వాహన రిజిస్ట్రేషన్లు షురూ
టీఎస్ 02 ఈఏ, ఈబీ, ఈసీ, ఈడీ సిరీస్‌లు
- ఫ్యాన్సీ నెంబర్లకు పాత పద్ధతే
- రిజర్వయిన 02 నంబర్లు
- ఆర్టీవో దుర్గప్రమీల
తిమ్మాపూర్ : జిల్లాలో కొత్త సిరీస్‌తో వాహన రిజిష్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాకు 02 కోడ్‌ను కేటాయించడంతో టీఎస్02 పేర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 02 ఈఏ సిరీస్‌తో మొదలు కాగా, జగిత్యాల ఆఫీసులో టీఎస్ 02 ఈబీ...తో, పెద్దపల్లి ఆఫీసులో టీఎస్ 02 ఈసీ...తో, కోరుట్ల ఆఫీసులో టీఎస్ 02 ఈడీ...తో నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిష్ట్రేషన్లు ప్రారంభించారు. జిల్లాలో ట్రాన్స్‌పోర్టు వాహనాలకు, మాక్సీ క్యాబ్‌లకు టీఎస్ 02 యూఏతో రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. పోలీసు శాఖ వాహనాలకు టీఎస్ 02 పీ.., ఆర్టీసీ వాహనాలకు టీఎస్ 02 జెడ్...,ను కేటాయిస్తూ పాత నంబర్ల తర్వాతే నంబర్లను కేటాయించాలని ఉత్తర్వులో పేర్కొన్నట్లు ఆర్టీవో దుర్గప్రమీల తెలిపారు.
01 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.50వేలు చెల్లించాల్సి ఉండగా ఎవరూ తీసుకోలేదు. దీని తర్వాత 02 నంబర్ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల కేంద్రాల్లో రిజర్వేషన్ అయింది. కరీంనగర్‌లో టీఎస్ 02 ఈఏ 0002 నంబర్‌ను వరద శేషయ్య, జగిత్యాలలో టీఎస్ 02 ఈబీ 0002 నంబర్‌ను అర్చన, పెద్దపల్లిలో టీఎస్ 02 ఈసీ 0002 నంబర్‌ను బి.స్రవంతి రిజర్వు చేసుకున్నారు. అలాగే కరీంనగర్‌లో 06, 07 నంబర్లు రూ.పది వేలకు, 11 నంబర్ రూ.5వేలకు రిజర్వ్ అయ్యాయి. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి టీఎస్ 02 యూఏ 0002 నంబర్ అబ్దుల్ షకీల్‌కు కేటాయించినట్లు ఆర్టీవో తెలిపారు. టీఎస్ 02 ఈఏ 0333 నంబర్ గంగాధరకు చెందిన కొత్త జైపాల్‌రెడ్డి రూ.30వేలకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆమె తెలిపారు. నంబర్ రిజర్వేషన్ ప్రక్రియలో పాత పద్ధతినే పాటిస్తున్నామని పేర్కొన్నారు.