హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానం అమలు
హైదరాబాద్ : రాష్ట్రంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. మొదటగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్నాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఇక తప్పని సరికానుంది.
నెల రోజుల్లోపు మిగతా జిల్లాల్లోని 123 రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో కూడా ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా కొత్త వాహనాలకు ఏర్పాటు చేసి.. తరువాత 90 రోజుల్లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 30 లక్షల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు.
కాగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానాన్ని కొద్ది రోజులు వాయిదా వేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర విభజన జరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలపై రెండుసార్లు అదనపు భారం వేయటం సరికాదని అన్నారు.