
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్నిరకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి సంబంధిత డీలర్లు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అందించేలా చూడాలన్నారు.
పాత వాహనదారులు కూడా నిర్దిష్ట వ్యవధిలోగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉంటున్నాయని, ఆ విధంగా చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలన్నారు.
రేడియం టేప్ అతికించాలి
ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేప్ అతికించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని రవాణా, పోలీస్ శాఖలను ఆదేశించారు.
ఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది.
కొన్ని జిల్లాల్లో ఈ ట్రాక్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్గుప్త, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, అదనపు డీజీపీ (రోడ్డు సేఫ్టీ) కృపానంద త్రిపాఠి ఉజేల, రవాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్‌ఏవీ ప్రసాదరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment