సాక్షి, అనంతపురం: నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో జేసీ సోదరులతో చేయి కలిపిన పాత్రదారులపై ఉచ్చు బిగిస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలోకి తొక్కి అక్రమార్జన కోసం జేసీ సోదరులు అడ్డదారులు తొక్కారు. జాతీయస్థాయి స్కాం ఎక్కడ బయట పడుతుందోనని మరిన్ని నేరాలకు పాల్పడ్డారు. ఇందులో కొందరు అధికారులు, మరికొంత మంది ప్రైవేటు వ్యక్తులు ప్రమేయముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
154 బీఎస్–3 వాహనాలకు రిజిస్ట్రేషన్..
ప్రభుత్వం నిషేధించిన బీఎస్–3 లారీలు, టిప్పర్లను నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో ఒకేసారి 154 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ అక్రమ బాగోతంలో కీలక నిందితుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జఠాధర కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో సుప్రీంకోర్టు బీఎస్–3 వాహనాలపై ఆంక్షలు విధించింది. 2017, ఏప్రిల్ 1 తర్వాత సదరు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం చట్టారీత్యా నేరం. ఈ విషయం తెలిసినప్పటికీ జేసీ సోదరులు వాహనాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఎన్‌ఓసీలతో జిల్లాకు తీసుకొచ్చారు. ఒక్కో వాహనంపై రూ.3 నుంచి రూ.4 లక్షల్లోపు ఖర్చు చేసి రూ. కోట్లు లబ్ధి పొందారు. చదవండి: అనంతపురం జైలు వద్ద హైడ్రామా!
మరింత లోతుగా దర్యాప్తు..
జేసీ బ్రదర్స్ అవినీతి బండారం బయటపడడంతో ఆధారాలు సేకరించిన అధికారులు శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులందరిపైనా వేటు పడే అవకామున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అవినీతి అక్రమాలు బయటపడిన తర్వాత రాష్ట్ర రవాణాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరుగా నాగాలాండ్‌కు వెళ్లి సదరు వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న జేసీ సోదరులు సదరు వాహనాలను కనుమరుగు చేసేందుకు యత్నించారు. కొన్ని వాహనాలను ఇతరులకు విక్రయించగా.. మరికొన్నింటిని ఇతర రాష్ట్రాలకు బదలాయించారు. ఈ వ్యవహారంలో వివిధ సెక్షన్ల కింద మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..!
పాత్రదారులందరిపైనా వేటు..
జేసీ బ్రదర్స్ కంపెనీలు చేసిన అవినీతి కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులందరిపైనా త్వరలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వాహనాల లావాదేవీల్లో పాత్రదారులను ఇప్పటికే గుర్తించారు. అయితే వాహనాలు కొని మోసపోయి వారిపైనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేసారి నాగాలాండ్ నుంచి 154 వాహనాలు (అందులో వందకు పైగా జిల్లాకు) ట్రాన్స్‌ఫర్ అయినా ఆర్టీఏ అధికారులు పసిగట్టలేదు. నకిలీ పోలీసు క్లియరెన్స్‌ల ద్వారా ఇతరులకు విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్ర కూడా లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని అరెస్ట్‌లుంటాయని సమాచారం. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో పాత్ర ఉందని భావిస్తున్న వారిందరిలోనూ ఆందోళన ప్రారంభమైంది.
‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు
Published Mon, Jun 15 2020 8:15 AM | Last Updated on Mon, Jun 15 2020 9:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment