లేట్లు అమర్చడంలో బ్రోకర్లను, ఏజెంట్లను ఆశ్రయించకుండా విధిగా వాహనయజమానులే రావాల్సి ఉంటుంది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు యెల్లో బ్యాక్‌గ్రౌండ్‌తో ప్లేట్లు అమరుస్తారు. మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లకు ముందువైపు 285ఁ45 ఎంఎం, వెనుకవైపు 200 ఁ100 ఎంఎం, స్కూటర్లకు ముందువైపు 200ఁ100 ఎంఎం, వెనుకవైపు 200ఁ100 ఎంఎం, లైట్ మోటార్ వెహికల్‌కు ముందూవెనుకా 500ఁ120 ఎంఎం, ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో త్రీ వీలర్లకు రెండువైపులా200 ఁ100ఎంఎం, లైట్ మోటార్ వాహనాలకు రెండువైపులా 500 ఁ 120 ఎంఎం, లైట్ గూడ్స్, హెవీగూడ్స్ వాహనాలకు ఇరువైపులా 340 ఁ120 ఎంఎం సైజులో ఈ ప్లేట్లను అమరుస్తారు. వాహనదారులకు చేతిచమురే.. చలానాతో కలుపుకొని మొదటిసారి హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటుకు వాహన యజమానులకు చేతిచమురు బాగానే వదలనుంది. ద్విచక్రవాహనాలకు రూ.245, త్రీ వీలర్స్‌కు రూ.282, లైట్ మోటార్ వెహికల్స్‌కు రూ.619, మీడియం ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్, హెవీ ట్రాన్స్‌పోర్టు, ట్రైయిలర్స్కు రూ.649 చొప్పున చలానాలు తీయాల్సి ఉంటుంది. అదే రెండోసారైతే 500 ఁ120 ఎంఎం ప్లేట్‌కు రూ.283, 340ఁ200 ఎంఎం ప్లేట్‌కు రూ.299, 200 ఁ 100 ఎంఎం ప్లేట్‌కు రూ.115, 285ఁ45 ఎంఎం ప్లేట్‌కు రూ.107 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం తెలంగాణ లో నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అమలవుతుండగా, మన రాష్ర్టంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అమలవుతోంది. ఇప్పటి వరకు వాహనాల నంబర్ ప్లేట్ల ఏర్పాటు, స్టిక్కరింగ్‌పై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు ఈ కొత్త విధానం వల్ల రోడ్డునపడనున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురంతో పాటు జిల్లాలో 500 మందికి పైగా ఉపాధి కోల్పోనున్నారు. -
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అనివార్యం!
తొలుత కొత్త వాహనాలకు ఏర్పాటు తరువాత పాత వాహనాలకు తప్పనిసరి నంబర్ ప్లేట్ మార్పిడికి చెక్ సాక్షి, విజయవాడ : వాహనాలకు న్యూ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (ఎన్హెచ్ఎస్ఆర్పీ)ను ఉపయోగించాలనే నిబంధన త్వరలో అమలు చేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కొత్తగా కొనబోయే వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయిస్తారు. ఆ తరువాత కొన్ని నెలల వ్యవధిలో మిగిలిన అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చి ఎన్హెచ్ఎస్ఆర్పీ నంబరు పేట్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటారు. 2015 డిసెంబర్ 10లోగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నంబర్ ప్లేట్లు తయారు చే సి విక్రయించేందుకు న్యూ ఢిల్లీకి చెందిన మెస్సర్స్ లింక్ ఆటో టెక్నాలజీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నంబర్ ప్లేట్ల వల్ల ఉపయోగాలివీ... ప్రస్తుతం ఉన్న నంబర్ ప్లేట్లను వాహన వినియోగదారులు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల నేరాలకు పాల్పడేవారు నంబర్ ప్లేట్లు తీసివేయడం, మార్చివేయడం చేస్తున్నారు. హై సెక్యూరిటీ ప్లేట్లను ఒక్కసారి వాహనానికి బిగిస్తే తరువాత మార్చడం కష్టం. వాహనానికి చాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ ఉన్నట్లే 14 డిజిట్ల బార్ కోడ్ ఉంటుంది. దీని సహాయంతో వాహనానికి ఉపయోగించే నంబర్ ప్లేట్ ఆ వాహనానికి చెందినదా? కాదా? అని అధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. దొంగలు వాహనాన్ని చోరీ చేసిన తరువాత నంబర్ ప్లేట్లు మార్చుకునే వీలుండదు. హై సెక్యూరిటీ ప్లేట్లను బయట ఎక్కడ పడితే అక్కడ విక్రయించడానికి వీలులేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన లింగ్ ఆటో టెక్నాలజీ సంస్థ నుంచే తీసుకోవాలి. ఈ సంస్థ కార్యాలయం నిర్వహించడానికి రవాణా శాఖ కార్యాలయాల్లోనే స్థలం కేటాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన సంస్థ కాకుండా బయట ప్రైవేటు సంస్థలు తయారు చేసే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తీసుకున్నట్లు తెలిస్తే వాహన యజమానిపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. రవాణాశాఖ కేటాయించిన నంబర్‌ను తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేసి ఫ్యాన్సీగా ప్లేట్ తయారు చేయించి ఉపయోగిస్తూ ఉంటారు. హై సెక్యూరిటీ ప్లేట్‌ను అలా మార్చడానికి కుదరదు. దూరం నుంచి చూసినా, అర్ధరాత్రి వేళల్లోనూ, దీపం వెలుగులో చూసినా స్పష్టంగా కనపడేవిధంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను రూపొందించారు. దీనివల్ల రాత్రివేళల్లో ప్రమాదాలకు గురిచేసి వెళ్లిపోయే వాహనాల నంబర్లు సులభంగా గుర్తించే అవకాశముంటుంది. ఆగస్టు నుంచి కొత్త ప్లేట్ల పంపిణీ... విజయవాడ బందరు రోడ్డులోని రవాణా శాఖ కార్యాలయంలో కొత్త నంబర్ ప్లేట్లు తయారు చేసే మిషనరీని మెస్సర్స్ లింక్ ఆటో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషనరీ ఏర్పాట్లు పూర్తికాగానే ఆగస్టు నుంచి కొత్త ప్లేట్లు ఇచ్చే అవకాశం ఉంది. నంబర్ ప్లేట్ల రేట్లు ఇలా... హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల రేట్లను ప్రభుత్వమే నిర్ణయించింది. జిల్లాలో ఒకే సంస్థ ఈ నంబర్ ప్లేట్లు జారీ చేస్తున్నందున వాహనయజమానుల నుంచి ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. కొత్త నంబర్ ప్లేట్ల రేట్లు ఈ కింది విధంగా ఉంటాయి. ద్విచక్ర వాహనాల ప్లేట్ తయారీ,ఫిక్సింగ్, లాకింగ్కు - రూ.208.00 మూడు చక్రల వాహనాలకు మూడు ప్లేట్ల ఫిక్సింగ్, లాకింగ్కు - రూ.239.20 కార్లు, వ్యాన్లు, పాసింజర్, గూడ్స్ వాహనాలకు - రూ.525.20 కమర్షియల్ వాహనాలు, భారీ వాహనాలకు - రూ.551.20 -
‘హై సెక్యూరిటీ’కి బ్రేక్!
