- తొలుత కొత్త వాహనాలకు ఏర్పాటు
- తరువాత పాత వాహనాలకు తప్పనిసరి
- నంబర్ ప్లేట్ మార్పిడికి చెక్
సాక్షి, విజయవాడ : వాహనాలకు న్యూ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌పీ)ను ఉపయోగించాలనే నిబంధన త్వరలో అమలు చేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కొత్తగా కొనబోయే వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయిస్తారు. ఆ తరువాత కొన్ని నెలల వ్యవధిలో మిగిలిన అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చి ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబరు పేట్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటారు.
2015 డిసెంబర్ 10లోగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నంబర్ ప్లేట్లు తయారు చే సి విక్రయించేందుకు న్యూ ఢిల్లీకి చెందిన మెస్సర్స్ లింక్ ఆటో టెక్నాలజీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ నంబర్ ప్లేట్ల వల్ల ఉపయోగాలివీ...
ప్రస్తుతం ఉన్న నంబర్ ప్లేట్లను వాహన వినియోగదారులు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల నేరాలకు పాల్పడేవారు నంబర్ ప్లేట్లు తీసివేయడం, మార్చివేయడం చేస్తున్నారు. హై సెక్యూరిటీ ప్లేట్లను ఒక్కసారి వాహనానికి బిగిస్తే తరువాత మార్చడం కష్టం.
వాహనానికి చాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ ఉన్నట్లే 14 డిజిట్‌ల బార్ కోడ్ ఉంటుంది. దీని సహాయంతో వాహనానికి ఉపయోగించే నంబర్ ప్లేట్ ఆ వాహనానికి చెందినదా? కాదా? అని అధికారులు సులభంగా తెలుసుకోవచ్చు.
దొంగలు వాహనాన్ని చోరీ చేసిన తరువాత నంబర్ ప్లేట్లు మార్చుకునే వీలుండదు.
హై సెక్యూరిటీ ప్లేట్లను బయట ఎక్కడ పడితే అక్కడ విక్రయించడానికి వీలులేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన లింగ్ ఆటో టెక్నాలజీ సంస్థ నుంచే తీసుకోవాలి. ఈ సంస్థ కార్యాలయం నిర్వహించడానికి రవాణా శాఖ కార్యాలయాల్లోనే స్థలం కేటాయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం సూచించిన సంస్థ కాకుండా బయట ప్రైవేటు సంస్థలు తయారు చేసే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తీసుకున్నట్లు తెలిస్తే వాహన యజమానిపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు.
రవాణాశాఖ కేటాయించిన నంబర్‌ను తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేసి ఫ్యాన్సీగా ప్లేట్ తయారు చేయించి ఉపయోగిస్తూ ఉంటారు. హై సెక్యూరిటీ ప్లేట్‌ను అలా మార్చడానికి కుదరదు.
దూరం నుంచి చూసినా, అర్ధరాత్రి వేళల్లోనూ, దీపం వెలుగులో చూసినా స్పష్టంగా కనపడేవిధంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లను రూపొందించారు. దీనివల్ల రాత్రివేళల్లో ప్రమాదాలకు గురిచేసి వెళ్లిపోయే వాహనాల నంబర్లు సులభంగా గుర్తించే అవకాశముంటుంది.
ఆగస్టు నుంచి కొత్త ప్లేట్ల పంపిణీ...
విజయవాడ బందరు రోడ్డులోని రవాణా శాఖ కార్యాలయంలో కొత్త నంబర్ ప్లేట్లు తయారు చేసే మిషనరీని మెస్సర్స్ లింక్ ఆటో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషనరీ ఏర్పాట్లు పూర్తికాగానే ఆగస్టు నుంచి కొత్త ప్లేట్లు ఇచ్చే అవకాశం ఉంది.
నంబర్ ప్లేట్ల రేట్లు ఇలా...
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల రేట్లను ప్రభుత్వమే నిర్ణయించింది. జిల్లాలో ఒకే సంస్థ ఈ నంబర్ ప్లేట్లు జారీ చేస్తున్నందున వాహనయజమానుల నుంచి ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. కొత్త నంబర్ ప్లేట్ల రేట్లు ఈ కింది విధంగా ఉంటాయి.
ద్విచక్ర వాహనాల ప్లేట్ తయారీ,ఫిక్సింగ్, లాకింగ్‌కు - రూ.208.00
మూడు చక్రల వాహనాలకు మూడు ప్లేట్ల ఫిక్సింగ్, లాకింగ్‌కు - రూ.239.20
కార్లు, వ్యాన్లు, పాసింజర్, గూడ్స్ వాహనాలకు - రూ.525.20
కమర్షియల్ వాహనాలు, భారీ వాహనాలకు - రూ.551.20