చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో పేరుకుపోయిన హై సెక్యూరిటీ నంబర్‌ప్లేట్లు
‘ప్లేటు’ ఫిరాయింపు
Published Sun, Oct 30 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM
‘హై సెక్యూరిటీ నంబర్‌ప్లేట్ల’పై అయిష్టత!
నాణ్యతాలోపంతో ముందుకురాని ప్రజలు
కొత్త నిబంధనలతో మరింత బేజారు
రవాణాశాఖ కార్యాలయంలోనే పేరుకుపోయి తుప్పుపడుతున్న వైనం
చిత్తూరు (అర్బన్): హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు.. వినడానికి బాగానే ఉన్నా ఇవి ప్రజలకు పెద్దగా నచ్చడం లేదు. దీంతో వాహనాలకు వేయిచాల్సిన నంబరు ప్లేట్లు వందల సంఖ్యలో ఓ మూలనపడేశారు. జిలా రవాణాశాఖ కార్యాలయంలోనే అవి తుప్పుపడుతున్నాయి.
ఇదీ లక్ష్యం..
రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, దోపిడీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులు పారిపోయే సమయంలో వాహనాలకున్న నంబర్ల ఆధారంగానే వాటిని పట్టుకోవడం సాధ్యమవుతుంది. అయితే వాహనచోదకులు నంబర్ ప్లేట్‌పై అక్షరాలను పద్ధతి లేకుండా రాయించుకుంటున్నారు. 2013 నవంబర్ నుంచి రాష్ట్రంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వీటిని తప్పనిసరిగా మోటారు వాహనాలకు వేసుకోవాలి. దీంతో జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు మోటారు వాహన తనిఖీ అధికారి యూనిట్ కార్యాలయ వద్ద సైతం హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ అమర్చే కార్యాలయాలను అందుబాటులో ఉంచారు.
జిల్లాలో ఇలా..
చిత్తూరు, పలమనేరు, పీలేరు, మదనపల్లె ప్రాంతాల్లో రోజుకు సగటున 80 వా హనాలు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. తిరుపతి ఆర్‌టీఏ పరిధిలోని తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తిల్లో ఈ సంఖ్య వంద దాటుతోంది. హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించడానికి ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లకు రూ.245, ఆటోలు, మూడు చక్రాల వాహనాలకు రూ.282, లైట్ మో టారు వాహనాలకు రూ.691, భారీ వాహనాలకు రూ.649 చొప్పున రవాణాశాఖ కార్యాలయాల్లోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తయిన రెండు రోజుల్లో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్టను ఎక్కడయితే వాహన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అక్కడకు వెళ్లి బిగించుకోవాలి. కొన్ని చోట్ల 20 రోజులవుతున్నా హెచ్‌ఎస్‌ఆర్‌పీ రావడంలేదు. దీనికితోడు మామూలు నంబరు ప్లేటు వేయించుకోవాలంటే రూ.వంద చెల్లిస్తే సరిపోతుంది. ఇది విరిగిపోతే మార్చుకోవడం కూడా సులభమే. కానీ హెచ్‌ఎస్‌ఆర్‌పీ నాణ్యత డొల్లగా మారింది. చిన్న పిల్లలు దీన్ని వంచితే వంగిపోతున్నాయి. ఇక ప్రమాదాల్లో దె బ్బతిన్న హెచ్‌ఎస్‌ఆర్‌పీలను మార్చడం కోసం ఒక్కోసారి వాహనానికే రంద్రం వేయాల్సి రావడం ఇబ్బందికరంగా మా రుతోంది. తాజాగా వాహన రిజిస్ట్రేషన్లు ఆర్‌టీఏ కార్యాలయాల్లో చేయడంలేదు. ఆయా డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. వీటికి హెచ్‌ఎస్‌ఆర్‌పీ వేసుకోవడం మరింత భారంగా మారనుంది. డీలర్ల వద్ద వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నా.. నంబర్‌ప్లేట్ల కోసం మళ్లీ ఆర్‌టీఏ కార్యాలయాలకు పరుగులు తీయాల్సిన రావడంతో వాహన చోదకులు అనాసక్తి చూపుతున్నారు.
రీప్లేస్ చేస్తున్నాం
మా వద్ద చాలావరకు ఆటోలు, ట్రాక్టర్లు, లారీల నంబర్ ప్లేట్లు నిలిచిపోతున్నాయి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్లిపోతే మళ్లీ వాహనాన్ని తీసుకురావడానికి ఓనర్లు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. కస్టమర్ కేర్ నుంచి చెప్పించి హెచ్‌స్‌ఆర్‌పీ వేసుకోమని చెబుతున్నాం. ఆర్‌టీఏ వాళ్లు కూడా కాస్త పట్టించుకుని అవగాహన కల్పించాలి. ఇక గతంలో వచ్చిన ప్లేట్లలో కొన్ని నాణ్యత లేనట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని తీసుకొచ్చి మాకిస్తే ఇప్పుడు దృఢంగా ఉన్న వాటిని ఉచితంగా వేసి పంపుతున్నాం.
–ప్రసాద్, హెచ్‌ఎస్‌ఆర్‌పీ జిల్లా పర్యవేక్షకులు
Advertisement
Advertisement