హై సెక్యురిటీ నంబర్ ప్లేట్ ఉన్న ద్విచక్ర వాహనం..
ఆదిలాబాద్: హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేకుండా తిరిగే వాహనాలపై రవాణా శాఖ కొరఢా ఝులిపించనుంది. కొత్తగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పటికీ చాలా మంది హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ పెట్టుకోవడం లేదు. వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. జిల్లాలో టీఎస్ సిరీస్ వచ్చినప్పటి నుంచి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లను బిగిస్తున్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వీటిని బిగించుకోకుండా సాధారణ నంబర్‌ప్లేట్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి వాహనదారులపై కఠినంగా వ్యవహరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2013 డిసెంబర్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు తప్పకుండా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని.. లేని వాహనదారులకు పెద్ద ఎత్తున జరిమానాతో పాటు పలు సేవలను నిలిపివేసేందుకు ఆ శాఖ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 4వేల వాహనాలు..
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు సుమారు 4వేలకు పైగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వినియోగించలేదని అధికారులు గుర్తించారు. ఈ వాహనదారులంతా త్వరలోనే ౖహైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ నంబర్ ప్లేట్‌కు డబ్బులు చెల్లించి ఉంటారు కాబట్టి వెంటనే దీన్ని బిగించుకోవాలని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం పక్కనే ఈ నంబర్ ప్లేట్లను అమరుస్తున్నారు. అదనంగా ఎవరైనా నంబర్ ప్లేట్‌కు డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనదారులకు మెసేజ్ ద్వారా నంబర్ ప్లేట్ పెట్టుకునేలా సమాచారం అందించేందుకు సిద్ధమయ్యారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ సంస్థ నుంచి ఎస్సెమ్మెస్ అందుకున్న వాహనదారులు వారం, పది రోజుల్లో ఈ నంబర్ ప్లేట్ అమర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా వాహనాల చోరీలను సైతం అరికట్టవచ్చు. గతంలో ద్విచక్రవాహనాలతో పాటు, పెద్ద వాహనాలు సైతం చోరీకి గురయ్యేవి. వాటిని వేరే నంబర్ ప్లేట్‌తో నడుపుకునేవారు. వాహనాల దొంగలని పట్టుకోవాలంటే చాలా కాలం పట్టేది. ఈ నేపథ్యంలో వాహనాలకు రక్షణగా కొత్త ఆర్టీఏ చట్టం తీసుకొచ్చారు. వాహనాలు దొంగిలించిన వెంటనే దొరికేలా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లను అమలులోకి తీసుకొచ్చింది.
త్వరలో తనిఖీలు..
వాహనాలను ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని, హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోని వాహనాలపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించారు. యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్‌నంబర్‌కు మొదటి ఎస్సెమ్మెస్ పెడుతారు. పది రోజుల తర్వాత కూడా నంబర్‌ప్లేట్ బిగించుకోకపోతే వాహనాలు తనిఖీలు చేసి పెద్ద ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. రవాణా శాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాలు ఇంకా అందలేవని, అక్కడి నుంచి ఆదేశాలు అందిన వెంటనే తనిఖీలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు.
హైసెక్యూరిటీ ప్లేట్ వినియోగించాల్సిందే..
జిల్లాలో టీఎస్ సిరీస్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ వినియోగించాల్సిందే. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఇందుకోసం ఫీజు సైతం చెల్లిస్తారు. మళ్లీ చెల్లించే అవసరం లేదు.కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– పాపారావు, జిల్లా రవాణా శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment