సాక్షి, హైదరాబాద్: తరచూ బదిలీలతో వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్న వారి వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ సిరీస్ అమలులో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అమలులోకి తీసుకురాగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు నిరాకరిస్తోంది. కేంద్ర నిర్ణయంలోని కొన్ని అంశాలపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు పెండింగులో ఉండటంతో.. ఎంతో ఉపయుక్తంగా ఉండాల్సిన భారత్ సిరీస్ రాష్ట్రంలో అసలు అమలులోకే రాకపోవటం ఇబ్బందిగా మారింది. అర్హతలుండీ ఎంతో మంది వాహనదారులు ఈ అవకా శాన్ని వినియోగించుకోలేక పోతున్నారు.
అసలు భారత్ సిరీస్ అంటే?
దేశవ్యాప్తంగా తరచూ బదిలీ అయి వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన వాళ్లు వారి వెంట ఆయా వాహనాలను తీసుకెళ్లినప్పుడు రిజి స్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఏడాది పాటు పాత నంబర్ ప్లేట్‌తోనే ఉండే వీలున్నప్పటికీ, తర్వాత ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంటుంది. లేని పక్షంలో అక్కడి రవాణా చట్టాల ప్రకారం పెనా ల్టీలు చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో అలాంటి వారికి ఇబ్బంది లేకుండా, దేశవ్యాప్తంగా కామన్‌గా వినియోగించుకునేలా కేంద్ర రవాణాశాఖ భారత్ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో తెలంగాణ టీఎస్ బదులు భారత్ సిరీస్‌గా బీహెచ్ అన్న అక్షరా లుంటాయి. ముందు సంవత్సరం, తర్వాత బీహెచ్ అక్షరాలు ఆ తర్వాత 4 అంకెలు రెండు ఆంగ్ల అక్షరాలుంటాయి. ఉదా: 22బీహెచ్ 1234ఏబీ.
ఇక్కడే అభ్యంతరం..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, డిఫెన్స్ ఉద్యోగులు, కనీసం నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఈ సీరీస్ తీసుకునేందుకు అర్హులు. కొత్త వాహనం కొన్నప్పుడు డీలర్‌కు తగిన డాక్యుమెంట్లు అందించటం ద్వారా ఈ నంబర్ సీరీస్ తీసుకోవచ్చు. కారు కొన్నప్పుడు 15 ఏళ్లకు లైఫ్ ట్యాక్సు చెల్లిస్తుంటారు.
ఆ కారు ధర ఆధారంగా.. రూ.5 లక్షల లోపు విలువ ఉన్నవాటికి 3%, రూ.5 – 10 లక్షల మధ్య ఉన్నవాటికి 14%, రూ.10 లక్షలు– రూ.20 లక్షల మధ్య ఉన్న వాటికి 17%, రూ.20 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాటికి 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డీజిల్ కారు అయితే దానికి 2% ఎక్కువగా, బ్యాటరీ కారు అయితే దానికి 2% తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అదే భారత్ సిరీస్ తీసుకుంటే, ఒకేసారి ఆ రోడ్ ట్యాక్స్ మొత్తం చెల్లించకుండా, ఆ మొత్తాన్ని రెండేళ్ల చొప్పున భాగాలుగా చేసి చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే పన్ను మొత్తాన్ని రాష్ట్రాలు విధిస్తున్న దానితో సంబంధం లేకుండా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ధారించింది. రూ.10 లక్షల లోపు విలువ ఉన్న కారుకు 8 శాతం, రూ.10 లక్షలు– రూ.20 లక్షల మధ్య విలువ ఉన్న కారుకు 10 శాతం, రూ.20 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్న కారుకు 12% గా నిర్ధారించింది. రాష్ట్రాల అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా ఇలా పన్నుల మొత్తాన్ని కేంద్రం నిర్ధారించింది. ఇవి తెలంగాణలో విధిస్తున్న పన్నుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభు త్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని అధికారులు చెబుతున్నారు.
పన్ను చెల్లింపు ఎలా
ఈ సమస్యపై కేంద్ర–రాష్ట్రప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చి పరిష్కారం దిశగా ప్రయత్నం ప్రారంభించలేదు. దీంతో భారత్ సిరీస్‌కి తెలంగాణలో ఇప్పటికీ శ్రీకారం చుట్టలేదు. ఆ సిరీస్ తీసుకున్న ఇతర ప్రాంతాల వారు జనవరి నుంచి రెండో విడత పన్ను చెల్లించాల్సి ఉంది. బదిలీ పై రాష్ట్రానికి వచ్చిన ఆ సిరీస్ ఉన్నవారు ఇక్కడ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగా ఈ సిరీస్‌కు ఆమోదం లేనందున పన్ను చెల్లింపు ఎలా అన్న సమస్య ఉత్పన్నమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment