మంచిర్యాల రూరల్/ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : మోటారు వాహనాలకు హై సెక్యూరిటీ విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నా ఈనెల 11 నుంచి కొత్త, ప్రస్తుత వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నంబరు ప్లేట్లు ఉన్న పాత వాహనాలకు దశలవారీగా అమర్చుకోవాలి.
డిసెంబర్ 10, 2015 వరకు జిల్లాలోని అన్ని వాహనాలకు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండాలని స్పష్టం చేసింది. జిల్లాలో ద్విచక్ర, త్రిచక్ర, లైట్, మీడియం, హెవీ వాహనాలు దాదాపు 2,49,369పైగా ఉంటాయి. ఈ వాహనాల యజమానులు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుకోవాల్సిందే. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.6.28 కోట్లకుపైగా భారం పడే అవకాశం ఉంది. వ్యాట్, ఎక్సైజ్ సుంకం కలిపితే భారగనుంది. లింక్ ఆటో టెక్నాలజీస్‌కు హైసెక్యూరిటీ నంబర్లను అందించేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించగా, ఒక్కో వాహనానికి ఒక్కో విధమైన ధరలను ఆ సంస్థ నిర్దేశించింది.
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఎందుకంటే..
పెరుగుతున్న వాహన ప్రమాదాలు, అధికమవుతున్న చోరీలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ముందు దుండగులు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చుతున్నారు. కొన్ని సందర్భాల్లో గుర్తించకుండా కాల్చేసి సాక్ష్యాలు దొరక్కుండా చేస్తున్నారు. వీటన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ హైసెక్యూరిటీ నంబర్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వీటిద్వారా కొంతవరకైనా అసాంఘిక కార్యకలాపాలను ఆపాలని సంకల్పించింది.
ఇది అదనపు భారమే..
గతంలోనే తాము నంబర్ ప్లేట్లను అమర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అంటూ అధిక ధరలకు ప్లేట్లు అమర్చుకోవడం ఆర్థికంగా ఇబ్బందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మన రాష్ట్రంలో రూ.100 ధర అధికంగా ఉంది.
- విజయ్, ద్విచక్రవాహనదారుడు, మంచిర్యాల
ప్రభుత్వమే అందించాలి..
కొత్త వాహనాలకు నూతనంగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను అమర్చాలనడం న్యాయమే. కానీ, గతంలోని వాహనాలకు కూడా సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అంటే తమకు ఆర్థికంగా అధిక భారం పడుతది. పాత వాహనాలకు ప్రభుత్వమే ప్లేట్లు బిగించే ఏర్పాటు చేయాలి.
- శ్రీను, ఆటో యజమాని, మంచిర్యాల
ధరల్లో వ్యత్యాసం ఎందుకు..
ఇతర రాష్ట్రాల్లో హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను రూ.140, రూ.150లకు అందిస్తుండగా, అదే కాంట్రాక్టరుకు ఆంధ్రప్రదేశ్‌లో రూ.240కి పైగా ధరను చెల్లించడం ఎందుకు. ఇది ప్రజలపై అధిక భారం వేయడమే. ప్రభుత్వమే తక్కువ ధరల్లో ఉండేలా చేయడమో, ధర తగ్గించడమో చేయాల్సిందే.
- అశోక్, కారు యజమాని, ఆదిలాబాద్