నాణ్యత ప్రమాణాలు నిల్ వాహనదారుల ఫిర్యాదుపై స్పందన విశాఖపట్నం, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడింది. నాణ్య త ప్రమాణాలు పాటించడం లేదని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సేవలు నిలిచాయి. బోర్డుల తయారీ సక్రమంగా జరగడం లేదని తెలిసి అధికారులు అడ్డుకట్ట వేశారు. బుధవారం నుంచి బోర్డుల ప్రక్రియ కొనసాగడం లేదు. రక్షణ, భద్రత లక్ష్యం గా అమలులోకి వచ్చిన ‘హై సెక్యూరిటీ’ నంబర్ బోర్డుల విధానం విమర్శలకు దారి తీస్తోంది. బోర్డుల తయారీపై ఆరోపణలు వచ్చాయి. మోటారు వాహనాల చట్టంలో తెలిపిన ప్ర మాణాలు తయారీ సంస్థ పాటించడం లేదని, చెల్లించిన ధరకు తగ్గట్టుగా బోర్డులు లేవంటూ వాహనదారులు ఫిర్యాదులు చేశారు. విశాఖలో మార్చి 10 నుంచి హైసెక్యూరిటీ బోర్డుల వినియోగం అమలు జరుగుతోంది. బోర్డుల తయారీలో నాణ్యత పట్ల వాహన యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలో బోర్డులను ‘లింక్ ఆటో టెక్’ సంస్థ తయారీ చేస్తోంది. బోర్డుల నాణ్యత, తయారీ అంశాలను రవాణా, ఆర్టీసీ అధికారులు పర్యవేక్షిస్తారు. తయారీ సంస్థ నిబంధనలు పాటించకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తు న్నాయి. చట్టంలో నిబంధనలు తయారీ సంస్థ సక్రమంగా అమలు చేస్తోందా, లేదా అనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ఒక వేళ ప్రమాణాలకు విరుద్ధమని తెలిస్తే సంస్థ బాధ్యత వహించాలి. ఈ విషయమై ఇప్పటికే తయారీ సంస్థకు సూచనలు, హెచ్చరికలు జారీ చేసి నట్టు సమాచారం. బోర్డుల తయారీలో నాణ్యత పాటించి సరఫరా చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. -
అందుబాటులోకి ‘హై సెక్యూరిటీ’
మర్రిపాలెం : హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్న వీటిని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వాహన య జమానికి రవాణా శాఖ కార్యాలయం లో ఆర్టీవో ఎ.హెచ్.ఖాన్ బోర్డులు అందజేశారు. కొత్తగా రిజిస్ట్రేషన్ పూ ర్తయిన అన్ని తరహా వాహనాలకు ఈ బోర్డులు అమర్చాలని ఖాన్ తెలిపా రు. బోర్డుల ప్రత్యేకతను ఆయన వివరించారు. ఆర్ అండ్ బీ జంక్షన్ వాహనాల రిజిస్ట్రేషన్ భవనంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. బోర్డులు తయారు చేస్తున్న లింక్ ఆటో టెక్ సంస్థ ఉద్యోగులు కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కౌంటర్లో వాహన యజమాని వివరాలు తెలపాలి. ఆయా వాహనాలకు తగ్గట్టుగా బోర్డు ధరను చెల్లించాలి. వాహనం వివరాలుగా యజమాని పేరు, చిరునామా, ఇంజన్, చాసిక్ నంబర్లను రవాణా ఉద్యోగులు సంస్థకు చేరవేస్తారు. ఏపీఎస్ ఆర్టీసీ నేతృత్వంలో రవాణా, లింక్ ఆటో టెక్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బోర్డులు అందజేస్తారు. బోర్డుల తయారీ అనంతరం ఎస్ఎంఎస్ ద్వారా యజమానులకు సమాచారం చేరుతుంది. సంస్థ ఉద్యోగులు బోర్డులు సిద్ధమన్న సందేశం తెలియజేస్తారు. ప్రత్యేక కౌంటర్లో బోర్డులు అమర్చుతారు. బోర్డులు నేరుగా అందజేయరు. వాహనాన్ని తీసుకొస్తే సంస్థ ఉద్యోగులు అమర్చుతారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో బోర్డులు వాహనానికి అమర్చాలని నిబంధన ఉంది. బోర్డుల తయారీకి కనీసం నాలుగు రోజుల వ్యవధి పడుతుందని సంస్థ తెలిపింది. గతేడాది డిసెంబర్ 11 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు బోర్డులు అమర్చాల్సి ఉంది. బోర్డుల ఏర్పాటులో ఎటువంటి సందేహాలు తలెత్తినా సంస్థ ఉద్యోగులను సంప్రదించవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు వస్తున్న యజమానులకు ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు. -
జిల్లాకు రాని హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
