హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి
* 11వ తేదీ నుంచి కొత్త వాహనాలకు అమలు
* 2015 డిసెంబరు 10 నాటికి అన్ని వాహనాలకు తప్పనిసరి
* ‘లింక్‌ఆటో టెక్నాలజీస్’కు కాంట్రాక్టు.. నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కొత్త వాహనాలకు కొత్త హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చడం ఈ నెల 11 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. పాత వాహనాలకు కూడా దశలవారిగా హై సెక్యూరిటీ నంబరుప్లేట్లు అమర్చుకోవాలని, 2015 డిసెంబరు 10 నాటికి రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబరుప్లేట్లు ఉండాలని స్పష్టం చేసింది.
ఉత్సవ్ సేఫ్టీ సిస్టమ్, లింక్‌ఆటో టెక్నాలజీస్‌ల కన్సార్షియంకు ఈ కాంట్రాక్టు దక్కింది. ద్విచ క్ర వాహనాలకు రూ.208, త్రిచక్ర వాహనాలకు రూ.239.20, లైట్‌మోటార్ వాహనాలకు రూ.525.20, మీడియం, హెవీ వాహనాలు, వాణిజ్య, ట్రెయిలర్లకు రూ 551.20 వంతున నంబరు ప్లేట్ల ఏర్పాటుకు వ సూలు చేయనున్నారు. రీప్లేస్‌మెంట్‌కు అన్ని రకాల వాహనాలకు రూ.240 చార్జీ చేస్తారు. ఈ ధరలకు ఎక్సైజ్ సుంకం, వ్యాట్ అదనం.
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు అదనపు గడువు తీసుకున్న రాష్ట్ర సర్కారు ఇకమీదట గడువు పొడిగింపు సాధ్యంకాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో హడావుడి కొత్త నెంబరుప్లేట్ల విధానాన్ని అమలుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెండర్‌లో తక్కువ ధర కోట్ చేసినప్పటికీ కాంట్రాక్ట్ పొందిన సంస్థ వసూలు చేసే మొత్తాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీగానే ఉండటం గమనార్హం. ఇదే కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్‌లో రూ. 140, పశ్చిమబెంగాల్‌లో రూ. 150, మిగతా రాష్ట్రాల్లోనూ దాదాపు అదే ధరకు నంబర్‌ప్లేట్లు సరఫరా చేస్తున్నారు.