వాహన రిజిస్ట్రేషన్లకు బ్రేక్
- కొత్త సిరీస్‌పై తొలగని ప్రతిష్టంభన
- మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సిరీస్‌పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నగరంలో సోమవారం కూడా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ వాహనాల నమోదు ప్రక్రియకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రానికి ‘టీజీ’ సిరీస్ ఉంటుందని మొదట భావించినా.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ‘టీజీ’కి బదులు ‘టీఎస్’ ఉండాలని సూచించడంతో రవాణా అధికారులు మరోసారి ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు.
టీఎస్ సిరీస్‌ను కేటాయిస్తూ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువడలేదు. దీంతో సోమవారం కొత్త వాహనాల నమోదుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రానికి సంబంధించిన సిరీస్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోడ్‌లపైనా స్పష్టత రావలసి ఉంది.
ఒకవేళ కేంద్రం నుంచి కొత్త సిరీస్‌పై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు వెలువడినా జిల్లా కోడ్‌లు, ప్రాంతీయ రవాణా కేంద్రాల నెంబర్ల రూపకల్పనకు కొంత సమయం పట్టొచ్చని రవాణా అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రానిదే తాము అడుగు ముందుకు వేయలేమని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
రోజు వెయ్యికిపైగా కొత్త వాహనాలు
గ్రేటర్ పరిధిలోని పది ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటిలో 75 శాతం ద్విచక్ర వాహనాలే. కానీ రవాణాశాఖ సెంట్రల్ సర్వర్ నిలిపివేతతో గత నెల 31 నుంచే వాహనాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సోమవారం రెండు రాష్ట్రాల్లోనూ సెంట్రల్ సర్వర్ పునరుద్ధరణ జరిగింది.
లర్నింగ్ లెసైన్స్‌లు, శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల బదిలీ వంటి కార్యకలాపాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలకు సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ జరిగినా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిరీస్‌పై స్పష్టత లేకపోవడం వల్ల నగరంలో వాహనాల నమోదు శాశ్వత నమోదు ఆగిపోయింది. మరోవైపు రాష్ర్ట అవతరణ ఉత్సవాల దృష్ట్యా పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల సంఖ్యా పలుచబడింది.