రాష్ట్ర ఖజానాకు బాబు ‘విమానం మోత’ | The state treasury Launches 'plane crash' | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఖజానాకు బాబు ‘విమానం మోత’

Published Tue, Feb 17 2015 1:57 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

రాష్ట్ర ఖజానాకు బాబు ‘విమానం మోత’ - Sakshi

రాష్ట్ర ఖజానాకు బాబు ‘విమానం మోత’

  • చంద్రబాబు విమానయాన ఖర్చు రూ. 16 కోట్లు
  • బాబుగారు ఊరు దాటాలంటే ప్రత్యేక విమానం సిద్ధం కావాల్సిందే
  • సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఖర్చులు తగ్గించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక ఇబ్బందులున్నాయని తరచూ చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిందేమిటో తెలుసా! ఆయన ఎక్కడికి వెళ్లినా కోట్టు ఖర్చు పెడుతూ ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణించడం!! హైదరాబాద్ నుంచి ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు రెగ్యులర్‌గా నడిచే విమానాలున్నప్పటికీ.. అవి కాదని ఆయన ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణించారు. ఒకసారికాదు రెండుసార్లు కాదు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు  67 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఇందుకని రాష్ట్ర ఖజానాపై పడిన భారం మొత్తం.. రూ.16 కోట్లు. గుంటూరులో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక విమానంలోనే హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
     
    నిధుల విడుదలకు ఆర్థికశాఖ ఆదేశం...

    ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశ రాజధాని న్యూఢిల్లీకి మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలంటే రెగ్యులర్ విమానాల్లోనే ప్రయాణిస్తారు. కానీ బాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ   రికార్డు సృష్టించారు. ఢిల్లీకి చెందిన క్లబ్-1 ప్రత్యేక విమానంలో చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. విమాన చార్జీల కింద అధికారికంగా  అర కోటి  చెల్లించారు. చంద్రబాబు ఎక్కువగా నవయుగ, కృష్ణపట్నం, జీవీకే, జీఎంఆర్ సంస్థలకు చెందిన తొమ్మిది, పదిహేను సీటర్ల  విమానాలను వినియోగిస్తున్నారు. వాటి చార్జీల కింద రూ.16 కోట్లు ఖర్చు అయినట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. దీనికిబడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో అదనపు కేటాయింపుకోసం ఆర్థికశాఖను ప్రభుత్వం కోరింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. నేడో రేపో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేయనున్నారు.
     
    నెలకు రూ. 2 కోట్లు చొప్పున...

    సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు పూర్తయింది. ఈ లెక్కన బాబు నెలకు రూ.రెండు కోట్లను  ప్రత్యేక విమానాల చార్జీలకు ఖర్చు చేశారన్నమాట. ఇప్పటివరకు సీఎం 8 సార్లు ఢిల్లీ పర్యటనకు  ప్రత్యేక విమానాల్లోనే వెళ్లొచ్చారు.
         
    ఇటీవల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు మూడు ప్రత్యేక విమానాలను వినియోగించారు. నవయుగకు చెందిన విమానంలో చంద్రబాబు, ఆయన పేషీ అధికారులు వెళ్లారు. పోలవరం కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ సమకూర్చిన ప్రత్యేక విమానంలో పారిశ్రామికవేత్తలు వెళ్లగా.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సమకూర్చిన మరో విమానంలో అధికారులు  వెళ్లారు.
         
    జన్మభూమి, రైతు సాధికారిత సదస్సులతో పాటు  జిల్లాల పర్యటనలకు కూడా సీఎం ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు.

    ‘పొదుపు’ పాఠం.. వారికే...

    రాజధాని కోసం ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తూ మరోపక్క రూ.కోట్లను ప్రత్యేక విమానాలకు వెచ్చించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మంత్రులు, అధికారులు పొదుపు చర్యలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. స్వయంగా ముఖ్యమంత్రే ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అవసరం లేకపోయినా ప్రత్యేక విమానాల్లో విహరించడం పట్ల ఉన్నతస్థాయి అధికారవర్గాలూ ముక్కున వేలేసుకుంటున్నాయి.
     
    చంద్రబాబు ఏ నెలలో ఎక్కడెక్కడికి వెళ్లొచ్చారంటే...
    జూన్:  విజయవాడ, విశాఖపట్నం
    జూలై:  విజయవాడ, తిరుపతి, పుట్టపర్తి, విజయవాడ, విశాఖపట్నం
    ఆగస్టు: విజయవాడ, విశాఖ, రాజమండ్రి
    సెప్టెంబర్: విజయవాడ, తిరుపతి, విశాఖ, రాయపూర్, తిరుపతి, విజయవాడ
    అక్టోబర్: విజయవాడ, రాజమండ్రి, పుట్టపర్తి, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం-హైదరాబాద్, విజయవాడ-రాజమండ్రి, ముంబై
    నవంబర్:  విజయవాడ, బెంగళూరు, తిరుపతి, న్యూఢిల్లీ, తిరుపతి, న్యూఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, సింగపూర్, విజయవాడ, న్యూఢిల్లీ, అహ్మదాబాద్
    డిసెంబర్: రాజమండ్రి, విశాఖపట్నం, న్యూఢిల్లీ, తిరుపతి-చిత్తూరు, విజయవాడ-తిరుపతి, విశాఖపట్నం, విశాఖపట్నం, విజయవాడ, విజయవాడ, అహ్మదాబాద్, న్యూఢిల్లీ
    జనవరి: విజయవాడ, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, విశాఖపట్నం-తిరుపతి-న్యూఢిల్లీ, విశాఖపట్నం, రాజమండ్రి-విజయవాడ, విజయవాడ
    ఫిబ్రవరి (8 వరకు): విజయవాడ, న్యూఢిల్లీ, న్యూఢిల్లీ
    బాబు ప్రయాణించిన  విమానాలు వీరివే:  క్లబ్ -1, నవయుగ, జీవీకే, కృష్ణపట్నం,జీఎంఆర్ సంస్థలకు చెందినవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement