ఇక ప్లేట్ మార్చాల్సిందే.. | high security number plates are coming for vehicles instead of old number plates | Sakshi
Sakshi News home page

ఇక ప్లేట్ మార్చాల్సిందే..

Published Sat, Jul 19 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

ఇక ప్లేట్ మార్చాల్సిందే..

ఇక ప్లేట్ మార్చాల్సిందే..

సాక్షి, కాకినాడ : వాహనాలకు పాత నంబర్ ప్లేట్లకు బదులు ఇకపై హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్‌ఎస్‌ఆర్పీ) అమర్చాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ నెల 22 నుంచి ఈ విధానం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల వాహనాల చోరీకి అడ్డుకట్టపడనుండగా, భద్రత మాటున వాహనదారులకు భారీగానే చేతిచమురు వదలనుంది. దశాబ్దాలుగా నంబర్ ప్లేట్ల తయారీ, స్టిక్కరింగ్‌పై ఆధారపడిన వందలాది మంది ఉపాధికి గండి పడనుంది.
 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్తగా రిజిస్టరయ్యే వాహనాలతో పాటు ప్రస్తుతం ఉన్న వాహనాలన్నింటికీ 2015 డిసెంబర్ 15లోగా ఈ హెచ్‌ఎస్‌ఆర్పీలను అమర్చాలి. అయితే అందుబాటులో ఉన్న ప్లేట్ల తయారీ, నంబర్ల ఏర్పాటు యూనిట్లకనుగుణంగా.. ప్రస్తుతానికి కొత్తగా రిజిస్టరయ్యే వాహనాలకు మాత్రమే వీటి ఏర్పాటును పరిమితం చేశారు. తయారీ యూనిట్లు పెరిగాక దశల వారీగా పాతవాహనాలకు కూడా వర్తింప చేయనున్నారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలో ఈ ప్లేట్ల తయారీ, విక్రయాలను కేంద్రం న్యూఢిల్లీకి చెందిన లింక్ ఆటోటెక్ సంస్థకు అప్పగించింది. జిల్లాలో ఈ నెల 16 నుంచి కొత్తగా రిజిస్టరైన వాహనాలకు ఈ నెల 22 నుంచి హెచ్‌ఎస్‌ఆర్పీలను అమరుస్తారు. జిల్లాలో అన్నిరకాల వాహనాలూ కలిపి రోజూ 300కు పైగా కొత్తగా రిజిస్టరవుతుంటాయి.
 
‘హెచ్‌ఎస్‌ఆర్పీ’ ప్రత్యేకతలివీ..
ఒక మిల్లీమీటర్ మందంతో రెట్రో రెఫ్లెక్టివ్ షీటింగ్(అల్యూమినియం)పై క్రోమియమ్ బేస్డ్ హాలోగ్రామ్, ఇండియా ఇన్‌స్క్రిప్టెడ్ హాట్ స్టాంపింగ్ ఫాయిల్‌తో పాటు కనీసం ఏడు నంబర్ల యూనిక్ లేజర్ కోడ్ కలిగిన ఈ ప్లేట్‌పై చీకట్లో సైతం కనీసం 200 మీటర్ల వరకు స్పష్టంగా కనిపించేలా నంబర్లు అమరుస్తారు. ఒకసారి అమర్చిన ప్లేట్‌ను పగలగొట్టడానికి, ధ్వంసం చేయడానికి, కనీసం నంబర్లు మార్చేందుకు వీలు కాదు. అన్ని వాహనాలకు ఒకే సైజులో అమర్చే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజింగ్ షీట్ వల్ల.. వాహనాన్ని అపహరిస్తే ఏదైనా టోల్‌గేట్ వద్ద సీసీ కెమెరాలు ఇట్టే పసిగడతాయి. ప్లేట్‌కు అమర్చే లేజర్ కోడ్‌ను ఆన్‌లైన్‌తో అనుసంధానించడం వలన వాహనం చోరీకి గురైనప్పుడు కోడ్‌ను బట్టి ఆ వాహనం ఎక్కడుందో గుర్తించవచ్చు.
 
అమర్చుకోవాలంటే ఏం చేయాలి..
ఇక నుంచి కొత్తగా వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్‌కు చెల్లించే చలానాతో పాటు హెచ్‌ఎస్‌ఆర్పీకి కూడా చలానా తీయాల్సి ఉంటుంది.  ఆ చలానా నంబర్‌ను బట్టి సీరియల్‌లో నంబర్ ప్లేట్ ఎప్పుడు అమర్చేదీ చెబుతారు. రోజూ రిజిస్టరయ్యే వాహనాల సంఖ్యను బట్టి ప్లేట్ల తయారీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తారు. న్యూఢిల్లీలో ఏఆర్‌ఆర్‌ఐలో ఆమోదం పొందిన ప్లేట్లపై రాజమండ్రిలో ఏర్పాటు చేసే యూనిట్‌లో నంబర్లు వేస్తారు. రాజమండ్రి రోజూ రెండువేలప్లేట్లపై నంబర్లు వేసే యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ర్టంలో మరో యూనిట్‌ను కడపలో ఏర్పాటు చేస్తున్నారు. నంబర్లు వేసిన ప్లేట్‌ను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో వాహనానికి అమరుస్తారు. చలానా తీయడంలో, ప్లేట్లు అమర్చడంలో బ్రోకర్లను, ఏజెంట్లను ఆశ్రయించకుండా విధిగా వాహనయజమానులే రావాల్సి ఉంటుంది.
 
నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు వైట్  బ్యాక్‌గ్రౌండ్‌తో, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు యెల్లో బ్యాక్‌గ్రౌండ్‌తో ప్లేట్లు అమరుస్తారు. మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లకు ముందువైపు 285ఁ45 ఎంఎం, వెనుకవైపు 200 ఁ100 ఎంఎం, స్కూటర్లకు ముందువైపు 200ఁ100 ఎంఎం, వెనుకవైపు 200ఁ100 ఎంఎం, లైట్ మోటార్ వెహికల్‌కు ముందూవెనుకా 500ఁ120 ఎంఎం,  ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో త్రీ వీలర్లకు  రెండువైపులా200 ఁ100ఎంఎం, లైట్ మోటార్ వాహనాలకు రెండువైపులా 500 ఁ 120 ఎంఎం, లైట్ గూడ్స్, హెవీగూడ్స్ వాహనాలకు ఇరువైపులా 340 ఁ120 ఎంఎం సైజులో ఈ ప్లేట్లను అమరుస్తారు.
 
వాహనదారులకు చేతిచమురే..

చలానాతో కలుపుకొని మొదటిసారి హెచ్‌ఎస్‌ఆర్పీ ఏర్పాటుకు వాహన యజమానులకు చేతిచమురు బాగానే వదలనుంది. ద్విచక్రవాహనాలకు రూ.245, త్రీ వీలర్స్‌కు రూ.282, లైట్ మోటార్ వెహికల్స్‌కు రూ.619, మీడియం ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్, హెవీ ట్రాన్స్‌పోర్టు, ట్రైయిలర్స్‌కు రూ.649 చొప్పున చలానాలు తీయాల్సి ఉంటుంది. అదే రెండోసారైతే 500 ఁ120 ఎంఎం ప్లేట్‌కు రూ.283, 340ఁ200 ఎంఎం ప్లేట్‌కు రూ.299, 200 ఁ 100 ఎంఎం ప్లేట్‌కు రూ.115, 285ఁ45 ఎంఎం ప్లేట్‌కు రూ.107 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
 
ప్రస్తుతం ఈ విధానం తెలంగాణ లో నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అమలవుతుండగా, మన రాష్ర్టంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అమలవుతోంది. ఇప్పటి వరకు వాహనాల నంబర్ ప్లేట్ల ఏర్పాటు, స్టిక్కరింగ్‌పై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు ఈ కొత్త విధానం వల్ల రోడ్డునపడనున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురంతో పాటు జిల్లాలో 500 మందికి పైగా ఉపాధి కోల్పోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement