వాహన యజమానులకు ఊరట లభించనుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పుకు సిద్ధమవుతోంది.
రవాణాలో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం
జూలై నుంచి అమలుకు ప్రయత్నాలు
తాత్కాలిక రిజిస్ట్రేషన్ల రద్దు
వాహన యజమానులకు ఊరట
మర్రిపాలెం : వాహన యజమానులకు ఊరట లభించనుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పుకు సిద్ధమవుతోంది. కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్ల రద్దు నిర్ణ యం త్వరలో ప్రకటించనుంది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలులోకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాహనం కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం యజమానులు బోలెడంత ప్రయాసపడతారు. రద్దీ రోజులు, శుభ దినాలలో కౌంటర్‌ల వద్ద కిక్కిరిసిపోతారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటారు.
ఇదే అదునుగా భావిస్తోన్న బ్రోకర్లు జేబులు నింపుకుంటున్నారు. వాహన షోరూమ్ యాజమాన్యాలతో కుమ్మక్కై వాహన యజమానుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. బ్రోకర్ల ప్రమేయం లేకుండా వాహన యజమాని రిజిస్ట్రేషన్ చేసుకునేలా రవాణా శాఖ సిద్ధపడింది. యజమాని రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ జరుపుకోవడానికి చొరవ చూపనుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా...!
వివిధ కంపెనీల షోరూమ్‌లకు వచ్చే స్టాక్‌ను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరిశీలిస్తారు. ప్రతీ వాహనం ఇంజన్, చాసిక్ నంబర్లు నమోదు చేసుకుంటారు. వాహనాల వివరాలు రవాణా కార్యాలయంలో పొందుపరుస్తారు. వాహనం కొనుగోలు సమయంలో యజమాని చిరునామా, గుర్తింపు, ఆధార్ పత్రాలు షోరూమ్‌లో స్వీకరిస్తారు. యజమాని సంతకం కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తారు. తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ను అదే రోజు అందచేస్తారు.
షోరూమ్‌లలో వాహనాల అమ్మకాలను బట్టి ప్రతీ రోజు ఫైళ్లను రవాణా కార్యాలయానికి చేరవేస్తారు. యజమాని వివరాలు, పత్రాలు సరిపోల్చి రిజిస్ట్రేషన్ కార్డును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఒకవేళ యజమాని పేరుతో మరో వాహన ఉన్నట్టుగా తేలితే అదనంగా టాక్స్ చెల్లించాలి. అటువంటి సమాచారం షోరూమ్‌కు అక్కడి నుంచి వాహన యజమానికి తెలియజేస్తారు.
యజమానులకు ఊరట...
షోరూమ్‌లలో శాశ్వత రిజిస్ట్రేషన్ జరపడంతో యజమానులు సేద తీరుతారు. బ్రోకర్ల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రవాణా శాఖ తెలియజేసిన ధరలు షోరూమ్‌లలో చెల్లించడంతో లాభపడతారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌ల బాధ్యతలు షోరూమ్‌లకు అప్పగించడంతో యజమానులు రవాణా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఇకపై ఉండబోదు.
యధావిధిగా ఫ్యాన్సీ నంబర్‌ల కేటాయింపు...!
రిజిస్ట్రేషన్‌కు ముందుగా వాహనం యజమాని ఫ్యాన్సీ నంబర్‌లు బుకింగ్ జరుపుకోవచ్చు. రవాణా శాఖ నిర్ధేశించిన నంబర్లకు డీడీ చెల్లించి పొందవచ్చు. ఆన్‌లైన్‌లో నంబర్ వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. షోరూమ్‌లో వాహనం కొనుగోలు సమయంలో రిజర్వేషన్ కేటగిరీలో నంబర్ ఫీడింగ్‌తో రిజిస్ట్రేషన్ అవుతుంది. సాధారణ నంబర్ పొందగోరు వారికి సీరియల్ ప్రకారం ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు.