vehicle registration plates
-
ఆలస్యంగా ఆర్టీఏ కేంద్రానికి వెళ్లారా..!!
సాక్షి,సిటీబ్యూరో: బండి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) పొందలేకపోయారా..! ఆలస్యంగా ఆర్టీఏ కేంద్రానికి వెళ్లారా..!! అయితే మీరు అప్పటికే చెల్లించిన ఫీజుతో పాటు మరింత సమర్పించుకోవాల్సిందే. లేదంటే హెచ్ఎస్ఆర్పీ పైన ఆశలు వదులుకోవాల్సిందే. నగరంలోని పలు ఆర్టీఏ కేంద్రాల్లో కొనసాగుతున్న దందా ఇది. వాహనదారుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు హెచ్ఎస్ఆర్పీ కేంద్రాల నిర్వాహకులు, పలుచోట్ల ఏజెంట్లు కలిసి దందాకు తెర లేపారు. ఒక్కో నంబర్ ప్లేట్‌పై రూ.500 నుంచి రూ.1000 వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల సకాలంలో నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయిన వాహనదారులను ఈ దందాలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాహనాలు రిజిస్ట్రేషన్ అయిన తరవాత ఆలస్యంగా వెళ్లే వారికి నంబర్ ప్లేట్ కనిపించడం లేదని, తర్వాత రావాలని చెబుతారు. అలా ఒకటి, రెండుసార్లు తిరిగి వెళ్లిన వాహనదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసి నంబర్ ప్లేట్ బిగించి ఇస్తున్నారు. ఆర్టీఏ సమన్వయం లేక.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల నిర్వహణలో మొదటి నుంచి స్పష్టత లేకుండా పోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో హెచ్ఎస్ఆర్పీ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ హెచ్ఎస్ఆర్పీ అమలుపై ఆర్టీఏ పర్యవేక్షణ కొరవడింది. నిర్వహణ సంస్థ అయిన లింక్ ఆటోటెక్, ఆర్టీఏ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మొదటి నుంచి ఈ పథకం అమలులో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదైన వాహనాలకు, హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటు చేసుకున్న వాటికి మధ్య పొంతన లేకుండా పోయింది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు 1500 నుంచి 2000 వాహనాలు కొత్తగా నమోదైతే మొదట్లో కనీసం 200 వాహనాలకు కూడా ఈ నంబర్ ప్లేట్లను బిగించలేకపోయారు. దీంతో వాహనదారులు నెలల తరబడి పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడేవారు. వాహనాల రిజిస్ట్రేషన్లలో జాప్యం, సకాలంలో స్మార్ట్ కార్డులు వినియోగదారుల చేతికి అందకపోవడం ఒకవైపు.. మరోవైపు వాహనదారుల డిమాండ్ మేరకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను (హెచ్ఎస్ఆర్పీ) తయారు చేసి వాహనాలకు బిగించడంలోనూ సంబంధిత లింక్ ఆటోటెక్ సంస్థ విఫలమైంది. గ్రేటర్లో గడిచిన ఐదేళ్లలో కొత్తగా నమోదైన సుమారు 15 లక్షల వాహనాల్లో సుమారు 9 లక్షల వాహనాలకు మాత్రమే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించారు. మరో 6 లక్షలకు పైగా వాహనాలు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. జాప్యం కారణంగా చాలామంది వాహనదారులు హెచ్ఎస్ఆర్పీ పట్ల వెనుకంజ వేస్తున్నారు. ఇలా పెండింగ్‌లో ఉన్న వాహనాలపైనే బేరసారాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ధరలకు అక్రమార్జన చెర హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో ద్విచక్ర వాహనాలకు రూ.245, ఆటోలకు రూ.282, కార్లు, ఇతర తేలికపాటి వాహనాలకు రూ.619, భారీ వాహనాలకు రూ.649 చొప్పున ఫీజు నిర్ణయించారు. వాహనదారులు తమ వాహనం రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఫీజును కూడా చెల్లిస్తారు. నంబర్ ప్లేట్ బిగించే తేదీ, సమయం ఎస్సెమ్మెస్ ద్వారా వాహనదారుడికి చేరుతుంది. కానీ ఆ సమయంలో వెళ్లితే నంబర్ ప్లేట్లు ఉండవు. ఒకటికి నాలుగు సార్లు తిరిగితే తప్ప హెచ్ఎస్ఆర్పీ పూర్తి కాదు. ఈ క్రమంలోనే నంబర్ప్లేట్ల వద్ద నిర్వాహకులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.500 వరకు, కార్లు, ఇతర వాహనాలకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