అరసవల్లి, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఇంకా జిల్లాకు రాలేదని, వీటిని విక్రయించే సెంటర్‌ను త్వరలో తెలియజేస్తామని రవాణాశాఖ ఉప కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ‘న్యూస్‌లైన్‌తో’ ఆయన మాట్లాడారు. వాహనాలకు ఉండే నంబర్ ప్లేట్ల వ్యవహారంలో నిబంధనలు కఠినతరం చేస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. దీన్ని ప్రత్యేకంగా ఓ సంస్థకు కాంట్రాక్ట్ అప్పజెప్పిందన్నారు. పెలైట్ పాజెక్టు కింద రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో నంబర్ ప్లేట్ల ప్రక్రియ జరుగుతోందని, శ్రీకాకుళంలో ఇంకా ప్రారంభం కాలేదన్నారు. జిల్లా కేంద్రంలో పలు వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొత్తవి వస్తే వాటిని తీసేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచిగుర్తింపుపొందిన హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లుగా నమ్మించి దళారీలు ఎక్కువ సొమ్ము వసూలు చేసి మోసం చేస్తున్నారన్నారు. అలా ఎవరైన నంబర్ ప్లేట్లు ఇస్తామంటే తమకు తెలియజేయాలని కోరారు. నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ జిల్లాలో బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ సమీపిస్తుండడంతో జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులపై దాడులు నిర్వహిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలపై కేసులు పెడతామన్నారు. రవాణాశాఖ నియమ నిబంధలను అనుగుణంగా వాహనాలు నడపక పోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ప్రైవేటు ఆపరేటర్లను హెచ్చరించారు. ఇప్పటి వరకు నిబంధనలను అతిక్రమించి తిరుగుతున్న బస్సులపై కేసులు రాయడం, అపరాధ రుసుము వసూలు చేయడం, కోర్టులో ప్రవేశపెట్టడం చేస్తున్నామని.. దీనివల్ల ఫలితం తక్కువగా ఉందన్నారు. ఇకపై నిబంధలనకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే అక్కడిక్కడే పర్మిట్ రద్దు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు అప్పగిస్తామని స్పష్టం చేశారు. నిర్ధేశించిన మేరకే సీట్ల సంఖ్య ఉండాలని, రేడియం స్టిక్కర్లు అతికించాలని, దూరప్రాంతాలకు నడిపే బస్సుల్లో అనుభవం కలిగిన ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. కాంట్రాక్టు క్యారేజీ పద్ధతిలో మాత్రమే వాహనాలను నడపాలని, స్టేజ్ క్యారీయర్లుగా నడపవద్దని హెచ్చరించారు. ప్రయాణికులకు విడిగా టిక్కెట్లు, మధ్యలో ప్రయాణికులను ఎక్కించడం, దించడం చేయకూడదన్నారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల జాబితాను తెలిపే రిజిష్టరు తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణానికి ముందు దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో, రవాణా శాఖ కార్యాలయంలో తప్పనిసరిగా జాబితాను అందజేయాలన్నారు. రద్దీ సీజన్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి దాడులు నిర్వహిస్తామన్నారు. దాడులకు వెళ్లిన అధికారులు నిలిచిన ప్రైవేటు బస్సులు అరసవల్లి, న్యూస్‌లైన్:రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు చేసిన దాడుల నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు వాహనాల యాజమాన్యాలు మంగళవారం షాపులను మూసివేశారు. జిల్లా నుంచి ఒక్క ప్రైవేటు బస్సు కూడా కదలలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దాడులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు బస్సులను నడపలేదు. శ్రీకాకుళం, నరసన్నపేట, రాజాం, పాలకొండ, టెక్కలి, పలాసలలో దాడులు చేయడానికి వెళ్లిన అధికారులకు మూసివేసి ఉన్న అఫీసులు దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం పట్టణంలోని ఎస్వీఆర్, కేవీఆర్, నవీన్, ఆపిల్, పద్మావతి తదితర ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కదల్లేదు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాల్లో 450 బడి, కళాశాలల బస్సులు, 27 కాంట్రాక్టు క్యారియర్ బస్సులు, 96 స్టేజి క్యారియర్ బస్సులున్నాయి. రోజూ జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల నుంచి 25 బస్సులు అనధికారంగా మరో 70 పైగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. మంగళవారం ఒక్కటి కూడా కదల్లేదు. ఈ విషయమై రవాణాశాక ఉప కమిషనర్ ఎస్.వెంకటేశ్వరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు ఆపరేట్లపై దాడులు నిర్వహించామన్నారు. అయితే సోమవారం రాత్రి విజయవాడ, హైదరాబాద్‌లో అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని ప్రైవేటు ఆపరేటర్లు తమ కార్యాలయాలను, టికెట్లు విక్రయించేలేదన్నారు. -
‘హై సెక్యూరిటీ’ని ఆపండి
రవాణా కమిషనర్‌ను కోరిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్ర విభజన జరగనున్న నేపథ్యంలో వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను వెంటనే నిలుపుద ల చేయాలని ప్రభుత్వాన్ని టీడీపీ కోరింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, జి. జైపాల్‌యాదవ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సోమవారం రవాణా కమిషనర్ అనంత రాములుకు ఓ వినతిపత్రం అందచేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రస్తుతం అసెంబ్లీలో ఉందని, త్వరలో విభజన జరగబోతోందని తమ వినతిపత్రంలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ తరుణంలో సాధారణ నంబర్ ప్లేట్ల స్థానంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలనే ఉత్తర్వులను నిలిపేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల తయారీకి అయ్యే ఖర్చు మన రాష్ర్టంతో పోలిస్తే 25 శాతం తక్కువగా ఉందని, ఈ నిబంధన అమలు చేసే ముందు ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. జవాన్ల మృతిపట్ల చంద్రబాబు సంతాపం: దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతిదళంపై రెండు వేల మంది ఆందోళనకారులు దాడి చేసిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు మృతిచెందటం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానం అమలు
-
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానం అమలు
హైదరాబాద్ : రాష్ట్రంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. మొదటగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్నాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఇక తప్పని సరికానుంది. నెల రోజుల్లోపు మిగతా జిల్లాల్లోని 123 రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో కూడా ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా కొత్త వాహనాలకు ఏర్పాటు చేసి.. తరువాత 90 రోజుల్లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 30 లక్షల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు. కాగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానాన్ని కొద్ది రోజులు వాయిదా వేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర విభజన జరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలపై రెండుసార్లు అదనపు భారం వేయటం సరికాదని అన్నారు. -
వంద శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా?
హైదరాబాద్: గ్యాస్ రాయితీ, నగదు బదిలీ పథకం చట్టవిరుద్దమంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. గ్యాస్ రాయితీ, నగదు బదిలీపై చమురు సంస్థలు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 100 శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా అని చమురు కంపెనీలను ధర్మాసనం ప్రశ్నించింది. అసంబద్ద విధానాల వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. రాయితీ బదిలీ కోసం ఎంత మంది బ్యాంకు ఖాతాలు కలిగివుంటారని చమురు సంస్థలను ప్రశ్నించింది. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ పేట్ల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. నంబర్ పేట్ల కాంట్రాక్టును ఒక్కరికే ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈవిధంగా స్పందించింది. -
ఇకపై హై సెక్యూరిటీ
మంచిర్యాల రూరల్/ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : మోటారు వాహనాలకు హై సెక్యూరిటీ విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నా ఈనెల 11 నుంచి కొత్త, ప్రస్తుత వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నంబరు ప్లేట్లు ఉన్న పాత వాహనాలకు దశలవారీగా అమర్చుకోవాలి. డిసెంబర్ 10, 2015 వరకు జిల్లాలోని అన్ని వాహనాలకు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండాలని స్పష్టం చేసింది. జిల్లాలో ద్విచక్ర, త్రిచక్ర, లైట్, మీడియం, హెవీ వాహనాలు దాదాపు 2,49,369పైగా ఉంటాయి. ఈ వాహనాల యజమానులు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుకోవాల్సిందే. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.6.28 కోట్లకుపైగా భారం పడే అవకాశం ఉంది. వ్యాట్, ఎక్సైజ్ సుంకం కలిపితే భారగనుంది. లింక్ ఆటో టెక్నాలజీస్‌కు హైసెక్యూరిటీ నంబర్లను అందించేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించగా, ఒక్కో వాహనానికి ఒక్కో విధమైన ధరలను ఆ సంస్థ నిర్దేశించింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఎందుకంటే.. పెరుగుతున్న వాహన ప్రమాదాలు, అధికమవుతున్న చోరీలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ముందు దుండగులు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చుతున్నారు. కొన్ని సందర్భాల్లో గుర్తించకుండా కాల్చేసి సాక్ష్యాలు దొరక్కుండా చేస్తున్నారు. వీటన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ హైసెక్యూరిటీ నంబర్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వీటిద్వారా కొంతవరకైనా అసాంఘిక కార్యకలాపాలను ఆపాలని సంకల్పించింది. ఇది అదనపు భారమే.. గతంలోనే తాము నంబర్ ప్లేట్లను అమర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అంటూ అధిక ధరలకు ప్లేట్లు అమర్చుకోవడం ఆర్థికంగా ఇబ్బందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మన రాష్ట్రంలో రూ.100 ధర అధికంగా ఉంది. - విజయ్, ద్విచక్రవాహనదారుడు, మంచిర్యాల ప్రభుత్వమే అందించాలి.. కొత్త వాహనాలకు నూతనంగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను అమర్చాలనడం న్యాయమే. కానీ, గతంలోని వాహనాలకు కూడా సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అంటే తమకు ఆర్థికంగా అధిక భారం పడుతది. పాత వాహనాలకు ప్రభుత్వమే ప్లేట్లు బిగించే ఏర్పాటు చేయాలి. - శ్రీను, ఆటో యజమాని, మంచిర్యాల ధరల్లో వ్యత్యాసం ఎందుకు.. ఇతర రాష్ట్రాల్లో హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను రూ.140, రూ.150లకు అందిస్తుండగా, అదే కాంట్రాక్టరుకు ఆంధ్రప్రదేశ్‌లో రూ.240కి పైగా ధరను చెల్లించడం ఎందుకు. ఇది ప్రజలపై అధిక భారం వేయడమే. ప్రభుత్వమే తక్కువ ధరల్లో ఉండేలా చేయడమో, ధర తగ్గించడమో చేయాల్సిందే. - అశోక్, కారు యజమాని, ఆదిలాబాద్ -
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి
* 11వ తేదీ నుంచి కొత్త వాహనాలకు అమలు * 2015 డిసెంబరు 10 నాటికి అన్ని వాహనాలకు తప్పనిసరి * ‘లింక్ఆటో టెక్నాలజీస్’కు కాంట్రాక్టు.. నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కొత్త వాహనాలకు కొత్త హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు (ఎన్హెచ్ఎస్ఆర్పీ) అమర్చడం ఈ నెల 11 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. పాత వాహనాలకు కూడా దశలవారిగా హై సెక్యూరిటీ నంబరుప్లేట్లు అమర్చుకోవాలని, 2015 డిసెంబరు 10 నాటికి రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబరుప్లేట్లు ఉండాలని స్పష్టం చేసింది. ఉత్సవ్ సేఫ్టీ సిస్టమ్, లింక్ఆటో టెక్నాలజీస్ల కన్సార్షియంకు ఈ కాంట్రాక్టు దక్కింది. ద్విచ క్ర వాహనాలకు రూ.208, త్రిచక్ర వాహనాలకు రూ.239.20, లైట్‌మోటార్ వాహనాలకు రూ.525.20, మీడియం, హెవీ వాహనాలు, వాణిజ్య, ట్రెయిలర్లకు రూ 551.20 వంతున నంబరు ప్లేట్ల ఏర్పాటుకు వ సూలు చేయనున్నారు. రీప్లేస్‌మెంట్‌కు అన్ని రకాల వాహనాలకు రూ.240 చార్జీ చేస్తారు. ఈ ధరలకు ఎక్సైజ్ సుంకం, వ్యాట్ అదనం. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు అదనపు గడువు తీసుకున్న రాష్ట్ర సర్కారు ఇకమీదట గడువు పొడిగింపు సాధ్యంకాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో హడావుడి కొత్త నెంబరుప్లేట్ల విధానాన్ని అమలుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెండర్లో తక్కువ ధర కోట్ చేసినప్పటికీ కాంట్రాక్ట్ పొందిన సంస్థ వసూలు చేసే మొత్తాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీగానే ఉండటం గమనార్హం. ఇదే కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్‌లో రూ. 140, పశ్చిమబెంగాల్లో రూ. 150, మిగతా రాష్ట్రాల్లోనూ దాదాపు అదే ధరకు నంబర్ప్లేట్లు సరఫరా చేస్తున్నారు.