రిజిస్ట్రేషన్ లేకపోతే..
* వాహనం సర్వీసింగ్ కట్
* ఈమేరకు జిల్లా వాహన డీలర్లకు రవాణాశాఖ లేఖ
* బీమా కోల్పోతారంటూ వాహనదారులకు అవగాహన
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మీ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే ఇక నుంచి మీ బండిని వాహన డీలర్లు సర్వీసు చేయరు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు జిల్లాలోని వాహన డీలర్లందరికీ లేఖలు రాశారు. అనేక మంది వాహనదారులు వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.
దీనిని నిలువరించే యంత్రాంగం ప్రస్తుతానికి ఏదీ అమల్లో లేదు. దీంతో వాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ లేకుండానే ఎంచక్కా వాహనాల్లో.... ప్రధానంగా టూ వీలర్, కార్లు, ట్రాక్టర్లల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని కట్టడి చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని వాహనాలు పర్మినెంటు రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్నాయనే దానిపై వారు లెక్కలు తీస్తున్నారు.
రిజిస్ట్రేషన్ లేకపోతే...బీమా కట్!
రిజిస్ట్రేషన్ లేని వాహనంపై ప్రయాణిస్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే బీమా కంపెనీలు సదరు వాహనానికిగానీ... వాహనంపై ప్రయాణించే వారికి కానీ బీమా మొత్తాన్ని అందజేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ప్రమాదం జరిగిన వాహనానికిగానీ, వాహనంపై ప్రయాణిస్తున్న వారికిగానీ ఎటువంటి బీమా మొత్తం అందలేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వాహనదారులకు కూడా ఉపయోగకరమని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) మీరాప్రసాద్ తెలిపారు. అందుకే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ డీలర్లకు లేఖలు రాసినట్లు ఆయన ‘సాక్షి’కి వివరించారు.
ఆదాయానికి అవకాశం !
వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులకు మొదట తాత్కాలిక (టెంపరరీ) రిజిస్ట్రేషన్ (టీఆర్) నంబరును కేటాయిస్తారు. వాస్తవానికి టీఆర్ నంబరు వచ్చిన నెల రోజుల్లోగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకోని పక్షంలో ఎటువంటి జరిమానాలు విధించే అధికారం రవాణాశాఖకు లేదు. దీంతో అనేక మంది పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు.
ఫలితంగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆదాయాన్ని రవాణాశాఖ తాత్కాలికంగా కోల్పోయినట్టు అవుతోంది. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యతో తప్పకుండా వాహనదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ఆదాయం కూడా పెరుగుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద రవాణాశాఖ తాజా నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.