ఇకపై హై సెక్యూరిటీ
మంచిర్యాల రూరల్/ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : మోటారు వాహనాలకు హై సెక్యూరిటీ విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నా ఈనెల 11 నుంచి కొత్త, ప్రస్తుత వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నంబరు ప్లేట్లు ఉన్న పాత వాహనాలకు దశలవారీగా అమర్చుకోవాలి. డిసెంబర్ 10, 2015 వరకు జిల్లాలోని అన్ని వాహనాలకు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండాలని స్పష్టం చేసింది. జిల్లాలో ద్విచక్ర, త్రిచక్ర, లైట్, మీడియం, హెవీ వాహనాలు దాదాపు 2,49,369పైగా ఉంటాయి. ఈ వాహనాల యజమానులు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుకోవాల్సిందే. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.6.28 కోట్లకుపైగా భారం పడే అవకాశం ఉంది. వ్యాట్, ఎక్సైజ్ సుంకం కలిపితే భారగనుంది. లింక్ ఆటో టెక్నాలజీస్‌కు హైసెక్యూరిటీ నంబర్లను అందించేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించగా, ఒక్కో వాహనానికి ఒక్కో విధమైన ధరలను ఆ సంస్థ నిర్దేశించింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఎందుకంటే.. పెరుగుతున్న వాహన ప్రమాదాలు, అధికమవుతున్న చోరీలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ముందు దుండగులు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చుతున్నారు. కొన్ని సందర్భాల్లో గుర్తించకుండా కాల్చేసి సాక్ష్యాలు దొరక్కుండా చేస్తున్నారు. వీటన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ హైసెక్యూరిటీ నంబర్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వీటిద్వారా కొంతవరకైనా అసాంఘిక కార్యకలాపాలను ఆపాలని సంకల్పించింది. ఇది అదనపు భారమే.. గతంలోనే తాము నంబర్ ప్లేట్లను అమర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అంటూ అధిక ధరలకు ప్లేట్లు అమర్చుకోవడం ఆర్థికంగా ఇబ్బందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మన రాష్ట్రంలో రూ.100 ధర అధికంగా ఉంది. - విజయ్, ద్విచక్రవాహనదారుడు, మంచిర్యాల ప్రభుత్వమే అందించాలి.. కొత్త వాహనాలకు నూతనంగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను అమర్చాలనడం న్యాయమే. కానీ, గతంలోని వాహనాలకు కూడా సెక్యూరిటీ నంబరు ప్లేట్లు అంటే తమకు ఆర్థికంగా అధిక భారం పడుతది. పాత వాహనాలకు ప్రభుత్వమే ప్లేట్లు బిగించే ఏర్పాటు చేయాలి. - శ్రీను, ఆటో యజమాని, మంచిర్యాల ధరల్లో వ్యత్యాసం ఎందుకు.. ఇతర రాష్ట్రాల్లో హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను రూ.140, రూ.150లకు అందిస్తుండగా, అదే కాంట్రాక్టరుకు ఆంధ్రప్రదేశ్‌లో రూ.240కి పైగా ధరను చెల్లించడం ఎందుకు. ఇది ప్రజలపై అధిక భారం వేయడమే. ప్రభుత్వమే తక్కువ ధరల్లో ఉండేలా చేయడమో, ధర తగ్గించడమో చేయాల్సిందే. - అశోక్, కారు యజమాని, ఆదిలాబాద్