సాక్షి,సిటీబ్యూరో: బండి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) పొందలేకపోయారా..! ఆలస్యంగా ఆర్టీఏ కేంద్రానికి వెళ్లారా..!! అయితే మీరు అప్పటికే చెల్లించిన ఫీజుతో పాటు మరింత సమర్పించుకోవాల్సిందే. లేదంటే హెచ్‌ఎస్‌ఆర్‌పీ పైన ఆశలు వదులుకోవాల్సిందే. నగరంలోని పలు ఆర్టీఏ కేంద్రాల్లో కొనసాగుతున్న దందా ఇది. వాహనదారుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ కేంద్రాల నిర్వాహకులు, పలుచోట్ల ఏజెంట్లు కలిసి దందాకు తెర లేపారు. ఒక్కో నంబర్ ప్లేట్‌పై రూ.500 నుంచి రూ.1000 వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల సకాలంలో నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయిన వాహనదారులను ఈ దందాలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాహనాలు రిజిస్ట్రేషన్ అయిన తరవాత ఆలస్యంగా వెళ్లే వారికి నంబర్ ప్లేట్ కనిపించడం లేదని, తర్వాత రావాలని చెబుతారు. అలా ఒకటి, రెండుసార్లు తిరిగి వెళ్లిన వాహనదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసి నంబర్ ప్లేట్ బిగించి ఇస్తున్నారు.
ఆర్టీఏ సమన్వయం లేక..
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల నిర్వహణలో మొదటి నుంచి స్పష్టత లేకుండా పోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమలుపై ఆర్టీఏ పర్యవేక్షణ కొరవడింది. నిర్వహణ సంస్థ అయిన లింక్ ఆటోటెక్, ఆర్టీఏ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మొదటి నుంచి ఈ పథకం అమలులో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదైన వాహనాలకు, హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఏర్పాటు చేసుకున్న వాటికి మధ్య పొంతన లేకుండా పోయింది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు 1500 నుంచి 2000 వాహనాలు కొత్తగా నమోదైతే మొదట్లో కనీసం 200 వాహనాలకు కూడా ఈ నంబర్ ప్లేట్లను బిగించలేకపోయారు.
దీంతో వాహనదారులు నెలల తరబడి పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడేవారు. వాహనాల రిజిస్ట్రేషన్లలో జాప్యం, సకాలంలో స్మార్ట్ కార్డులు వినియోగదారుల చేతికి అందకపోవడం ఒకవైపు.. మరోవైపు వాహనదారుల డిమాండ్ మేరకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తయారు చేసి వాహనాలకు బిగించడంలోనూ సంబంధిత లింక్ ఆటోటెక్ సంస్థ విఫలమైంది. గ్రేటర్‌లో గడిచిన ఐదేళ్లలో కొత్తగా నమోదైన సుమారు 15 లక్షల వాహనాల్లో సుమారు 9 లక్షల వాహనాలకు మాత్రమే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించారు. మరో 6 లక్షలకు పైగా వాహనాలు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. జాప్యం కారణంగా చాలామంది వాహనదారులు హెచ్‌ఎస్‌ఆర్‌పీ పట్ల వెనుకంజ వేస్తున్నారు. ఇలా పెండింగ్‌లో ఉన్న వాహనాలపైనే బేరసారాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ధరలకు అక్రమార్జన చెర
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో ద్విచక్ర వాహనాలకు రూ.245, ఆటోలకు రూ.282, కార్లు, ఇతర తేలికపాటి వాహనాలకు రూ.619, భారీ వాహనాలకు రూ.649 చొప్పున ఫీజు నిర్ణయించారు. వాహనదారులు తమ వాహనం రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఫీజును కూడా చెల్లిస్తారు. నంబర్ ప్లేట్ బిగించే తేదీ, సమయం ఎస్సెమ్మెస్ ద్వారా వాహనదారుడికి చేరుతుంది. కానీ ఆ సమయంలో వెళ్లితే నంబర్ ప్లేట్లు ఉండవు. ఒకటికి నాలుగు సార్లు తిరిగితే తప్ప హెచ్‌ఎస్‌ఆర్‌పీ పూర్తి కాదు. ఈ క్రమంలోనే నంబర్‌ప్లేట్ల వద్ద నిర్వాహకులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.500 వరకు, కార్లు, ఇతర వాహనాలకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment